అమ్మచేతి గోరుముద్దలు తింటూ ఆనందంగా గంతులు వేస్తూ ఆడుకుంటున్న చిన్నారిని విధి కబళించింది.
దోమ, న్యూస్‌లైన్: అమ్మచేతి గోరుముద్దలు తింటూ ఆనందంగా గంతులు వేస్తూ ఆడుకుంటున్న చిన్నారిని విధి కబళించింది. బొలెరో వాహనం రూపంలో మృత్యువు వచ్చి బలితీసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. దోమ మండల పరిధిలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోనూరు యాదయ్య, అనిత దంపతులు. వారి ఒక్కగానొక్క కుమారుడు అజయ్ కుమార్(5) పరిగిలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో నర్సరీ చదువుతున్నాడు. సోమవారం పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలోని తోటి చిన్నారులతో ఆడుకుంటూ సంతోషంగా గడిపాడు.
సాయంత్రం 5గంటల సమయంలో ఆకలేసిందంటూ పరుగెత్తుకొని తల్లి వద్దకు వచ్చాడు. దీంతో ఆమె కంచంలో అన్నం పెట్టి పిల్లాడికి తినిపిస్తోంది. అజయ్ ఒక్కో ముద్ద తింటూ కొద్ది దూరం పరుగెత్తి మరో ముద్ద కోసం తిరిగి వస్తున్నాడు. ఇంతలో గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లో నుంచి వరి ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించడానికి వచ్చిన ఓ బొలెరో ట్రాలీ వాహనం రివర్స్ తీసుకుంటూ బాలుడిని ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తల్లి స్థానికుల సాయంతో అదే వాహనంలో బాలుడిని తీసుకొని పరిగి ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. చికిత్స పొందుతూ బాలుడు 6 గంటల సమయంలో మృతి చెందాడు. బొలెరో వాహనం డ్రైవర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆకలైందమ్మా అంటూ అన్నం తినడానికి వచ్చిన కుమారుడు పూర్తిగా తినకుండానే కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ తల్లి రోదనలు ఆపడం ఎవరి తరమూ కాలేదు.