కదం తొక్కిన అగ్రిగోల్డ్‌ బాధితులు.. రాష్ట్రవ్యాప్త నిరసనలు

Agri Gold Victims Protest In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవటంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అగ్రిగోల్డ్‌ బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేపట్టారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు వారికి మద్దతుగా నిలిచాయి. బాధితులకు అండగా ఉంటూ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నాయి.  

వైఎస్సార్‌ జిల్లా : ఏపీ ప్రభుత్వం తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్లలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద మండల అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి వైఎస్సార్‌ సీపీ మద్దతుగా నిలిచింది. ప్రొద్దుటూరులో సైతం అగ్రిగోల్డ్‌ బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వారికి అండగా వైఎస్సార్‌ సీపీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. 

కర్నూలు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల పార్లమెంట్ విభాగం ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులకు సంఘీభావం తెలుపుతూ నంద్యాలలోని మున్సిపల్ కార్యాలయం వద్ద అగ్రిగోల్డ్ బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలలో కర్ర హర్షవర్ధన్ రెడ్డి, గంగుల బిజేంద్ర రెడ్డి (నాని), మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మిగన్నూరు  సోమప్ప కూడలిలో అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, రుద్రగౌడ్, జగన్‌మోహన్‌ రెడ్డిలు మద్దతుగా నిలిచారు. 

ప్రకాశం : అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవటంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఒంగోలు ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్సార్‌ సీపీ అగ్రిగోల్డ్ బాసట కమిటీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు భారీగా పాల్గొన్నారు. 

విజయనగరం : చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలో అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. అగ్రిగోల్డ్ సంస్థ బారిన పడి తీవ్రంగా నష్టపోయిన బాధితులకు న్యాయం జరపాలన్న డిమాండ్‌తో కురుపాం నియోజకవర్గ కేంద్రంలో అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు పరీక్షీత్ రాజు ఆధ్వర్యంలో రెండు రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 

గుంటూరు : అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. కమిటీ రాష్ట్ర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి కలెక్టరేట్ ఎదుట దీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త ఏసురత్నం శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. 

శ్రీకాకుళం : గాంధీ విగ్రహం వద్ద అగ్రిగోల్డ్ బాధితులు నిరసన చేపట్టారు. కాశీబుగ్గ మహాత్మా  గాంధీ విగ్రహం వద్ద అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ శ్రీకాకుళం వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ కన్వీనర్ దువ్వాడ శ్రీకాంత్,  వైఎస్సార్‌ సీపీ పలాస నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల నిరసనలు చేపట్టారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top