సిరిసిల్ల డివిజన్‌లో స్థాని కంగా ఉండని, చనిపోయిన 22 వేల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని ఆర్డీవో కె.శ్రీనివాస్ ఆదేశించారు.
22 వేల మంది ఓటర్ల తొలగింపు
Oct 3 2013 4:46 AM | Updated on Sep 1 2017 11:17 PM
సిరిసిల్ల, న్యూస్‌లైన్: సిరిసిల్ల డివిజన్‌లో స్థాని కంగా ఉండని, చనిపోయిన 22 వేల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని ఆర్డీవో కె.శ్రీనివాస్ ఆదేశించారు. స్థానిక మండల పరి షత్ కార్యాలయంలో బుధవారం డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. తప్పుల్లేని ఓటర్ల జాబితా తయారు చేయాలని, అందుకు క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. సిరిసిల్ల మండలంలో 3322 మంది ఓటర్లకు తొలగింపు నోటీసులు ఇచ్చామని, వారి పేర్లు తొలగించాలని ఆర్డీవో తెలిపా రు. అన్ని మండలాల్లోనూ ఇలాగే ముందస్తు నోటీసులు ఇచ్చి ఐదురోజుల్లో తొలగించాలని కోరారు.
ఈ క్రమంలో క్షేత్రస్థాయిలోనూ వాస్తవాలు పరిశీలించాలని, రాజకీయాలకు తావి వ్వొద్దని సూచించారు. రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి ప్రతిరూపమని, అవినీతికి పాల్పడుతూ శాఖ పరువు తీయొద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లావ్యాప్తంగా ఏసీబీ దాడుల్లో రెవెన్యూ శాఖ వాళ్లే ఎక్కువగా పట్టుబడుతున్నారన్నారు. భూ సం బంధ వ్యవహారాల్లో నిజాయితీగా ఉండాలని, రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని తెలిపారు. ప్రతీ అర్జీకి పక్షం రోజుల్లో దరఖాస్తుదారులకు నిర్దిష్ట సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
ఈ నెలాఖరులోగా వందశాతం భూముల వివరాలు కంప్యూటర్లలో ఆన్‌లైన్ చేయాలని, ఏ రైతుకు పహణీ అవసరమున్నా మీసేవ ద్వారానే పొందేలా చూడాలని పేర్కొన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యవస్థ భ్రష్టుపడుతోందని, ఈ పరిస్థితిని మార్చాలని కోరారు. కిందిస్థాయి రెవెన్యూ అధికారుల పనితీరుపై తహశీల్దార్లు నిఘా వేయాలన్నారు. ఏ స్థాయిలో తప్పులు జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ‘నిజాయితీగా ఉండండి.. బాధ్యతగా పని చేయండి.. పారదర్శకంగా వ్యవహరించండి’ అని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. తహశీల్దార్లు, డెప్యూటీ తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement