బార్ల యజమానుల బరితెగింపు

Alcohol Sales in SPSR Nellore in Lockdown Time - Sakshi

తెరచాటుగా మద్యం విక్రయాలు

ఎమ్మార్పీ కంటే మూడింతలు అధిక రేట్లకు విక్రయాలు

మద్యం విక్రయాలపై కలెక్టర్‌ సీరియస్‌

ఇటీవల ఓ బార్‌ను సీజ్‌ చేసిన ఎక్సైజ్‌ అధికారులు

అయినా ఆగని అక్రమ అమ్మకాలు

సాక్షి, నెల్లూరు: బార్ల యజమానులు బరితెగిస్తున్నారు. ఓ వైపు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటిస్తే..మరో వైపు లాక్‌డౌన్‌ చాటున అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. కరోనా మహమ్మరితో యావత్‌ ప్రపంచం వణికిపోతోంది. మన దేశంలో సైతం కరోనా విజృంభిస్తుండడంతో సామూహిక కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. జిల్లాలో 144 సెక్షన్‌ను అమలు చేస్తూ కేవలం నిత్యావసర సరుకులు మాత్రమే అందుబాటులో ఉంచి కఠిన ఆంక్షలతో బయట ఎవరూ తిరగకుండా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. అందులో భాగంగా మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ నగరంలోని బార్ల యజమానులు కరోనా కట్టడిని కూడా క్యాష్‌ చేసుకుంటున్నారు. బార్లకు సీల్‌ వేసినా  దొంగచాటుగా విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్‌ శాఖ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

జిల్లాలో 280 మద్యం దుకాణాలు, 46 బార్లు ఉన్నాయి. నగరంలో 31 వరకు బార్లు ఉన్నాయి. కరోనా కట్టడి కోసం ఈ నెల 31 వరకు మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపి వేశారు. మద్యం దుకాణాలు, బార్లకు సీల్‌ వేశారు.  నగరంలోని కొందరు బార్ల యజమానులు  ఈ అవకాశాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు. మద్యం దుకాణాలు బంద్‌ చేస్తున్నారన్న విషయం ముందుగానే పసిగట్టి మద్యం కేసులు రహస్య ప్రాంతాలకు తరలించారు. బార్ల ముందు వైపు సీల్‌ ఉన్నా వెనుక వైపు రహస్య ద్వారం నుంచి కేసులు బయటకు తెప్పించి మద్యం విక్రయాలు చేయిస్తున్నారు. మూడ్రోజుల క్రితం నగరంలోని లీలామహల్‌ సెంటర్‌లోని ఓ బార్‌ను నిబంధనలను అతిక్రమించి పబ్లిక్‌గానే ఓపెన్‌ చేసి మద్యం విక్రయాలు జరిపారు. కర్ఫ్యూ అమలవుతున్న సమయంలో బార్‌లో మద్యం విక్రయాలు చేయడాన్ని జిల్లా కలెక్టర్‌ సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అయ్యప్పగుడి, విజయమహాల్‌ గేట్, పత్తేఖాన్‌పేట, పొదలకూరు రోడ్‌  పరిసర ప్రాంతాల్లో మద్యాన్ని దొంగచాటుగా విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది.

ఎమ్మార్పీ కంటే అధికం
నగరంలో బార్‌ యజమానులు దొంగచాటుగా మద్యం విక్రయాలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. పుల్‌ బాటిల్‌పై  ఉన్న ఎమ్మార్పీ కంటే మూడింతలు అధిక రేట్లకు విక్రయాలు చేస్తున్నారు. మ్యాన్‌సన్‌ హౌస్‌ పుల్‌ బాటిల్‌ రూ.3500, బ్లాక్‌ క్యాట్‌ పుల్‌బాటిల్‌ రూ.6000..ఇలా ఎమ్మార్పీ కంటే మూడింతలు రేట్లు పెంచి విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది. మద్యం ప్రియులు అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తుండడంతో డిమాండ్‌ను బట్టి రేట్లు పెంచుతూ బార్‌ యజమానులు జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బార్లపై నిఘా ఉంచాం
నగరంలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లకు సీల్‌ వేశాం. దొంగచాటుగా అమ్మకాలు మా దృష్టికి రాలేదు. మూడ్రోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తుండగా ఓ బార్‌ను సీజ్‌ చేశాం. ప్రతి బార్‌ వద్ద ఎక్సైజ్‌ సిబ్బందితో నిఘా పెట్టాం.– రత్నం, సీఐ, ఎక్సైజ్‌ శాఖ, నెల్లూరు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top