పడకేసిన మంచినీటి పథకాలు | A strong sense of schemes which | Sakshi
Sakshi News home page

పడకేసిన మంచినీటి పథకాలు

May 17 2014 12:31 AM | Updated on Sep 2 2017 7:26 AM

పడకేసిన మంచినీటి పథకాలు

పడకేసిన మంచినీటి పథకాలు

దాదాపు లక్ష జనాభా ఉన్న అనకాపల్లి పట్టణంలో 64 మంచినీటి పథకాలున్నాయి. చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కుళాయిలు ఏర్పాటు చేశారు.

  • మూడో వంతు పథకాల నుంచి అందని నీరు
  •  ప్రజల అవసరాల మేరకు లేని కుళాయిలు
  •  నీటి కోసం మహిళలకు తప్పని పాట్లు
  •  అక్కరకురాని బోరు బావులు
  •  అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్ : దాదాపు లక్ష జనాభా ఉన్న అనకాపల్లి పట్టణంలో 64 మంచినీటి పథకాలున్నాయి. చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కుళాయిలు ఏర్పాటు చేశారు. బోరు బావులకు లోటు లేదు. కానీ పట్టణ వాసుల గొంతు మాత్రం ఎండుతోంది. మూడో వంతు పథకాలు మూలకు చేరడం, ఉన్న కుళాయి పాయింట్ల నుంచి సరిపడే స్థాయిలో నీరందక పోవడం, బోరుబావులున్నా సరిగా అక్కరకు రాకపోవడంతో ప్రజలకు మంచినీటి కష్టాలు తీరడం లేదు.

    పట్టణం జీవీఎంసీలో విలీనమైతే తమ కష్టాలు తీరుతాయని భావించిన పట్టణ వాసులకు నిరాశే మిగిలింది. మన్సిపాలిటీగా ఉన్నప్పుడే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదని ప్రజలు భావిస్తున్నారంటే వారనుభవిస్తున్న వెతలను అర్థం చేసుకోవచ్చు. మొత్తం మంచినీటి పథకాల్లో 20 వరకు పనిచేయడం లేదు. మినీ ట్యాంకుల కోసం ఏర్పాటు చేసిన మోటార్లు పనిచేయక పోవడం, కొన్నిచోట్ల పైపులు శిథిలావస్థకు చేరడం సమస్యకు కారణం.

    గొల్లవీధి, వేల్పులవీధి, కాయగూరల మార్కెట్, గాంధీబొమ్మ నాయబ్రాహ్మణ వీధి, గవరపాలెం సంతోషిమాత కోవెల వద్ద, ఏఎంసీ కాలనీ మాధవ్ సదన్, దాసరిగెడ్డ తదితర ప్రాంతాల్లో ఉన్న మంచినీటి పథకాలు మూలకు చేరాయి. దీంతో ఈ ప్రాంతానికి సక్రమంగా నీరు సరఫరాకాక స్థానికులు అవస్థలు పడుతున్నారు.

    కుళాయిల ద్వారా నీరు విడుదల చేస్తున్నా స్థానికుల అవసరాలకు సరిపోవడం లేదు. వేసవి ఎద్దడి సమయంలో ట్యాంకులతోనైనా మంచినీటిని సరఫరా చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. బోరు బావులున్నా చాలా వరకు మూలకు చేరడం, మిగిలినవి అక్కరకు రాకపోవడంతో మహిళలు మంచినీటి కోసం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
     
    యథేచ్ఛగా నీటి వృథా
     
    ఓవైపు కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదని ప్రజలు వాపోతుంటే, ఉన్న కుళాయిల నుంచి ఎక్కడికక్కడ నీరు వృథా అవుతుండడం మరో సమస్యగా మారింది. చాలా కుళాయిలకు హెడ్స్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొనే సమయంలోనైనా నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
     
     ట్యాంకు పనిచేయడం లేదు
     నెల రోజుల నుంచి మంచినీటి ట్యాంకు పని చేయడం లేదు. అధికారులెవ్వరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వీధి కుళాయిలు దెబ్బతినడంతో నీరు వృథాగా పోతోంది. అధికారులు స్పందించి మంచినీటి ట్యాంకును బాగు చేయాలి.
     - ఎస్.సంతోషి, గొల్లవీధి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement