సబ్సిడీకి ‘పాత’ర | Agriculture department is not supplying seeds properly | Sakshi
Sakshi News home page

సబ్సిడీకి ‘పాత’ర

Apr 16 2015 1:57 AM | Updated on Oct 1 2018 2:00 PM

పదేళ్ల క్రితం పరిశోధనల్లో రూపొందించిన వంగడాల విత్తనాలనే నేటికీ జిల్లా రైతులు వినియోగిస్తున్నారు.

పాత వంగడాలకు రాంరాం
కొత్త రకాల విత్తనాలకే రాయితీ
పూర్తి స్థాయిలో విత్తనాలు సరఫరా చేయని వ్యవసాయశాఖ
మళ్లీ పాతవే రైతులకు దిక్కు


పదేళ్లుదాటిన వంగడాల సాగుకు స్వస్తి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాటికి ప్రస్తుతం ఇస్తున్న రాయితీలను ఎత్తివేసింది. కొత్త రకాలకు మాత్రమే సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే విస్తీర్ణానికి తగ్గట్టు విత్తనాలను సరఫరా చేయలేని దుస్థితి జిల్లాలో నెలకొంది.

సాక్షి, విశాఖపట్నం : పదేళ్ల క్రితం పరిశోధనల్లో రూపొందించిన వంగడాల విత్తనాలనే నేటికీ జిల్లా రైతులు వినియోగిస్తున్నారు. ఈ కారణంగా  దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. ఉద్యాన, వాణిజ్య పంటల కంటే అన్నదాతలు ఎక్కువగా వరి సాగుపైనే ఆసక్తి కనబరుస్తారు. పాతవంగడాలనే విత్తనాలుగా దాచుకుంటున్నారు. వీటితో ప్రస్తుతం ఎకరాకు 15 నుంచి 20 బస్తాలకు మించి దిగుబడి రావడం లేదు. అలాగే ఈ వంగడాలు తెగుళ్లకు గురవుతున్నాయి. మోతాదుకు మించి మందులు, ఎరువుల వినియోగంతో భూసారం తగ్గిపోతోంది.

నాలుగు ఐదు ఏళ్లుగా వీటి వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితం కనిపించడంలేదు. దీంతో ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లోనూ పాతవంగడాల వినియోగానికి పుల్‌స్టాప్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో సోనామసూరి, సాంబమసూరి, స్వర్ణ మసూరి, శ్రీకాకుళం సన్నాలు రకాలు వాడుతున్నారు. ఎకరాకు 30 కిలోల వరకు విత్తనం అవసరం. రకాన్ని బట్టి కిలోకు ఐదు నుంచి పది రూపాయల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది. రానున్న ఖరీఫ్ నుంచి వీటిపై సబ్సిడీని ఎత్తేయడంతోపాటు పాత వంగడాల సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది.

వీటి స్థానంలో కొత్తగా ఎన్‌ఎల్‌ఆర్-34449 (నెల్లూరు సన్నాలు), ఎంపీయూ-1061(ఇంద్ర), ఎంపీయూ -1075 (పుష్యమి), ఆర్‌జీఎల్-11414 (వంశధార) రకాలను వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తోంది. ఈ వంగడాలన్నీ రెండు మూడేళ్లలో పరిశోధనల ఫలితాలే. కాగా పాత వంగడాలు వద్దని చెబుతున్న ప్రభుత్వం కొత్త వంగడాల వినియోగానికి సంబంధించి విస్తీర్ణానికి తగ్గట్టుగా విత్తనాలను సరఫరా చేసే స్థితిలో మాత్రం లేదు. ప్రస్తుతం కేవలం 30 శాతం విస్తీర్ణానికి మాత్రమే ఈ కొత్త విత్తనాలను అందు బాటులో ఉంచుతోంది. మిగిలిన 70 శాతం విస్తీర్ణానికి రైతులు మళ్లీ పాత వంగడాలపైనే ఆధారపడక తప్పదు.

పూర్తిస్థాయిలో విత్తనాలు సరఫరా చేయలేనప్పుడు సబ్సిడీ ఏ విధంగా ఎత్తివేస్తారని ప్రశ్నిస్తే మాత్రం రైతులు ఇంకా ఈ కొత్త వంగడాల సాగు వైపు పూర్తి స్థాయిలో ఆసక్తి చూపడంలేదని, అందువల్లే ఈ ఏడాది 30 శాతం విస్తీర్ణానికి సరపడా విత్తనాలనే సిద్ధం చేశామని అధికారులు చెప్పుకొస్తున్నారు. గతేడాది జిల్లాలో 4,69,894 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. రానున్న ఖరీఫ్‌లో మరో 30వేల ఎకరాలు అదనంగా సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఈ ఏడాది అన్ని రకాల పంటలు కలిపి సుమారు ఐదు లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశాలున్నాయి.

అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.8 లక్షల ఎకరాల్లో వరి, లక్ష ఎకరాల్లో చెరకు, 60వేల ఎకరాల్లో రాగి, 4వేల ఎకరాల్లో వేరుశనగ, 20వేల ఎకరాల్లో మొక్కజొన్న, మరో 25 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యే అవకాశాలున్నాయి. ఇక వరి తర్వాత జిల్లాలో ఎక్కువగా సాగు చేసే చెరకు విషయంలో ఇబ్బంది లేకున్నా వేరుశనగలో ఇప్పటి వరకు జేఎల్-24,టిఎంవీ-2 రకాలుసాగు చేస్తున్నారు.

వీటి స్థానంలో కే-9, కె-6, ధరణి, నారాయణి రకాలు, మినుములో ఇప్పటి వరకు టి-9 వెరైటీని వాడుతుండగా, ఇక నుంచి ఎల్‌బీజీ 752, టీబీజీ 104, పీయూ-31, అలాగే పెసరలో ఇప్పటి వరకు ఎంఎల్-267 రకాన్ని వాడుతుండగా, ఇక నుంచి ఎల్‌జీజీ-462, ఎల్‌జీజీ-460, అలాగే లోకల్ రకాలకే పరిమితమైన కందుల సాగులో ఇక నుంచి ఎల్‌ఆర్‌జీ-41,ఎల్‌ఆర్‌జీ-42, అలాగే నువ్వులులో వైఎల్‌ఎం-11,వైఎల్‌ఎం-17, రాగుల్లో సింహాద్రి, విజెడ్‌ఎం వెరైటీ వంగడాలను  ఖరీఫ్‌లో ప్రోత్సహిస్తున్నారు. మిగిలిన పంటలకు కొత్తవంగడాలు సరిపడా అందుబాటులో ఉంచినప్పటికీ వరిలో మాత్రం కేవలం 30 శాతం విస్తీర్ణానికి సరిపడా విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement