పేరు ఒకరిది... ఉద్యోగంలో మరొకరు. ఐదేళ్లుగా ఒకరికి బదులు మరొకరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సైతం వెళ్లాయి
పేరు ఒకరిది... ఉద్యోగంలో మరొకరు. ఐదేళ్లుగా ఒకరికి బదులు మరొకరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సైతం వెళ్లాయి. అయినా కనీసం విచారణ కూడా చేపట్టడం లేదు. ఈ నకిలీ ఉద్యోగాల తతంగం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కొనసాగుతోంది.
మిర్యాలగూడ, న్యూస్‌లైన్
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఎన్‌ఎంఆర్ (నాన్ మస్టర్ రోల్) ఉద్యోగులుగా నకిలీలు కొనసాగుతున్నారు. ఒకరి పేరుతో మరొకరు ఉద్యోగాలు చేస్తున్నారు. నకిలీ పేర్లు, నివాస ధ్రువీకరణ పత్రాలు సంపాదించిన ఎంతోమంది ఎన్‌ఎస్‌పీలో ఉద్యోగాలు పొంది విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. వీరంతా ఎన్‌ఎస్‌పీ పరిధిలోని వివిధ సర్కిళ్లలో బాధ్యతలు నిర్వహిస్తూ నెల నెలా వేతనాలు పొందుతున్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక కుడి, ఎడమ కాలువలు, మేజర్ కాలువల తవ్వకాల సమయంలో రోజు వారీ కూలీ కోసం కొంతమందిని పనిలోకి తీసుకున్నారు. వీరంతా పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని పనిచేశారు. కాలువల తవ్వకాల పనులు పూర్తికాగానే 1984లో కొంతమందిని 1985లో మరికొంత మందిని పూర్తిగా తొలగించారు. అయితే, పనులు పూర్తికాగానే పనుల నుంచి తొలగించడం అన్యాయమంటూ, ప్రాజెక్టు పరిధిలోనే ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
న్యాయస్థానాలను ఆశ్రయించిన వారిలో ఎన్‌ఎస్‌పీ పరిధిలోని ఐదు సర్కిల్స్‌కు చెందిన వారు 663మంది ఉన్నారు. తొలగించిన వారిని ఉద్యోగాలలో తీసుకోవాలని (డబ్ల్యూపీ నెం.97/88 ప్రకారం) సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఉత్తర్వులను నీటి పారుదల శాఖ అధికారులు చాలాకాలం పాటు అమలు చేయలేదు. చివరకు 2008లో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తూ 463మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. దీంతో అప్పటికే కోర్డుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్న వారిలో కొంతమంది ఇతర ఉద్యోగాలలో స్థిరపడగా, మరికొంత మంది అప్పటికే మరణించారు. కాగా మరణించిన, ఇతర ఉద్యోగాలలో కొనసాగుతున్న వారి పేరున నకిలీలు కొంతమంది నివాస ధ్రువీకరణ పత్రాలు పొంది ఉద్యోగాలు సంపాదించారు. మరికొంత మంది మాత్రం నివాస ధ్రువీకరణ పత్రాలు కూడా నకిలీవి తయారు చేసుకొని ఉద్యోగాలు పొందారు.
ఐదు సర్కిళ్లలో విధులు
ఒకరి పేరున మరొకరు ఉద్యోగాలు పొంది విధులు నిర్వహిస్తున్న వారు సాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఐదు సర్కిళ్లలో వివిధ జిల్లాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్‌ఎస్‌పీ ఒంగోలు సర్కిల్, లింగంగూడెం, నాగార్జునసాగర్, టేకులపల్లి, మిర్యాలగూడ సర్కిల్ పరిధిలో సుమారు 157మంది నకిలీ ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు దర్జాగా విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి చోలవరం ప్రాజెక్టుకు బదిలీ అయిన వారిలో 40మంది నకిలీలే ఉన్నట్లు సమాచారం.
అధికారుల పాత్రపై అనుమానాలు?
ఒకరికి బదులుగా మరొకరు ఉద్యోగాలు పొందడంలో కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్‌ఎంఆర్‌లుగా ఉద్యోగాలు కల్పించాల్సిన వారి జాబితా అధికారులకు ముందే అందింది. జాబితాలోని పేర్లను పరిశీలించిన అధికారులు కొంతమంది ఇతర ఉద్యోగాలలో స్థిరపడినట్లుగా, మరి కొంత మంది మరణించినట్లుగా గుర్తించారు. ఇదే అదునుగా అధికారులు కొందరి మధ్యవర్తుల ద్వారా సమాచారాన్ని బయటకు లీక్ చేశారు.మరణించిన, ఇతర ఉద్యోగాలు పొందిన వారి స్థానాలలో నకిలీ సర్టిఫికెట్లతో ప్రత్యక్షమయ్యారు. ఒక్కొక్కరినుంచి రూ.లక్ష తీసుకొని ఎన్‌ఎంఆర్‌లుగా ఉద్యోగాలు కల్పించినట్లు సమాచారం.
మిర్యాలగూడ సర్కిల్‌లో..
మిర్యాలగూడ సర్కిల్ పరిధిలోని త్రిపురారం సబ్ డివిజన్ పరిధిలో ముగ్గురు ఉద్యోగులు నకిలీలు ఉన్నట్లు సమాచారం. తండ్రి పేరుతో కొడుకు ఒకరు, మిర్యాలగూడ ఎఫ్‌సీఐలో హమాలీగా పనిచేస్తున్న మరొకరు, మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యక్తి మరొకరు నకిలీ సర్టిఫికెట్లతో బాద్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా మిర్యాలగూడ డివిజన్‌లో ఇద్దరు ఉద్యోగులు, కోదాడ, హుజూర్‌నగర్ పరిధిలో నేరేడుచర్ల మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నకిలీ సర్టిఫికెట్లు సంపాదించి ఉద్యోగాలు పొందినట్లు సమాచారం.


