
బాధిత కుటుంబంతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
పక్కా ప్రణాళికతో హరిచంద్రప్రసాద్ ఈ ఘటనకు పాల్పడ్డాడు
బాధిత కుటుంబంతో మాట్లాడాక కారణాలు తెలుస్తున్నాయి
అన్ని విధాల ఆదుకునేందుకు రాష్ట్రంలో కాపులందరూ సిద్ధం
కులానికి ఇంత దారుణం జరిగాక పార్టీలకు అతీతంగా ఏకమవాలి
వారం రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ నేరుగా పరామర్శించాలి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్
నెల్లూరు జిల్లా దారకానిపాడులో లక్ష్మీనాయుడు కుటుంబానికి పరామర్శ
కందుకూరు: తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు (25) హత్య దారుణమని, అతడి ఇద్దరు సోదరులు కాళ్లు, చేతులు విరిగి శాశ్వత అంగ వైకల్యం కలిగే స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీనాయుడు కుటుంబంతో మాట్లాడాక అతడి హత్యకు అసలు కారణాలు తెలుస్తున్నాయని చెప్పారు. కమ్మ వర్గానికి చెందిన కాకర్ల హరిచంద్రప్రసాద్ ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళిక ప్రకారం క్రూరంగా లక్ష్మీనాయుడు ప్రాణాలు తీశాడని పేర్కొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో శనివారం లక్ష్మీనాయుడు కుటుంబాన్ని త్రిమూర్తులు పరామర్శించారు.
లక్ష్మీనాయుడు భార్య సుజాతతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాము రాజకీయాలు చేయడానికి ఇక్కడికి రాలేదన్నారు. సుజాతతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడాలని ఆయనకు వారం రోజులు సమయం ఇస్తున్నామని చెప్పారు. తర్వాత ఎటువంటి విచారణ చేయాలో నిర్ణయం తీసుకోవాలన్నారు. పవన్ స్పందించకపోతే బాధిత కుటుంబంతో కలిసి అసలు ఏం జరిగిందో పూర్తిగా వెల్లడిస్తామని చెప్పారు.
‘‘లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే జరిగిన ఘటనను తొలుత యాక్సిడెంట్‌గా చెప్పారు. తర్వాత క్రూరంగా చంపారని అన్నారు. సుజాతకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు. కానీ, ఇది కాపు జాతి సిగ్గుపడేలా జరిగిన హత్య అని గుర్తుంచుకోవాలి. కులానికి ఇంతటి దారుణ అన్యాయం జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా ఏకమవ్వాలనేది మా ఉద్దేశం’’ అని త్రిమూర్తులు వివరించారు.
మున్ముందు ఇలాంటి దారుణాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాన్ని పూర్తిగా ఆదుకునేందుకు రాష్ట్రంలోని కాపు జాతి సిద్ధంగా ఉందన్నారు. ప్రతి కాపు హృదయాన్ని కదిలించి... లక్ష్మీనాయుడు కుటుంబానికి భరోసా కల్పిస్తామని చెప్పారు. కాపు వర్గానికి చెందినవారు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారని వివరించారు.
దురహంకారంతో వేధించాడు
‘‘దారకానిపాడులో లక్ష్మీనాయుడును మెజార్టీ అయిన హరిచంద్రప్రసాద్ చిన్నచూపు చూశాడు. వేధించాడు. చివరకు దారుణ హత్యకు ఒడిగట్టాడు. తమ వర్గానికి చెందినవారి ప్రభుత్వం ఉందనే ధీమా, ఆధిపత్య భావన దీనికి కారణం’’ అని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. జ్యుడీషియల్ లేదా నిజాయతీపరుడైన ఐపీఎస్ అధికారితో స్వతంత్ర విచారణ జరిపించాలని, నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లక్ష్మీనాయుడు భార్యపై హరిచంద్రప్రసాద్ కన్నేసి దుర్బుద్ధితో వేధించాడని, ఎదిరించలేక వారు నాలుగు నెలలు నలిగిపోయారని అన్నారు. లక్ష్మీనాయుడు సోదరులు పవన్, భార్గవనాయుడుతో కలిసి హరిచంద్రప్రసాద్‌ను ప్రశ్నించిన మరునాడే హత్యకు గురయ్యాడని పేర్కొన్నారు. నిందితుడికి ఉరి లేదా ఇంకేదైనా కఠిన శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని కోరారు.