
రూ.10 వేల కోట్ల అప్పు.. వడ్డీతో సహా ప్రజల నెత్తినే భారం!
మంచినీటి పథకాల నిర్మాణానికి నిధుల కోసం జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు
ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి కార్పొరేషన్ ద్వారా నిధుల సమీకరణ
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ
రుణం చెల్లింపునకు బల్క్‌గా నీటి అమ్మకంతో నిధులు రాబట్టుకునేలా కార్పొరేషన్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని వెల్లడి
పంచాయతీలు, పట్టణాలు, పరిశ్రమల తాగునీటి అవసరాలకు నీటిని అందించే ప్రధాన సంస్థగా కార్పొరేషన్
అంటే, కార్పొరేషన్ ద్వారా పంచాయతీలు, పట్టణాలు బల్క్‌గా నీటి కొనుగోలు
స్థానిక సంస్థలు ఆ నీటిని సరఫరా చేసే ప్రజల నుంచే చార్జీల వసూలుకు వీలు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర రక్షిత మంచి నీటి పథకాల నిర్మాణం కోసం అప్పు రూపంలో రూ.10 వేల కోట్ల సమీకరణకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఈ రుణం తీసుకునేందుకు ‘ఆంధ్రప్రదేశ్ జల జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్’ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఇందుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ జీవో ఎంఎస్ నం.72 జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం.. తీసుకునే రుణం చెల్లింపునకు ‘బల్క్‌గా నీటి అమ్మకం వంటి చర్యల’ ద్వారా డబ్బును తిరిగి రాబట్టుకునే సమగ్ర ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకోవాలని గ్రామీణ మంచి నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) ఈఎన్‌సీకి ప్రభుత్వం సూచించింది. మరోవైపు ‘ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్’ గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, పరిశ్రమల తాగునీటి అవసరాలకు బల్క్‌గా నీటిని అందించే ప్రధాన సంస్థగా ఉంటుందని స్పష్టం చేసింది.
మొత్తంగా ఈ జీవో సారాంశం చూస్తే .. సమగ్ర రక్షిత మంచినీటి పథకాల ద్వారా శుద్ధి చేసే తాగునీటిని జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ నిర్ణీత ధరకు పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, పరిశ్రమలకు అమ్ముతుంది. తాము పెట్టిన ఖర్చును స్థానిక సంస్థలు... నీటిని వాడుకునే ప్రజల నుంచే వసూలు చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుతో పాటు రానున్న కాలంలో దానిపై వడ్డీ భారం మొత్తం ప్రజల నెత్తి పైనే పడనుందని స్పష్టమవుతోంది.
రూ.25 లక్షల పెయిడ్ ఆప్ క్యాపిటల్‌తో కార్పొరేషన్
కంపెనీల చట్టం నిబంధనల మేరకు స్వయంప్రతిపత్తితో కూడిన జల జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్‌ను రూ.కోటి మూల ధనంతో (పది లక్షల షేర్లు ఒక్కోటి రూ.10 ముఖ విలువ)తో ఏర్పాటు చేస్తారు. ఇందులో 2.50 లక్షల షేర్లకు రూ.25 లక్షలను ప్రభుత్వం పెయిడ్ అప్ క్యాపిటల్‌గా సమకూర్చుతుంది. కార్పొరేషన్ చైర్మన్‌గా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, వివిధ శాఖలకు చెందిన 9 మంది అధికారులు వైస్ చైర్మన్, డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు.
ఒక చీఫ్ ఇంజనీరు, ఇద్దరు ఈఈలు, ఏడుగురు డీఈఈలతో కలిపి 23 మందిని కార్పొరేషన్‌కు కేటాయించారు. విజయవాడ సమీపంలో గొల్లపూడిలో కార్యాలయం ఏర్పాటుతో పాటు సంస్థకు పూర్తి స్థాయి ఎండీని నియమించే వరకు ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీనే ఎండీగా కొనసాగుతారు. ప్రారంభ స్థాయిలో కార్పొరేషన్ నిర్వహణ ఖర్చులకు రూ.15 కోట్లను ప్రభుత్వం సమకూర్చుతుంది.
కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ కింద ఇంటింటికీ కొళాయి ద్వారా తాగునీటి సరఫరాకు రూ.26,826.94 కోట్లను రాష్ట్రానికి మంజూరు చేసింది. ఇంకా 24.98 లక్షల కుటుంబాలకు కొళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి నాటికే రూ.23,130.19 కోట్ల విలువ చేసే పనులు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం వ్యయంలో కేంద్రం రూ.10,647.71 కోట్లు సమకూర్చనుంది. రాష్ట్ర వాటా రూ.12,482.48 కోట్లు. ఇందులో రూ.10 వేల కోట్లను కార్పొరేషన్ ద్వారా అప్పుగా సమకూర్చుకుంటోంది. మిగతా రూ.2,500 కోట్లను 2025–26 నుంచి 2027–28 మధ్య బడ్జెట్‌లలో కేటాయింపులు చేయనుంది.
