తాగు.. ఊగు | Alchol is flowing very rapidly in kurnool district | Sakshi
Sakshi News home page

తాగు.. ఊగు

Dec 15 2013 4:00 AM | Updated on Sep 2 2017 1:36 AM

తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని గ్రామా ల్లోనూ మద్యం ఏరులై పారుతోంది. అధికా రులు లేదులేదంటూనే.. బెల్ట్‌కు ఊతమిస్తున్నారు. తమకు ముట్టాల్సినది ముడితే..

తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని గ్రామా ల్లోనూ మద్యం ఏరులై పారుతోంది. అధికా  రులు లేదులేదంటూనే.. బెల్ట్‌కు ఊతమిస్తున్నారు. తమకు ముట్టాల్సినది ముడితే..  ఏమి చేసుకున్నా ఫర్వాలేదనే భరోసానిస్తున్నారు. ఆదాయం బాగానే ఉండటంతో వీటికీ అన ధికార వేలం పాట తప్పనిసరి చేశారు. అధికార పార్టీ కనుస న్నల్లో సాగుతున్న ఈ బాగోతం  పల్లె ప్రజలకు ‘మత్తెక్కిస్తోంది’.
 
 కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: మద్యం దుకాణాన్ని దక్కించుకోవాలంటే కోట్ల రూపాయలతో పని. అయితే ఆదాయం ఆ స్థాయిలో ఉంటుందో.. లేదోననే బెంగ. ఏమి చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే బెల్ట్ షాపులు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వైన్స్ షాపులను టెండర్లలో దక్కించుకున్న నిర్వాహకులే అధికారులను మచ్చిక చేసుకొని అనధికార దుకాణాలకు తెరతీశారు.
 
 వీరికి రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గంలోని ఓ గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహణకు గ్రామ కమిటీ నిర్వహించిన వేలంలో కాంగ్రెస్ నేత ఒకరు రూ.9 లక్షలతో దక్కించుకున్నారంటే గ్రామాలను మద్యం ఏ స్థాయిలో ముంచెత్తుతుందో తెలియజేస్తోంది. ఇక కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో నాటుసారా పుష్కలంగా దొరుకుతుండడంతో ప్రజలు మత్తులో జోగుతున్నారు. వీటిని నియంత్రించాల్సిన పోలీస్, ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో మిన్నకుండిపోతున్నారు.
 
 జిల్లాలోని అధికారికంగా 188 మద్యం దుకాణాలు ఉండగా.. బెల్ట్ షాపులు దాదాపు 3వేల పైమాటే. ప్రతి గ్రామంలో మూడుకు మించి బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. వీటి నిర్వాహకులు ఆయా మండల కేంద్రాల్లో అధికారికంగా నిర్వహిస్తున్న మద్యం షాపుల నుంచే తరలిస్తున్నా అడిగే నాథుడు కరువయ్యాడు. ఇదే అదనుగా బెల్ట్ షాపుల్లో ఒక్కో బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20లు అధికంగా వసూలు చేస్తున్నారు. చాలా గ్రామాల్లో కిరాణా సరుకులు అప్పుగా ఇస్తున్నట్లే మద్యం కూడా అరువిస్తూ ప్రజలను మత్తులో ముంచెత్తుతున్నారు. లెసైన్స్‌డ్ మద్యం దుకాణాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్థానిక రాజకీయ నేతలకు భాగస్వామ్యం ఉంటోంది. దీంతో బెల్ట్ షాపుల నిర్వహణకు ఆయా ప్రాంతాల్లోని అధికార పార్టీ నేతల అండదండలు తప్పనిసరి. వీరి అండ ఉండటంతో అధికారులు కూడా అందిన దాంతో సంతృప్తి చెందుతున్నారు.
 
 కుప్పలు తెప్పలుగా బెల్ట్‌షాపులు
 ఆదోని నియోజకవర్గంలోని పెద్దహరివాణం, నాగనాథనహళ్లి, బసాపురం, దొడ్డనగేరితో పాటు శివారు ప్రాంతాల్లో బెల్ట్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆలూరు మండలంలో 22, దేవనకొండలో 42, ఆస్పరిలో 20, హోళగుంద మండలంలోని అన్ని గ్రామాల్లో, చిప్పగిరి మండంలో 11 గ్రామాల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలోని కరివేన, కొట్టాలచెరువు, అమలాపురం, బండి ఆత్మకూరు, సోమయాజుల పల్లె, భోదనం, పెద్ద, చిన్న దేవాళాపురం, మహానంది, గాజులపల్లె, అబ్దుల్లాపురం, రేగడగూడురు, గుంతకందాల, బోయరేవుల గ్రామాల్లో ‘బెల్ట్’ వ్యాపారం లక్షల్లో సాగుతోంది. పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో దాదాపు 260 బెల్ట్ షాపులు ఉన్నట్లు సమాచారం. నంద్యాల పరిధిలోని కానాల, పోలూరులో మద్యం దుకాణాలకు లెసైన్స్ ఉండగా.. పక్కనే ఉన్న బాపూజీనగర్, బిల్లలాపురం, మిట్నాల, చాబోలు, పుసులూరు తదితర గ్రామాల్లో మందు బాబులకు కావాల్సినంత మద్యం బెల్ట్ షాపుల్లో దొరుకుతోంది. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఇదే తంతు కొనసాగుతోంది.
 
 ఫ్యాక్షన్ గ్రామాల్లో
 భయం.. భయం
 మద్యం విచ్చలవిడిగా లభిస్తుండటంతో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలు దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో ఫ్యాక్షన్, వర్గ వైశమ్యాలు ఉండటంతో మద్యం మత్తులో ఎప్పుడు ఎలాంటి గొడవలు చోటు చేసుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. తమ గ్రామాల్లోని బెల్ట్ దుకాణాలను ఎత్తేయాలని పలుమార్లు స్థానికులు పోలీసులను వేడుకుంటున్నా ఫలితం లేకపోతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement