అధికారం మనదే.. 'ఆడుకోండి' | Gambling rampant in the joint Anantapur district | Sakshi
Sakshi News home page

అధికారం మనదే.. 'ఆడుకోండి'

Oct 22 2025 5:10 AM | Updated on Oct 22 2025 5:10 AM

Gambling rampant in the joint Anantapur district

‘పేకాట’.. ‘పచ్చ’ పూదోట

ఉమ్మడి అనంతపురం జిల్లాలో జోరుగా గ్యాంబ్లింగ్‌ 

ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికి విమాన టిక్కెట్‌ నుంచి సకల మర్యాదలు 

ప్రజాప్రతినిధులతో పాటు పోలీసులకు నెల మామూళ్లు  

త్వరలో పలు రిక్రియేషన్‌ క్లబ్‌లలో  పేకాట ఆడించేందుకు ఏర్పాట్లు!

‘‘రండి బాబూ రండి! కడప, కర్నూలు, మహబూబ్‌నగర్, గద్వాల, కర్ణాటక, తెలంగాణ, ఊరు ఏదైనా పర్వాలేదు. మా ఊరికి రండి! హాయిగా పేకాట ఆడండి! మస్తుగా ఎంజాయ్‌ చేయండి! పేకాట ఆడేందుకు ఇక మీరు రాయచూరు, బెంగళూరు, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పనిలేదు. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చింది! పేకాటకు ఇబ్బందే లేదు. మళ్లీ మనకు మంచి రోజులు వచ్చాయి. 

మీకు అన్ని మర్యాదలు చేస్తాం!’’ అంటూ పేకాట రాయుళ్లకు నిర్వాహకులు స్వాగతం పలుకుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పేకాట నిర్వాహకులు యథేచ్ఛగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు దీన్ని ఆదాయ మార్గంగా ఎంచుకుంటే, కొందరు పోలీసులు పోస్టింగ్‌తో పాటు డబ్బులు వస్తాయనే ఆశతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.  

సాక్షిప్రతినిధి, అనంతపురం: కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో పేకాటకు మార్గం సుగమమైంది. సర్కారు ఏర్పడిన కొత్తలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ఏకంగా ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా పేకాట ఆడించేలా చూస్తా అని ‘ఆఫీసర్‌ క్లబ్‌’లో వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి పేకాట ఆడించి, డబ్బులు దండుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో బరితెగించారో ఇట్టే తెలుస్తోంది! ఉమ్మడి ‘అనంత’లో స్థానిక ఎమ్మెల్యేల ఆశీస్సులు, కొందరు పోలీసుల సహకారంతో ఆటాడిస్తున్నారు. 

కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసులకు నెలవారీ మామూళ్లు నిర్ణయించి పేకాట నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఆదాయాన్ని చూసి కొందరు పోలీసులు పట్టుబట్టి మరీ ‘పేకాట’ పరిధిలోని స్టేషన్లకు వచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేసుకోండని వారి అనుచరులపై ఒత్తిడి తెస్తున్నారు.  

ఈ ప్రాంతాల్లో జోరుగా.. 
» తాడిపత్రిలోని పాతమార్కెట్‌లో ఓ తెలుగు యువత నాయకుడి ఆధ్వర్యంలో క్లబ్‌ నడుస్తోంది. చుక్కలూరులో సుంకులమ్మ పాలెంకు చెందిన ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో ఆటాడిస్తు న్నారు. ఓ మాజీ సర్పంచ్‌ తమ్ముడి ఆధ్వర్యంలో గన్నేవారిపల్లి కాలనీలో పేకాట నిర్వహిస్తున్నారు. 
»  ఉరవకొండ నియోజకవర్గం కౌకుంట్లలో పేకాట     క్లబ్బులు నడుస్తున్నాయి. మైలారం పల్లిలో ‘అందర్‌ –బాహర్‌’ నిర్వహిస్తున్నారు. కడప, పొద్దుటూరు, బళ్లారి, గుంతకల్లుతో పాటు చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆడుతున్నారు. ఒక్కొక్కరితో రూ.5 వేలు నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. కూడేరు మండలంలో పోలీసుల కనుసన్నల్లోనే విచ్చలవిడిగా పేకాట నడుస్తోంది. 
»  శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం మల్లాగుండ్లతో పాటు పలు గ్రామాల్లో టీడీపీ నేతల కనుసన్నల్లో పేకాట నడుస్తోంది. గుంతకల్లు నియోజకవర్గంలో ఓ టీడీపీ నేత కనుసన్నల్లో పేకాట ఆడిస్తున్నారు. 
»   కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు, బ్రహ్మసముద్రం,శెట్టూరు,కుందురి్పలో పేకాట శిబిరాలకు కర్ణాటక వాసులు కూడా తరలివస్తున్నారు. 
»  హిందూపురం ఇందిరమ్మ కాలనీ, సేవామందిర్‌ పరిసరాల్లో టీడీపీ నేతలు రోజూ రూ.30 లక్షల వరకూ పేకాట ఆడిస్తున్నారు. ఇందిరమ్మ కాలనీలో కూటమి నేతకు చెందిన తోటలో నిత్యం పేకాట నడుస్తోంది. కగ్గళ్లుకు చెందిన ఓ మాజీ సర్పంచ్‌ ఈ దందాలో కీలకంగా ఉన్నారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లోనూ విచ్చలవిడిగా పేకాట నడుస్తోంది. 
»  ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల్లోని అటవీ, కొండ ప్రాంతాల్లో ఆడుతున్నారు. 
» పుట్టపర్తిలో మొన్నటి వరకూ ఓ పోలీసు అధికారి కనుసన్నల్లోనే విచ్చలవిడిగా పేకాట సాగింది. ఆ అధికారికి నెలకు రూ.30 లక్షలు ఇచ్చేవారంటే ఏ స్థాయి­లో నడిచిందో ఇట్టే తెలుస్తోంది. ఆ అధికారి బదిలీ తర్వాత తాత్కాలికంగా ఆట కట్టేశారు. ఇప్పడు తిరిగి ఆడించేందుకు నిర్వాహకులు ప్రయతి్నస్తున్నారు.  

