ఈనెల 26న హైదరాబాద్‌లో జరగనున్న సమైక్య శంఖారావం సభకు పార్టీ శ్రేణులతోపాటు రాజకీయాలకు అతీతంగా సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పిలుపునిచ్చారు.
సాక్షి, నెల్లూరు: ఈనెల 26న హైదరాబాద్‌లో జరగనున్న సమైక్య శంఖారావం సభకు పార్టీ శ్రేణులతోపాటు రాజకీయాలకు అతీతంగా సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ సమైక్యశంఖారావం సభను అధికార, ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నా, నిర్వహణకు న్యాయస్థానం అనుమతినివ్వడం హర్షనీయమన్నారు. హైదరాబాద్‌లో సభను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించి సమైక్యనినాదాన్ని చాటాల్సిన అవసరం ఉందన్నారు.
అందువల్లే సమైక్యాంధ్ర కోసం కట్టుబడిన వైఎస్సార్‌సీపీ సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తోందన్నారు. ఈ సభకు సమైక్యవాదులైన తెలుగువారందరూ తరలి వచ్చి తెలుగుజాతి గుండె చప్పుడును వినిపించాలన్నారు. కాంగ్రెస్, టీడీపీ ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తూ రాష్ట్ర విభజనకే కట్టుబడి ఉన్నాయని మేరిగ విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందన్నారు. శంఖారావం సభ విజయవంతం కోసం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు చెందిన సమన్వయకర్తలతో ప్రత్యేకంగా చర్చిస్తామన్నారు.