breaking news
-
అమెరికాలో బుర్రిపాలెం విద్యార్థి అనుమానాస్పద మృతి
తెనాలిరూరల్: అమెరికాలోని కనెక్టికట్‌లో నివశిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతుల తనయుడు అభిజిత్ (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మిలు ఎన్నో ఏళ్ల క్రితమే బుర్రిపాలెం నుంచి అమెరికాలోని కనెక్టికట్ వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు అభిజిత్ బోస్టన్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నెల 8వ తేదీ నుంచి అభిజిత్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సెల్ నంబర్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని బోస్టన్ సమీపంలోని అడవి ప్రాంతంలో అదే రోజు గుర్తించారు. ఇది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా అభిజిత్ భౌతిక కాయం అమెరికా నుంచి శుక్రవారం రాత్రి స్వస్థలం బుర్రిపాలెం చేరుకుంది. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ భౌతికకాయాన్ని సందర్శించి, అభిజిత్ తల్లిదండ్రులను పరామర్శించారు. -
ట్రోలింగ్స్ వల్లే మనస్తాపంతో గీతాంజలి ఆత్మహత్య
ప్రతినిధి, గుంటూరు/నగరంపాలెం : ఇంటి పట్టా రిజిస్టరై చేతికి వచ్చిన సందర్భంలో ఆనందంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ గీతాంజలి పాలిట శాపంగా మారిందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ వీడియోను ట్రోల్ చేయడంతో తట్టుకోలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గీతాంజలి మృతికి బాధ్యులైన ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసు విచారణ కోసం ఐపీఎస్ అధికారి నచికేత్ షెల్కే నేతృత్వంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), శ్రీనివాసరావు (ఎల్/ఓ), తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీ రమేష్‌తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. ఈ క్రమంలో ఫేస్బుక్, ట్విటర్ ద్వారా వచ్చిన ట్రోలింగ్‌లను పరిశీలించామన్నారు. గీతాంజలి నాలుగో తేదీన లోకల్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిందని, ఆమె మాట్లాడిన మాటలు అదే రోజు సోషల్ మీడియాలో వైరలయ్యాయని తెలిపారు. దీనికి అనేక వ్యూస్ వచ్చాయని, దీంతో ఆమెను కొందరు ట్రోల్ చేయడం మొదలుపెట్టినట్లు గుర్తించామన్నారు. వీటిని చూసి అమె మనస్తాపానికి గురైందని, రెండు రోజులు డీలాగా గడిపినట్లు తెలిసిందన్నారు. ఏడో తేదీ ఉదయం ఈ ట్రోలింగ్‌పై తన సన్నిహితులు, బంధువులతో చర్చించిందని, వాటిని ఎలా తొలగించాలని వారిని అడగ్గా, అది సాధ్యం కాదని వారు ఆమెకు చెప్పారని తెలిపారు. ఈనెల ఏడో తేదిన ఆమెకు విజయవాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ పోస్ట్‌కు ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిందని, ఆ తర్వాత కూడా బంధువులతో మాట్లాడిందని చెప్పారు. తనను, తన పిల్లలను, భర్తను కూడా అసభ్య పదజాలంతో తిడుతున్నారని వారి వద్ద ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గీతాంజలి తెనాలి రైల్వే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు. ఆమెను గమనించి లోకో పైలెట్ అప్రమత్తమై, బ్రేక్ వేసి రైలును నిలిపారని, అప్పటికే రైలు తగలడంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు. ఆమెను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. తెనాలి జీఆర్పీ పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను విచారించగా, సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్ల వల్ల ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ కేసు తీవ్రతను గుర్తించి క్రైమ్ నంబర్ 28/24/యు/ఎస్ 174 సీఆర్‌పీసీగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ తరువాత కేసును తెనాలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ కాగా, దానిని కేసు నంబర్ 65/24సెక్షన్ 509, 306 ఐపీసీ , సెక్షన్ 67 ఐటీ యాక్ట్‌గా తిరిగి నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వెయ్యికిపైగా కామెంట్లు ఉన్నట్లు విచారణ బృందాలు గుర్తించాయన్నారు. సోషల్ మీడియాలో అటువంటి భాష ఉపయోగించడం బాధాకరమన్నారు. ట్రోలింగ్‌కు పాల్పడిన విజయవాడకు చెందిన పసుమర్తి రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన వెంకట దుర్గారావుని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని అన్నారు. మిగతా వారిని గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. ట్రోల్స్‌పై ఫిర్యాదు చేయండి పిల్లలు, మహిళలు, ఎవరైనా ఇటువంటి దారుణమైన ట్రోల్స్‌కి గురైతే సచివాలయాల్లోని మహిళా పోలీసులకు, స్థానిక పోలీస్ స్టేషన్లో, దిశ పీఎస్‌లో, దిశ యాప్, డయల్ 100, స్టేట్ మహిళా హెల్ప్‌లైన్ నంబర్, సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్ 9121211100కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ చెప్పారు. నేరుగా తనను కూడా సంప్రదించవచ్చన్నారు. -
