లాభాలు చూపాడు.. నిండా ముంచాడు

303 people cheated Indie Trade Owner - Sakshi - Sakshi - Sakshi

రూ. 187 కోట్లకు కుచ్చుటోపి

303 మందిని మోసగించిన ఇండీ ట్రేడ్‌ యజమాని

పెరుగుతున్న బాధితులు

అధికారపార్టీ నాయకుల అండదండలపై అనుమానాలు

రాజాం: అతడొక సాధారణ యువకుడు. మారుమూల గ్రామంలో నివసించిన వ్యక్తి. ఉన్నత విద్య కూడా పూర్తిచేయని పరిస్థితి. నిండా పాతికేళ్లు ఉండవు. అటువంటి ఓ యువకుడు ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా రూ. 187 కోట్లుకు కుచ్చుటోపి పెట్టాడు. షేర్‌మార్కెట్‌ పేరుతో 303 మందిని మోసగించాడు. ఈ ఘటన ఎక్కడో ముంబాయి, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో జరగలేదు. మారుమూల పల్లెలోనే చోటుచేసుకుంది. బాధితుల్లో ఎక్కువ మంది రైతు కూలీలు ఉండడం విచారించ దగిన విషయం. ఇంత పెద్ద మొత్తంలో జరిగిన ఈ ఘరానా మోసానికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే అనుమానాలు అధికంగా ఉన్నాయి. ఆ కేటుగాడి వివరాలు, ఆ మోసం వెనుక కుట్ర తెలియాలంటే ఈ వివరాలు చదవాల్సిందే.

 సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన ఓ ఘరానా మోసగాడి ఉదంతం ఇది. రాజాం పట్టణ కేంద్రంలో నాలుగేళ్ల క్రితం ఆయువకుడు ఇండీ ట్రేడ్‌ను ప్రారంభించి ఆరంభంలో కొంతమందికి లాభాలను చూపించాడు. రూ. లక్షకు రూ. 7 వేల నుంచి రూ. 10 వేల వరకు నెలవారీ ఆదాయం చూపించడంతో ఇదేదో బాగుందని రాజాం, రేగిడి, సంతకవిటి, వంగర, జి.సిగడాం, పొందూరు, తెర్లాం మండలాల్లోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు లక్షల రూపాయలను ఈ షేర్‌మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టారు. కొన్నాళ్లపాటు అసలు కాకుండా నెలవారీ వచ్చే ఆదాయాన్ని అందరికీ ఇచ్చేస్తుండడంతో అందరూ షేర్‌మార్కెట్‌లో మంచి లాభాలు వస్తున్నాయని భావించి రూ. లక్షల్లో పెట్టుబడులు పెంచుకుంటూ వచ్చారు. సరిగ్గా ఏడాది క్రితం రాజాంలోని ఈ కార్యాలయాన్ని సంతకవిటి మండలం తాలాడ వద్దకు ఆ యువకుడు మార్చేసి అక్కడ నుంచి వ్యాపార లావాదేవీలు ప్రారంభించాడు. అంతేకాకుండా తన స్వగ్రామం మందరాడలో రూ. 2 కోట్లు విలువచేసే కొత్త భవనం నిర్మాణం ప్రారంభించాడు. 

దీంతో ఇన్వెష్టర్లకు మరింత నమ్మకం కలిగి విచ్చలవిడిగా పెట్టుబడులను పెట్టేశారు. మందరాడతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన రోజువారి కూలీలు, రైతులు, తమ ఆడపిల్లల పెళ్లిల్లు నిమిత్తం దాచుకున్న కొంతమంది వ్యక్తులు డబ్బులను ఈ షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి రూపంలో పెట్టారు. ఒకరు ఇళ్లు కొనుక్కొందామని, మరొకరు తమ ఆడపిల్లలకు పెళ్లిచేద్దామని, ఇంకొకరు పిల్లలను ఉన్నత చదువులు చదివిద్దామని, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఆశపడ్డారు. అయితే ఏడాది క్రితం నుంచి నెలవారీ ఇచ్చే ఆదాయాన్ని షేర్‌ మార్కెట్‌ యజమాని నిలుపుదలచేసి వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. చివరకు ఇటీవల తన వివాహం వరకు తుదిగడువు పెట్టి వివాహం అనంతరం కూడా మొహం చాటేశాడు. దీంతో పెట్టుబడి దారులు గత వారం రోజులుగా ఒత్తిడిచేయడం ప్రారంభించడంతో ఈ నెల 10వ తేదీ నుంచి మందరాడలోని తన ఇళ్ల తలుపులకు తాళాలువేసేయడంతో పాటు తాలాడలోని కార్యాలయానికి తాళాలు వేసి పలాయనం చిత్తగించాడు. ఉన్నఫలంగా కార్యాలయానికి తాళాలు వేయడంతో పాటు ఇంటి వద్ద కుటుంబీకులు లేకపోవడంతో పెట్టుబడిదారులకు ఆందోళన ఎక్కువై ఒక్కొక్కరుగా తమ పెట్టిన పెట్టుబడులకు సంబంధించి వివరాలు బయటపెడుతూ లబోదిబోమంటున్నారు.