2014–19 మధ్య సైతం ఇలానే..
బ్యాంకుల నుంచి రూ.వంద కోట్ల అప్పు
ఎన్నికల ముందు ఓటర్లను ప్రభావితం చేసే పథకాలకు ఖర్చు
గతంలోనే నిర్మించిన మంచి నీటి పథకాలు ష్యూరిటీ
2014–19 మధ్య సైతం చంద్రబాబు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి పథకాల నిర్మాణానికి బ్యాంకుల నుంచి వంద కోట్ల రూపాయిలు అప్పు తీసుకుంది. వీటికోసం అంతకుముందే ప్రభుత్వ నిధులతో వేల గ్రామాల్లో నిర్మించిన ఆర్‌డబ్ల్యూఎస్ రక్షిత మంచి నీటి పథకాలను ష్యూరిటీగా చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం రెండు ఉత్తర్వులు కూడా జారీ చేసిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆ నిధులను మంచినీటి పథకాల కోసం కాకుండా ఎన్నికల ముందు ఓటర్లను ప్రభావితం చేసే సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టారన్న ఆరోపణలున్నాయి.
అప్పు చేయకుండానే వైఎస్ జగన్ ప్రభుత్వంలో నీటి పథకాలు
ఉద్దానం వంటి అత్యంత కీలక పథకాలు పూర్తి
మంచినీటి పథకాల కోసం చంద్రబాబు ప్రభుత్వం రూ.10 వేల కోట్ల అప్పునకు నానా ఎత్తులు వేస్తోంది. కానీ, ఏ అప్పు చేయకుండానే ఉద్దానం వంటి కీలక పథకాలు పూర్తిచేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. రూ.26,181 కోట్ల జలజీవన మిషన్ కార్య్రMý మంలో ఉద్దానం, పులివెందుల, డోన్‌తో పాటు ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో రూ.10,137 కోట్లతో 9 భారీ ప్రాజెక్టులు చేపట్టింది. రూ.12,984 కోట్లతో అన్ని గ్రామాల్లో ఇంటింటికీ కొళాయిల ఏర్పాటు, రూ.3060 కోట్లతో కొత్తగా ఏర్పాటైన జగనన్న కాలనీలకు తాగునీటి సరఫరా పథకాల నిర్మాణాన్ని తలపెట్టింది.
ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దానం ప్రాంత భారీ సమగ్ర రక్షిత నీటి పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. పులివెందుల, డోన్ భారీ సమగ్ర రక్షిత పథకాల నిర్మాణం సగంపైనే పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 95 లక్షల ఇళ్లు ఉండగా, ఈ పథకం ప్రారంభం నాటికే 30 లక్షల ఇళ్లకు కొళాయిలు ఉన్నాయి. మిగతా 65 లక్షల ఇళ్లకు గాను 39 లక్షల ఇళ్లకు వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే కొళాయిల ఏర్పాటు పూర్తయినట్టు ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి.
ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, కష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో 6 ప్రాజెక్టులకు సైతం 2022 తర్వాత టెండర్ ప్రక్రియ పూర్తయింది. కానీ, కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసింది. కృష్ణా మినహా మిగిలిన జిల్లాల్లో రక్షిత పథకాలకు తిరిగి టెండర్లు పూర్తి చేసింది. రూ.1,290 కోట్లతో ప్రకాశం జిల్లా భారీ సమగ్ర రక్షిత మంచినీటి పథకానికి ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన
కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన వాటాలకు కచ్చితంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలి. కేంద్రం బడ్జెట్ నుంచి కేంద్ర ప్రయోజిత పథకాల కు జల జీవన్ మిషన్ నిధులు కేటాయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు నిధులకు బదులుగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, తద్వారా వివిధ బ్యాంకుల నుంచి అప్పులు చేసి ఆ మేరకు నిధులు ఇస్తామని చెప్పింది.
ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడంగానే పరిగణించాల్సి ఉంటుందని ఆర్థిక నిఫుణులు పేర్కొంటున్నారు. దీనిని బడ్జెట్ పరిధిలోకి వచ్చే అప్పుగా పరిగణించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ అప్పు.. ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌భీఎం) పరిధిలోకి రాకుండా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.