ఒక్క చాన్స్ ప్లీజ్ | 23 lakhs youth wait for Government jobs | Sakshi
Sakshi News home page

ఒక్క చాన్స్ ప్లీజ్

Jan 14 2014 1:43 AM | Updated on Sep 2 2017 2:36 AM

ఒక్క చాన్స్ ప్లీజ్

ఒక్క చాన్స్ ప్లీజ్

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అటకెక్కింది. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటించిన వార్షిక క్యాలెండర్ బూజుపట్టి కునారిల్లుతోంది.

 నిలిచిపోయిన ప్రభుత్వ ఉద్యోగాలు 63,000
 వీటి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు 23,00,000
 మూలనపడ్డ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ
 బూజుపట్టిన భర్తీ వార్షిక క్యాలెండర్
 విభజన నిర్ణయంతో నోటిఫికేషన్ల జారీ నిలిపివేత
 షెడ్యూలు అమలు చేసుంటే.. సగానికి పైగా పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యేవి
 నోటిఫికేషన్లు ఇవ్వని ఏపీపీఎస్సీ..
 నోరు విప్పని సర్కారు.. ప్రభుత్వానికి  కమిషన్ లేఖ రాసినా స్పందన కరువు
 ‘విభజన’ తేలాకే నోటిఫికేషన్లు!
 తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడితో నిరుద్యోగులు సతమతం
 వయోపరిమితి ఐదేళ్లు సడలించాలంటూ డిమాండ్లు

 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అటకెక్కింది. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటించిన వార్షిక క్యాలెండర్ బూజుపట్టి కునారిల్లుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటనతో.. ఉద్యోగాల భర్తీ ప్రకటనలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల నిరీక్షణకు అంతులేకుండా పోతోంది. ఏపీపీఎస్‌సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, విద్యాశాఖ ఇలా.. వివిధ శాఖల ద్వారా దాదాపు 63,000 ఉద్యోగాల భర్తీకి జారీ కావాల్సిన నోటిఫికేషన్లు అన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. వీటి కోసం దాదాపు 23 లక్షల మంది నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నెలలు గడుస్తున్నా నోటిఫికేషన్ల ఊసులేదు. అసలు నోటిఫికేషన్లు ఇస్తారా? ఇవ్వరా? అనేది తేల్చాల్సిన ప్రభుత్వం నోరు మెదపటం లేదు. నోటిఫికేషన్లను జారీ చేయాలా? వద్దా? చెప్పండంటూ ప్రభుత్వానికి ఏపీపీఎస్‌సీ లేఖ రాసినా ఉలుకూ పలుకూ లేదు. అదేమని అడిగితే.. నోటిఫికేషన్లను ఆపాలని తాము చెప్పలేదని ప్రభుత్వ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ప్రభుత్వం సరే అంటేనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని నియామక సంస్థలు చెప్తున్నాయి. మొత్తంమీద తెలుస్తోందేమంటే.. రాష్ట్ర విభజన వ్యవహారం తేలితే కానీ నోటిఫికేషన్లు జారీ అయ్యే పరిస్థితి లేదు. కానీ.. అంతులేని కథలా సాగుతున్న ఈ వ్యవహారం ఎప్పుడు తేలుతుందో.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎప్పుడు    మొదలవుతుందో ఎవరూ చెప్పలేని దుస్థితి. ఈ అయోమయంలో ఉద్యోగాల భర్తీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులు.. ఆర్థికంగా, మానసికంగా నలిగిపోతున్నారు. నెలలు గడిచేకొద్దీ వయసు పెరుగుతుండటంతో వయోపరిమితి అనర్హత ఆందోళన కూడా వారిని వేధిస్తోంది. వీరి ఘోషను ఆలకించే నాథుడే ఇప్పుడు కనిపించటం లేదు.
 
 గ్రామీణ పోస్టులకే 20 లక్షల దరఖాస్తులు...
 
