సంచార వైద్యంపై సమ్మెట

104 Mobile Health Service Vehicles In Strike In Prakasam - Sakshi

మారుమూల గ్రామాల్లో ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 104 సంచార వాహన సేవలు కుంటుపడుతున్నాయి. వైఎస్‌ మరణానంతరం వాటి నిర్వహణను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ప్రజలకు నేరుగా లబ్ధిచేకూర్చే ఒక్కో పథకాన్ని, ప్రభుత్వ సేవలను నీరుగారుస్తున్న చంద్రబాబు సర్కారు ‘104’ నిర్వహణనూ గాలికొదిలేసింది. ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కారం కాక సిబ్బంది చివరకు సమ్మెబాట పట్టారు. 

ఒంగోలు సెంట్రల్‌ : పల్లెల్లో వైద్య సేవలు కొరవడ్డాయి. దీంతో గ్రామీణ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పల్లెల్లో వైద్య సేవలందించే చంద్రన్న సంచార వైద్య సేవ సిబ్బంది వారం రోజులుగా సమ్మె చేçస్తుండటంతో గ్రామాల్లోని ప్రజలకు వైద్యసేవలు అందడం లేదు. 104 సిబ్బంది న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం పిరమిల్‌ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు సమ్మెను పట్టించుకోవడం లేదు. పేదల చెంతకే వైద్యాన్ని అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2009 మార్చిలో 104 వాహనాలను ప్రవేశ పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక, సాధారణ వ్యాధులతో బాధపడుతున్న వారికి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయాలన్నది ఈ పథకం ముఖ్య లక్ష్యం. తొలి నాళ్లలో మారుమూల ప్రాంతాల వారికి సైతం మెరుగైన సేవలందించిన 104 వాహనాలు మహానేత మరణానంతరం ఒడిదొడుకులు మొదలయ్యాయి.

104 వాహనాల ద్వారా అందే సేవలివీ..
గ్రామాల్లో 104 వాహనాల ద్వారా బీపీ, షుగర్, ఫిట్స్, ఉబ్బసం, గర్భిణులు, చిన్నపిల్లలకు అవసరమైన మందులతో వైద్యసేవలను అందిస్తారు. ప్రతి నెలా నిర్ణీత తేదీల్లో ఆయా గ్రామాలను సందర్శించి ప్రజలకు రక్త పరీక్షలను నిర్వహిస్తారు. అనంతరం మందులు అందిస్తారు. 

జిల్లాలో పరిస్థితి ఇదీ..
జిల్లాలో 20 సంచార వైద్య వాహనాలు ఉండగా వాటిలో 20 మంది ఫార్మసిస్టులు, 20 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 21 మంది స్టాఫ్‌ నర్సులు, 20 మంది సెక్యూరిటీ గార్డ్‌లు, 20 మంది డ్రైవర్లు ఉన్నారు. వీరిలో 70 సంవత్సరాలు దాటిన వైద్యులు ఐదుగురు ఉన్నారు. ఒక్కో విభాగంలో మరో నలుగురు రిజర్వ్‌లో ఉండాలి. అయితే రిజర్వ్‌లో ఉండాల్సిన సిబ్బంది లేరు. చాలా వాహనాల్లో వైద్యులు లేకుండానే వైద్య సేవలను కానిచ్చేస్తున్నారు.  ఏ ఒక్క వైద్యుడు సెలవు పెట్టినా గ్రామాల్లో 104 వాహనాల ద్వారా వైద్యసేవలు అందవు. 

అజమాయిషీ అంతా ప్రైవేటు సంస్థదే..
మందుల కొరత, చేయని పరీక్షలతో అరకొరగానే 104 వైద్యసేవలు అందుతున్నాయి. పైగా ప్రభుత్వం నుంచి పిరమిల్‌ అనే ప్రైవేటు సంస్థకు ఈ సేవలను అప్పగించడంతో పూర్తి స్థాయిలో పథకం పని చేయడం లేదు. దీంతో సదరు సంస్థ తన ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తోంది. 104 వాహనాలపై వైద్యశాఖ అధికారులకు కూడా పూర్తి స్థాయిలో అధికారాలు లేవు. దీంతో సంస్థ పాడిందే పాటగా, చేసిందే వైద్యంగా మారింది. ప్రస్తుతం సిబ్బంది ఎలాపోతే మాకేం అన్నట్లుగా  సంస్థ వ్యవహరిస్తుండటంతో వారు వారం రోజులుగా సమ్మె చేస్తున్నారు.

విజయనగరం జిల్లాలో 104 వాహనానికి ఫిట్‌నెస్‌ లేకపోవడంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న స్టాప్‌నర్సు, మరొక సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. స్టాఫ్‌ నర్సు నిండు గర్భిణి. సంస్థలో పని చేసే సిబ్బందికి మెటర్నిటీ సెలవులు లేకపోవడంతో నిండు గర్భిణి అయి ఉండి కూడా విధుల్లో కొనసాగాల్సి వచ్చింది. అదే విధంగా వాహనానికి ఇన్సూరెన్సు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కూడా లేకపోవడంతో బీమా సొమ్ము వచ్చే అవకాశం లేదు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.

ప్రమాదం జరిగితే అంతే
దురదృష్టవశాత్తు 104 వాహనానికి ప్రమాదం జరిగితే అంతే సంగతులు. చంద్రన్న సంచార వాహనాలకు ఫిట్‌నెస్‌ గానీ, బీమా, ట్యాక్స్‌లను పిరమిల్‌ సంస్థ చేయించడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 వాహనాలకు ఫిట్‌నెస్‌ రూపంలోనే ప్రభుత్వానికి గత రెండు సంవత్సరాలలో లక్షల రూపాయలను సంస్థ ఎగ్గొట్టింది. చంద్రన్న సంచార చికిత్స వాహనాలు కేవలం చంద్రన్న సంచార వాహనాలుగానే మిగిలిపోతున్నాయి.

వేతనాలు పెంచాలి
పదేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నా ఇంత వరకూ వేతనాలు పెంచలేదు. 151 జిఓ ప్రకారం సిబ్బంది వేతనాలు చెల్లించాలి. అన్ని వాహనాలకు ఫిట్‌నెస్, ఇన్సూరెన్సు, కల్పించాలి.
– కె.హనుమంతురావు, 104 చంద్రన్న సంచార వైద్య సేవ సిబ్బంది యూనియన్‌ అధ్యక్షుడు

సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
చంద్రన్న సంచార వైద్య సేవ వాహనాలను ప్రభుత్వమే నిర్వహించాలి. వివిధ డిమాండ్లతో వారం రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. పైగా ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని బెదిరిస్తున్నారు. మా న్యాయమైన డిమాండ్‌లను రాష్ట్ర ప్రభుత్వం, పిరమిల్‌ సంస్థలు పరిష్కరించాలి.
– కె.సురేంద్రబాబు, యూనియన్‌ కార్యదర్శి

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం
104 సిబ్బంది సమ్మె నేపథ్యంలో పిరమిల్‌ సంస్థ ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వైద్యులు గ్రామాలకు వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఉండే ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు, వైద్యులకు సహాయ పడుతున్నారు.
– డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top