
ఏరులై పారనున్న మద్యం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మద్యం మత్తులో ముంచెత్తి ఆదాయవనరులను పెంచుకునే దిశగా చర్యలు చేపడుతోంది.
రిటైల్ దుకాణాలకు అదనంగా మరో 34
ఆదాయమే లక్ష్యం..ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం
నెల్లూరు(క్రైమ్) : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మద్యం మత్తులో ముంచెత్తి ఆదాయవనరులను పెంచుకునే దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఉన్న మద్యం షాపులు, బెల్టుషాపులతో తమ కుటుంబాలు వీధినపడుతున్నాయని ఆందోళన చెందుతున్న ప్రజలకు ప్రభుత్వ తాజా నిర్ణయం పిడుగుపాటులా తయారైంది. జిల్లాలో 2014-15 ఆబ్కారీ సంవత్సరానికి 348 మద్యం దుకాణాలకుగాను 10 మద్యం దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో అవి ప్రారంభానికి నోచుకోలేదు.
2015-16ఆబ్కారీ సంవత్సరానికి జిల్లాలో ఇప్పటికే ఉన్న 348 మద్యం దుకాణాలతో పాటు అదనంగా మరో 34 దుకాణాలు ప్రారంభం కానున్నాయి. 348 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా మద్యం వ్యాపారులకు కట్టబె ట్టడంతో పాటు ప్రభుత్వమే నేరుగా సుమారు 34 దుకాణాలను(మండల హెడ్‌క్వార్టర్స్, ప్రధానసెంటర్లలో) నిర్వహించనుంది. దీంతో వాడవాడలా మద్యం ఏరులై పారనుంది. ఆదాయమే పరమావది కాకుండా ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మద్యం విధానం ఉంటుందని ఓవైపు ప్రభుత్వం చెబుతున్నా తాజా నిర్ణయాలను బట్టిచూస్తే మందుబాబులచే ఫూటుగా మద్యం తాగించి తన ఖజానాను నింపుకోనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులను నిర్మూలిస్తామని ప్రకటించింది. అందుకు తగ్గ మార్గదర్శకాలను సైతం జారీచేసి విసృ్తత దాడులు నిర్వహించాలని ఆబ్కారీ అధికారులను ఆదేశించింది. అయితే అవి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. అధికారులు మొక్కుబడిగా అడపాదడపా దాడులు నిర్వహించడమే తప్ప బెల్టుషాపులను పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోయారు.
మరోవైపు వీటిని నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు సైతం అలంకారప్రాయంగా మారాయి. ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. తాజాగా ప్రభుత్వం అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకే ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ గత అనుభవాల దృష్ట్యా ఆచరణలో ఎలా ఉంటుందో వేచిచూడాలి.