 నిరుద్యోగులు పదేపదే వెంటపడి వేడుకుంటే.. ఇటీవల ఇచ్చిన 2,677 పంచాయతీ కార్యదర్శి, 650 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, 4,305 విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పోస్టులకే దాదాపు 20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే.. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం కోసం ఎంతగా కొట్టుమిట్టాడుతున్నారో అర్థమవుతోంది. గత ఏడాది (2013) ఆగస్టులో ఏపీపీఎస్‌సీ 28 రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసేందుకు షెడ్యూలు సిద్ధం చేసింది. దాని ప్రకారం నోటిఫికేషన్లు వస్తే.. ఇప్పటివరకు సగానికి పైగా పోస్టులకు రాత పరీక్షలు, కొన్నింటి నియామాలు పూర్తయ్యేవి. ఇంకొన్నింటిలో ఇంటర్వ్యూల ప్రక్రియ చివరి దశకు చేరుకునేది. ఇంకొన్ని రోజుల్లో నోటిఫికేషన్లు వస్తాయనుకున్న తరుణంలో గత ఏడాది జూలై 30వ తేదీన రాష్ట్ర విభజనకు యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, అనంతరం కేంద్ర మంత్రుల బృందం ఏర్పాటు వంటి పరిణామాలతో ఆయా నోటిఫికేషన్ల జారీని నిలిపివేశారు. రాష్ట్ర విభజనతో ముడిపెట్టి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిలిపివేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విభజనకు సంబంధించి కచ్చితమైన కాల పరిమితి లేనపుడు.. ఎన్నాళ్లు నోటిఫికేషన్లు ఇవ్వరో.. ఎప్పుడు ఇస్తారో.. ప్రభుత్వమే చెప్పాలి. కనీసం అది కూడా చెప్పకపోవటంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
 
 ప్రిపరేషన్ నిలిపివేద్దామా?
 
 నిరుద్యోగుల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పరీక్షలకు హాజరయ్యేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని.. ఆర్థిక ఇబ్బందుల మధ్య ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే.. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియని అనిశ్చిత పరిస్థితుల్లో ప్రిపరేషన్ నిలిపివేయాలనే ఆలోచనలు వస్తున్నా.. ‘ఆమ్మో! ఒకవేళ రేపో మాపో నోటిఫికేషన్లు ఇస్తారేమో?!’ అన్న ఆందోళన నిరుద్యోగులను వెంటాడుతోంది. అలా జరిగితే పోటీలో వెనుకపడి ఉద్యోగ అవకాశాన్ని చేజార్చుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. దీంతో.. ఆర్థికంగా కష్టమైనా పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటూ సిద్ధమవుతూనే ఉన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో, ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత మూడు నాలుగేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. శిక్షణ సంస్థల్లో కోచింగ్, పుస్తకాలకు రూ. 30 వేల వరకూ ఖర్చయితే.. హాస్టళ్లలో ఉండేందుకు, ఇతరత్రా జీవన ఖర్చులు నెలకు కనీసంగా రూ. 5,000 వరకూ వ్యయమవుతుంటాయి. మొత్తంమీద ఏడాదికి రూ. లక్ష వరకూ ఖర్చవుతుండటంతో.. నోటిఫికేషన్ విడుదల ఆలస్యమయ్యే కొద్దీ ఆర్థికభారంతో నిరుద్యోగులు కుంగిపోతున్నారు. మరోవైపు.. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయనే ఆందోళన, అప్పటివరకూ ఖర్చులు ఎలా నెట్టుకురావాలనే ఆందోళన, ఆలస్యమయ్యే కొద్దీ తమ వయసు పెరిగి వయోపరిమితి కూడా మించిపోతోందనే ఆందోళన వారిలో పెరిగిపోతూ.. ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తోంది.
 
 వయోపరిమితి ఐదేళ్లు పెంచాలి... లేదంటే 4 లక్షల మందికి నష్టం
 
 ప్రభుత్వం భర్తీచేసే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి గరిష్ట వయో పరిమితిని పెంచకపోతే దాదాపు 4 లక్షల మంది అవకాశం కోల్పోయి నష్టపోనున్నారు. ఆయా పోస్టులకు 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు పెంచి 36 ఏళ్లు చేస్తూ గత ఏడాది జూన్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు కూడా డిసెంబరు 31తో ముగిసిపోయింది. ఇక గ్రూపు-1లో గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనాన్ని ఒక్క ఏడాది మాత్రమే వాయిదా వేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల కాలపరిమితి కూడా డిసెంబరు 31తో వుుగిసిపోయింది. ఇకపై జారీ చేసే నోటిఫికేషన్లకు అది వర్తించదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒకవేళ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఇస్తే గరిష్ట వయోపరిమితిని పెంచకపోతే.. దాదాపు 4 లక్షల మందికి నష్టం వాటిల్లనుంది. ప్రకటించిన షెడ్యూల్ అమలులో జాప్యం అయినందున ఈసారి ఐదేళ్లు వయోపరిమితిని సడలించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
 
 విభజన వ్యవహారం తేలేదెప్పుడు? నోటిఫికేషన్లు జారీ అయ్యేదెప్పుడు?
 