రూ. 187 కోట్లకు కుచ్చుటోపి
ఇండీట్రేడ్‌ షేర్‌మార్కెట్‌లో వాస్తవంగా షేర్‌ బిజినెస్‌ జరగలేదని, పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఒకరు పెట్టిన పెట్టుబడిని ఇంకొకరి పెట్టుబడికి వడ్డీగా చూపిస్తూ ఒకరికి తెలియకుండా ఒకరిని యజమాని మోసం చేసుకుంటూ వచ్చాడని చర్చించుకుంటున్నారు. పెట్టుబడి దారులు కూడా అధికలాభాలకు ఆశించి ఒకరికి తెలియకుండా ఒకరు భారీగా పెట్టుబడులు పెట్టేయడంతో ఇండీట్రేడ్‌లో రూ. 187 కోట్లుకుపైగా పెట్టుబడులు వచ్చిపడ్డాయి. 303 మందికిపైగా ఇన్వెష్టర్లు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వీరికి పక్కా కాగితాలుకాని, బాండ్లుకాని, డీమేట్‌ ఖాతాలుకాని లేకపోవడంతో వీరంతా రోడ్డున పడ్డట్టు అయింది. 

అధికార పార్టీ అండదండలపై అనుమానాలు
వందల మంది పేదలను మోసగించి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఇండీట్రేడ్‌ యజమానికి టీడీపీ నేతలతో సత్సంబందాలు ఉన్నాయనే అనుమానాలు అధికంగా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో మండల స్థాయి టీడీపీ నేతలకు ఈయన ఆర్థిక సాయం అందించడంతో పాటు వాహనం సమకూర్చినట్టు పలువురు పేర్కొంటున్నారు. ఓ టీడీపీ సీనియర్‌ నేత ఈయనతో కలసిమెలసి తిరగడంతో పాటు పలు సందర్భాల్లో టీడీపీ సమావేశాలకు, కార్యక్రమాల్లో ఈయనను ప్రధాన పాత్రధారిగా చూపించడంతో చాలా మంది ఇన్వెష్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది. జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా ఈ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఈయనతో సన్నిహితంగా ఉన్నట్టు వ్యవహరించడంతో అధికార పార్టీ అండదండలు ఈ యజమానికి ఉన్నాయనే అనుమానాలు అధికమవుతున్నాయి. ప్రస్తుతం బాధితులు మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన ఓ సీనియర్‌ టీడీపీ నేత ఇంటికి వెళ్లి ఈ వ్యవహారంపై ఆ నాయకుని వద్ద బోరున విలపిస్తున్నారు. తమను ఎలాగైనా కాపాడాలని, మీరంతా కలసి ఉన్నారన్న ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టామని వాపోతున్నట్టు తెలిసింది. అయితే ఈ వివరాలు మాత్రం గోప్యంగానే ఉంచుతున్నారు. 

ఐపీ పెట్టిన యజమాని?
ఇదిలా ఉండగా ఇండీట్రేడ్‌ యజమాని రాజాం పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టు, ఐపీ ద్వారా కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. 303 మంది పెట్టుబడిదారుల పేర్లును జోడించి, రూ. 18 కోట్లు మాత్రమే తమ వద్ద పెట్టుబడి పెట్టినట్టు, మందరాడలో నూతనంగా నిర్మించిన ఇల్లు మాత్రమే తనకు ఆస్తి ఉన్నట్టు ఈ ఐపీలో న్యాయస్థానానికి విన్నవించినట్టు తెలిసింది. ఇంత సంఘటన జరిగినప్పటికీ బాధితులు మాత్రం పోలీసుస్టేషన్‌లో ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం విశేషం. కొంతమంది బాధితులు మోసపోయామనే బాధతో, ఇంకొంతమంది బాధితులు అత్యాసకు వెళ్లామనే సిగ్గుతో, మరికొంమంది ఉద్యోగులు తమ ఆదాయానికి మించిన ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టడంతో ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో గోప్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయంపై రాజాం రూరల్‌ సీఐ వీరకుమార్‌ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఈ ఘటనకు సంబంధించి లిఖిత పూర్వక ఫిర్యాదు రాలేదని, పత్రికల్లో వచ్చిన కథనాలు, సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన కథనాల ప్రకారం ఆరా తీస్తున్నామని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top