కళ్లు బైర్లు కమ్మాల్సిందే! 
పేకాట స్మాల్‌ స్టేక్‌ (చిన్నబ్యాంకులు), హైస్టేక్‌ (పెద్దబ్యాంకులు)..ఇలా రెండు రకాలుగా జరుగు తోంది. స్మాల్‌స్టేక్‌లో రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకూ ఆడతారు. హైస్టేక్‌లో రూ.50 వేలు, రూ.లక్ష, రూ.2లక్షలు..ఇలా మూడు రకాలు ఆడతారు.  

»   స్టేక్‌ ఏదైనా ఒక్కో బ్యాంకుకు 250 పాయింట్లు ఇస్తారు. పేకాట నిర్వాహకుడికి డబ్బులు ఇస్తే వారికి 250 పాయింట్ల లెక్కన కాయిన్లు ఇస్తారు. పేకాట శిబిరం వద్ద డబ్బు కట్టలు ఉండవు. శిబిరానికి వచ్చే ముందు నిర్వాహకుడు చెప్పిన కారు వద్దకు వెళ్లి డబ్బులు ఇస్తే ఆ మొత్తానికి సరిపడా కాయిన్లు ఇస్తారు. అయితే స్టేక్‌ను బట్టి పాయింట్ల విలువ మారుతుంది. ఒక్కో పాయింట్‌ విలువ రూ.50 వేల బ్యాంకు అయితే రూ.200, రూ.లక్షకు రూ.400, రూ. 2లక్షలకు రూ.8 వేలుగా నిర్ణయిస్తారు. ఊరు, శిబిరం ఎక్కడైనా పాయింట్ల రేటు మాత్రం ఇలాగే ఉంటుంది.  

» ఒక్కో గేమ్‌ పది మంది ఆడతారు. కొన్ని సందర్భాల్లో ఏడుగురుంటారు. ఒక గేమ్‌ పూర్తయితే గెలిచిన వ్యక్తి ఖర్చుల కింద నిర్వాహకుడికి కొన్ని పాయింట్లు ఇవ్వాలి.  

»   రూ.50 వేలు బ్యాంకు ఆడేవారు 8 పాయింట్లు, రూ.లక్ష బ్యాంకు ఆడితే 6, రూ.2లక్షలు ఆడితే 4 పాయింట్లు ఇవ్వాలి. ఈ లెక్కన రూ.50 వేలు బ్యాంకు ఒక ఆటకు  నిర్వాహకుడికి రూ.1600, రూ.లక్ష బ్యాంకు ఆటకు రూ.2,400, హైస్టేక్‌ అయిన రూ.2లక్షల బ్యాంకు ఆటకు రూ.32 వేలు వస్తుంది.  

»     ఒక శిబిరంలో రోజూ కనీసం వంద ఆటలు జరుగుతాయి. ఈ లెక్కన రూ.50 వేలు బ్యాంకు రోజుకు రూ.1.60 లక్షలు, రూ.లక్ష బ్యాంకునకు రూ.2.40లక్షలు, రూ.2లక్షల స్టేక్‌కు రోజుకు రూ.32 లక్షలు నిర్వాహకుడికి వస్తుంది.  

»    రూ.50వేలు, రూ.లక్ష బ్యాంకులు ఎక్కువగా ఆడతారు. వీరు రోజులో వంద గేమ్‌లు కచ్చితంగా ఆడతారు. రూ.2లక్షల బ్యాంకు మాత్రం ఆర్థికంగా బలమైన వారు, ప్రజాప్రతినిధులు మాత్రమే ఆడతారు. ఇవి సగటున రోజుకు 50 గేమ్‌లు జరుగుతాయని తెలుస్తోంది.

పేకాట రాయుళ్లకు ఇస్తున్న సదుపాయాలు ఇలా..
పేకాట ఆడేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి గదులు, రవాణా, కోరిన ఆహారం ఏర్పాటు చేస్తారు. రూ.2 లక్షల బ్యాంకు ఆడేవారికి డబుల్‌ బ్లాక్, గ్లెన్‌లివెట్‌ లాంటి విదేశీమందు ఇస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విమాన టికెట్లు బుక్‌ చేస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మందిని పేకాటకు తీసుకొచ్చేవారికి నెలకు రూ.లక్ష–2 లక్షలు గిఫ్ట్‌గా ఇస్తారు. 

విశ్వసనీయ సమాచారం ప్రకారం పేకాట జరిగే ప్రాంతాల్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధికి నెలకు రూ.10 లక్షలు, పేకాట శిబిరానికి మంత్రి అనుమతిస్తే రూ.25 లక్షలు, స్థానిక పోలీసు స్టేషన్‌కు, ఆపై అధికారికి కొంత మొత్తం ఖరారు చేసి ప్రతి నెలా పంపిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement