తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమవుతున్న తరుణంలో... షరతులు పెడదామని ప్రయత్నిస్తే మహోద్యమం చేస్తామని టీఆర్‌ఎస్ శాసనసభపక్షనేత ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ హెచ్చరించారు.
టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమవుతున్న తరుణంలో... షరతులు పెడదామని ప్రయత్నిస్తే మహోద్యమం చేస్తామని టీఆర్‌ఎస్ శాసనసభపక్షనేత ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ హెచ్చరించారు. ఉద్యమాన్ని కీలక దశకు చేర్చిన కేసీఆర్ దీక్షకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గకేంద్రాల్లో శుక్రవారం దీక్షా దివస్ నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో చేపట్టిన దీక్షలకు ఈటెల, వినోద్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మహాత్మాగాంధీ స్వాతంత్య్రం కోసం సబర్మతి ఆశ్రమం నుంచి దండియాత్రకు బయలుదేరితే, కేసీఆర్ ఉత్తర తెలంగాణభవన్ నుంచి దీక్షకు బయలుదేరారన్నారు.
దీక్షకు దిగిన కేసీఆర్‌ను బలవంతంగా అరెస్టు చేస్తే తెలంగాణ యావత్తు అండగా నిలిచి రాష్ట్ర ప్రకటన వచ్చేవరకూ నిప్పు కణికై మండిందన్నారు. ప్రకటనను కాంగ్రెస్ పార్టీ మళ్లీ వెనక్కి తీసుకుని 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మత్యాగాలకు కారణమైందని ఆరోపించారు. ఉద్యమాన్ని ఢిల్లీదాకా తీసుకెళ్లి, జాతీయపార్టీలను ఒప్పించి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేశామన్నారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితంగానే తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అధికారదాహంతో తామే తెలంగాణ ఇచ్చామని ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్య మం, చరిత్రాత్మకమైన కేసీఆర్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. కాంగ్రెస్ చిత్తశుద్ధితో వ్యవహరించి శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ఆమోదించాలని డిమాం డ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ ఇవ్వాలని, పెత్తనం చేసేందుకు కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తే సీమాంధ్రులారా ఖబడ్దార్ అని హెచ్చరించారు.
అసెంబ్లీలో యుద్ధమే : గంగుల
తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అడ్డుకోవాలని చూస్తే తెలంగాణ పొలిమేరలు దాటేదాకా తరిమికొట్టడమే కాక వీపులు పగులగొడతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఇందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా ఇందుకు మినహాయింపు కాదని, ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పారు. రాబోయే అసెంబ్లీ తెలంగాణ అంశంతో యుద్ధ వాతావరణంలో జరుగుతుందన్నారు. 1947లో గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం సాధిస్తే, 2013లో కేసీఆర్ తెలంగాణ సాధించడం ఖాయమని, కేసీఆర్ తెలంగాణ గాంధీగా కీర్తించబడతారని జోస్యం చెప్పారు.
త్యాగాల పునాదుల మీదే తెలంగాణ
: నారదాసు, ఈద
తెలంగాణ బిడ్డల త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడుతోందని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సిద్ధించేవరకూ పిడికిలి బిగించి పోరాడాలని పేర్కొన్నారు. పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. కార్యక్రమం ఆసాంతం తెలంగాణ కళాకారుడు వెంకటస్వామి కళాబృందం ఆలపించిన ఉద్యమ గీతాలు, ధూంధాం సభికులను ఉర్రూతలూగించాయి.