 రాష్ట్ర విభజన వ్యవహారం తేలితేనే ఉద్యోగాల భర్తీ నోటిఫిషన్లు జారీ చేస్తామన్న ధోరణిలో అటు నియామక సంస్థలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి. ఒళ్లంతా కళ్లు చేసుకుని నిరీక్షిస్తున్న నిరుద్యోగుల పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు రాష్ట్ర విభజన బిల్లులో.. విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న ఏపీపీఎస్‌సీ వెళుతుందని, తెలంగాణ రాష్ట్రానికి సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసేవరకూ యూపీఎస్‌సీ నియామక బాధ్యతలు చూస్తుందని పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అంశం తేలేందుకే ఎంత సమయం పడుతుందో అంతుచిక్కటంలేదు. రాష్ట్ర విభజన జరిగినా కూడా.. తెలంగాణకు సర్వీస్ కమిషన్ ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫికేషన్ల జారీకి మరో ఆరు నెలలకు పైగా సమయం పడుతుందని పరిశీలకుల అంచనా.
 
 ఆర్థికశాఖ విడతల వారీగా అనుమతి ఇచ్చిన పోస్టులు...
 
 మొదటి విడతలో (జూన్ 3న)...
 
 - ఏపీపీఎస్‌సీ 11,250 పోస్టులు (గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, లెక్చరర్ తదితరాలు)
 - పోలీసు శాఖ 11,623 కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు
 - డిపార్ట్‌మెంటల్ సెలెక్షన్ కమిటీల ద్వారా 10,865
 
 రెండో విడతలో (జూలై 2న)...
 
 - విద్యాశాఖ ద్వారా 20,508 ఉపాధ్యాయ పోస్టులు
 - ఏపీపీఎస్‌సీ ద్వారా మరో 1,127
 - డిపార్ట్‌మెంటల్ సెలెక్షన్ కమిటీల ద్వారా 2,443
 
 మూడో విడతలో (సెప్టెంబరు 30న)...
 
 - ఏపీపీఎస్‌సీ ద్వారా 287
 - శాఖాపరమైన భర్తీ ద్వారా 1,462
 - డిపార్ట్‌మెంటల్ సెలెక్షన్ కమిటీ ద్వారా 1,276
 
 నాలుగో విడతలో (డిసెంబరు 31న )...
 
 - ఏపీపీఎస్‌సీ ద్వారా 734
 - డిపార్ట్‌మెంటల్ సెలెక్షన్ కమిటీ ద్వారా 186
 - విద్యాశాఖ ద్వారా 898
 - ఆర్‌టీసీ ద్వారా 24,577 (ఇవీ కాంట్రాక్టు వారికే)
 
 అంతకుముందే అనుమతి ఇచ్చినవి...
 
 - 2,677 పంచాయతీ కార్యదర్శి, 4,305 విలేజ్ రెవెన్యూ అస్టిస్టెంట్, 650 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులు
 
  పోస్టుల వారీగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు...
 
 - 2011లో ఏపీపీఎస్‌సీ 314 పోస్టులకు ఇచ్చిన గ్రూపు-1 నోటిఫికేషన్‌కు 3,03,710 మంది దరఖాస్తు చేశారు.
 - మరో 873 గ్రూపు-2 పోస్టుల కోసం 4,52,669 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
 - 1,489 గ్రూపు-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తే 6.67 ల క్షల మంది పోటీ పడ్డారు.
 - 2012లో నోటిఫికేషన్ రానందున.. ఆ ఏడాది, 2013 ఏప్రిల్‌లో డిగ్రీ పూర్తి చేసుకున్న వారితో కలిపితే ఈసారి ద రఖాస్తు చేసుకునే వారి సంఖ్య మరింత పెరుగ నుంది.
 - పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేసే 11,623 కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం కనీసం 2 లక్షల మంది పోటీ పడనున్నారు.
 - 20,508 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేయనున్నారు.
 - నాలుగో టెట్ నిర్వహిస్తే మరో 2 లక్షల మంది కొత్త నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టులకు పోటీపడే అర్హత లభించే అవకాశం ఉంది.
 - ఇపుడు 2,677 గ్రామ కార్యదర్శి పోస్టులకు ఇప్పటికే 5 లక్షలు, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టులకు 15 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. గ్రూపు-1, గ్రూపు-2 వంటి పోస్టులకు సిద్ధం అయ్యే వారు కూడా వీటికి దరఖాస్తు చేశారు. అయితే ఇందులో పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన వారు 10 లక్షల మందికి పైగా ఉన్నారు. అంటే ఈ లెక్కన నోటిఫికేషన్ల కోసం దాదాపు 23 లక్షల మంది ఎదురుచూస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement