
అనంతపురం జిల్లా: కుల కట్టుబాటును కాదంటూ వేరే ఊరు అమ్మాయితో పెళ్లి సంబంధం కుదుర్చుకుని నిశ్చితార్థం చేసుకున్నందుకు ఒక కుటుంబాన్ని కులం నుంచి వెలి వేశారు. ఈ అమానుష ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. ఉరవకొండ శివరామిరెడ్డి కాలనీకి చెందిన జోగి వెంకటేష్ కుమారుడు జోగి మణికుమార్‌కు కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో వివాహ నిశ్చితార్థం చేయడానికి ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు.
అమ్మాయి, అబ్బాయి ఉన్నత చదువులు చదువుకోవడంతో వారి భవిష్యత్తు బాగుంటుందని పెళ్లికి సిద్ధపడ్డారు. ఈ ఏడాది ఆగస్టు మూడో తేదీ శివమొగ్గలో ఘనంగా నిశి్చతార్థం చేశారు. ఈ విషయం సంచార జాతుల కులపెద్దలకు తెలియడంతో వారు పంచాయితీ ఏర్పాటుచేశారు. కులస్తులకు కర్ణాటక వారితో ఇప్పటివరకు ఎలాంటి వివాహ సంబంధాల్లేవని, మీరెలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఇందుకు అబ్బాయి తండ్రి వెంకటేష్ స్పందిస్తూ..
సమాజం ఇంత అభివృద్ధి చెందుతున్నా మీరు కట్టుబాట్లు అంటూ ఇంకా ఎంతకాలం హింసిస్తారని కులపెద్దలను ప్రశి్నంచారు. దీంతో కులపెద్దలు ఆగ్రహిస్తూ ‘మీరు నిశ్చితార్థం తెంచుకుని.. మేం చెప్పిన విధంగా నడుచుకోవాలి. లేదంటే మీ కుటుంబాన్ని 30 ఏళ్ల పాటు కులం నుంచి వెలివేస్తాం. దీంతో పాటు ఉరవకొండ నుంచి నిశ్చితార్థానికి వెళ్లిన వారు ఒక్కొక్కరు రూ.1,200 చొప్పున సంఘానికి రుసుం చెల్లించాలి’.. అని హుకుం జారీచేశారు. కులపెద్దల అనాగరిక ఆచారాన్ని నిరసిస్తూ జోగి వెంకటే‹Ù, కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్, ఎస్పీకి మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దీపావళి పండుగ తర్వాత కుల పెద్దలకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చే అవకాశముంది.