బాధితులకు అత్యాధునిక వైద్య సేవలు

Alla Nani Comments About Covid-19 Prevention In AP - Sakshi

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడి

ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు

కర్నూలులో ల్యాబ్‌ ఏర్పాటుకు ఐసీఎంఆర్‌కు ప్రతిపాదనలు: మంత్రి బుగ్గన

కర్నూలు(సెంట్రల్‌): రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, అన్ని జిల్లాల్లో కోవిడ్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన పనిలేదన్నారు. ప్రభుత్వానికి సహకరిస్తూ అత్యవసరమైతేనే ఇల్లు వదిలి బయటకు రావాలని సూచించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లో జిల్లాలో కరోనా నివారణ చర్యలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతో కలిసి అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 

► సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతినిత్యం కరోనా నివారణ చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ.. అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. 
► ఢిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా సోకడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయిందన్నారు. 
► కర్నూలు జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకున్నా.. ఢిల్లీకి వెళ్లివచ్చిన వారితో జిల్లాలో పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరిగిందన్నారు. 
► కర్నూలు జిల్లా నుంచి ఢిల్లీకి వెళ్లిన 357 మందిని గుర్తించి క్వారంటైన్లకు తరలించామన్నారు. 
► విదేశాల నుంచి కర్నూలు జిల్లాకు 840 మంది రాగా, వారందరినీ క్వారంటైన్‌లో ఉంచామన్నారు. 

హైదరాబాద్‌లో పరీక్షలు!
కర్నూలులో కరోనా పరీక్షల ల్యాబ్‌ ఏర్పాటు చేసేందుకు ఐసీఎంఆర్‌కు ప్రతిపాదనలు పంపామని, అక్కడి నుంచి అనుమతులు రాగానే ఏర్పాటు చేస్తామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. పాజిటివ్‌ కేసుల నిర్ధారణకు ఎక్కువ సమయం పడుతుండటంతో కర్నూలు వ్యక్తుల శాంపిళ్లకు హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహించేలా కొన్ని సంస్థలతో మాట్లాడామని చెప్పారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top