నేడు శ్రీవారి ఆణివార ఆస్థానం | Sakshi
Sakshi News home page

నేడు శ్రీవారి ఆణివార ఆస్థానం

Published Thu, Jul 17 2014 2:14 AM

Aanivara aasthanam puja will start in Tirumala temple today

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. పూర్వం మహంతుల పాలనలో దేవస్థానం ఆదాయ, వ్యయాల లెక్కలన్నీ ఆణివార ఆస్థానం రోజునే ప్రారంభమయ్యేవి. తర్వాత ధర్మకర్తల మండలి ఏర్పడ్డాక ఇంగ్లిష్ నెలల్లో ఆర్థిక సంవత్సరంలోకి మారాయి. అయితే, ఆచారం ప్రకారం ఆణివార ఆస్థానం ఉత్సవం నేటికీ అమలు చేస్తున్నారు.
 
 ఇందులో భాగంగా గురువారం మూలమూర్తి, ఉత్సవమూర్తులకు పట్టువస్త్రాలు, ఇతర వైదిక పూజలు చేస్తారు. పెద జీయరు, చిన జీయరు, టీటీడీ ఈవోకు జీయంగారి సీలు(మెహరు), తాళం చెవుల గుత్తి(లచ్చన)ని అందజేసి తీర్థం, శఠారి మర్యాదలు నిర్వహిస్తారు. స్వామి వారికి గమేకార్, మహంతు, మైసూరు, తాళ్లపాక, తరిగొండవారి హారతులిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారి నుంచి రూపాయి చొప్పున వసూలు చేసి స్వామి వారి ఖజానాకు జమ చేస్తారు. సాయంత్రం స్వామి వారికి పుష్ప పల్లకి ఉత్సవాన్ని నిర్వహిస్తారు.  కాగా,తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగింది.  సర్వదర్శనం  21 గంటలు, కాలిబాట భక్తులకు 10 గంటల తర్వాత దర్శనం లభించనుంది. రూ.300 టికెట్ల దర్శన క్యూను ఉదయం 12 గంటలకే నిలిపి వేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement