ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీకి 2.68 లక్షల క్లస్టర్లు 

Above 2lakh clusters for distribution of ration goods to home - Sakshi

ఒక్కో క్లస్టర్‌ పరిధిలో 50–60 కుటుంబాలు 

పౌర సరఫరాల శాఖ ప్రాథమిక అంచనా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి 2.68 లక్షల క్లస్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సరుకులను వలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరవేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పైలట్‌ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఈ విధానాన్ని ఇప్పటికే దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఒక్కో క్లస్టర్‌ పరిధిలో 50 నుంచి 60 కుటుంబాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వారి పరిధిలో రేషన్‌ సరుకుల సరఫరా కోసం అవసరమైన వాహనాలను వలంటీర్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంటింటికీ సరుకుల పంపిణీ ప్రక్రియ ఆర్థిక భారంతో కూడుకున్నప్పటికీ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. వలంటీర్లు తమకు కేటాయించిన రేషన్‌ కార్డులను మ్యాపింగ్‌ చేసుకోవాలి. రహదారి సౌకర్యం లేని కొండ ప్రాంతాల్లో ఉంటున్న గిరిజనుల ఇళ్లకు సైతం వెళ్లి సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అదనంగా అయ్యే రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. గతంలో శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాల లబ్ధిదారులు సబ్సిడీ సరుకులు సక్రమంగా తీసుకునేవారు కాదు.

రేషన్‌ దుకాణాలకు రావడానికి సరైన రహదారులు లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆ జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఇంటింటికీ బియ్యం పంపిణీ పథకం అమలు చేస్తున్నారు. దీంతో ప్రతి నెలా ఒకటి లేదా రెండో తారీఖుల్లో గిరిజనుల ఇళ్ల వద్దే బియ్యంతో పాటు ఇతర సరుకులు అందుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top