‘సాక్షి’ పాత్రికేయుడు రాంబాబుకు వ్యవసాయ అవార్డు

Agricultural Award to Sakshi Journalist Panthangi Rambabu

ప్రదానం చేసిన సారా, ఎస్వీయూ

యూనివర్సిటీ క్యాంపస్‌(తిరుపతి): ‘సాక్షి’దినపత్రికలో న్యూస్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్న సీనియర్‌ పాత్రికేయుడు పంతంగి రాంబాబుకు ‘ప్రకృతి వ్యవసాయ విద్యారత్న’ అవార్డు లభించింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో శనివారం దేశీయ విత్తన మేళా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ మేళాను సౌత్‌ ఏసియన్‌ రూరల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అసోసియేషన్‌(సారా), ఎస్వీయూ పర్స్‌ సెంటర్‌ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. పంతంగి రాంబాబు ‘సాక్షి’ దినపత్రికలో ‘ఇంటి పంట’ పేరుతో కథనాలతో పాటు ‘సాగుబడి’ శీర్షికన ప్రతి వారం వ్యవసాయ వార్తలను అందిస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ అనేక కథనాలు రాశారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వరించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ వి.దామోదరం నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. అలాగే బెంగళూరుకు చెందిన సహజ సీడ్స్‌ సంస్థ యజమాని జి.కృష్ణ ప్రసాద్‌కు ‘దేశవాళీ విత్తన సంరక్షక’ అవార్డు లభించింది. కృష్ణప్రసాద్‌ దక్షిణ భారతదేశంలోని 786 సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లకు వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలను అందిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top