గీతాంజలి కేసులో ఇద్దరి అరెస్ట్
సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్‌తో బలవనర్మణానికి పాల్పడిన గీతాంజలి కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుకు అనుచరుడిగా తెలుస్తోంది. దుర్గారావు అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జగనన్న పాలనలో తనకు మంచి జరిగిందంటూ ఇంటి పట్టా అందుకున్న ఆనందంలో గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. అయితే ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. ఆమెను అతిదారుణంగా ట్రోల్ చేశారు. దీంతో.. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియాలో వేధించిన సైకోలను వదల్లొద్దంటూ డిమాండ్ బలంగా వినిపించింది. ఏపీ పోలీసులు కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసి.. పసుమర్తి రాంబాబును అరెస్ట్ చేశారు. గీతాంజలిపై రాంబాబు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాంబాబును అదుపులోకి తీసుకుని తెనాలి స్టేషన్‌కు తరలించారు. దుర్గారావు అనే మరో వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు గీతాంజలిపై అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన నేతల అకౌంట్ల పరిశీలన జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. చాలామంది పోస్టులు డిలీట్ చేసినప్పటికీ.. స్క్రీన్ షాట్లను పరిశీలించాక వాళ్లపై చర్యలు ఉంటాయని.. అలాగే పరారీలో ఉన్న మరికొందరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. -
సోషల్ మీడియా చీడ పురుగులు
సాక్షి, అమరావతి:పేదింటి పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుకుని ఇంగ్లిష్‌లో గలగలా మాట్లాడితే వారికి కడుపు మంట..వారిపై సోషల్ మీడియాలో హేళనలు... వేధింపులు ప్రభుత్వ బడిలో చదువుకుని ప్రతిభా పాటవాలతో అమెరికా వెళ్లి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తే చాలు... సోషల్ మీడియాలో ఈసడింపులు... చీత్కారాలు.. ప్రభుత్వం తనకు ఇల్లు ఇచ్చిందని పేద మహిళ సంతోషం వ్యక్తం చేస్తే చాలు... సోషల్ మీడియాలో దూషణలు, దుర్భాషలు.. పేదలు, సామాన్యులు హాయిగా నవ్వితే ఓర్చుకోలేరు... సంతోషంగా ఉంటే తట్టుకోలేరు... జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కితే సహించలేరు. దూషణలతో వేధిస్తూ.. పరుష పదజాలంతో దూషిస్తున్నారు. చివరికి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఎలాంటి తప్పు చేయకపోయినా అవమానభారంతో నలుగురులోకి రాలేని పరిస్థితి తీసుకువస్తారు. తాజాగా తెనాలికి చెందిన గీతాంజలి ఉదంతమే అందుకు తార్కాణం. రాష్ట్రంలో దాదాపు ఐదేళ్లుగా టీడీపీ, జనసేనలు సాగిస్తున్న వికృత క్రీడ ఇది. మహిళలు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికలపై ట్రోలింగ్‌తో పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. అందుకోసం టీడీపీ, జనసేన పార్టీలు ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి మరీ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడుతుండటం ఆ రెండు పార్టీల దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ట.. ఓటమిని జీర్ణించుకోలేక దిగజారుడు రాజకీయాలు 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఘోరపరాజయంతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు బరితెగించారు. సాధారణ మహిళలు, విద్యార్థులు, సామాన్యుల్ని లక్ష్యంగా చేసుకుని దుర్మార్గ రాజకీయాలకు తెరతీశారు. సోషల్ మీడియా ద్వారా అసభ్య కామెంట్లతో దాడులు చేయమని తమ పార్టీ సోషల్ మీడియా విభాగాలకు ఆదేశించారు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు. టీడీపీ, జనసేన పార్టీలు పక్కా పన్నాగంతో సోషల్ మీడియా వేదికగా కుట్రకు తెరతీశాయి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసి వందలాది మందిని తమ సోషల్ మీడియా విభాగాల్లో నియమించాయి. వేలాది ఫేక్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా సామాన్యులను వేధించడం మొదలుపెట్టాయి. టీడీపీ సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తిలు కూడా సోషల్ మీడియా ద్వారా సామాన్యులను వేధించడం విభ్రాంతి కలిగిస్తోంది. ఆ రెండు పార్టీల సోషల్ మీడియా విభాగాలకు చెందిన వందలాది మంది ట్రోలింగ్ పిశాచాలుగా మారి సామాన్యులను వేధింపులకు గురిచేశారు. లబ్ధిదారులే లక్ష్యం పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్ ఆసరా, వాహనమిత్ర, చేయూత, తోడు, చేదోడు, సున్నావడ్డీ, రైతు భరోసా తదితర పథకాల లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తే చాలు వారిని వ్యక్తిగతంగా దూషిస్తూ విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేయకుండా కట్టడిచేయాలన్నదే టీడీపీ, జనసేన పార్టీల కుట్ర. న్యాయ వ్యవస్థపైనా ట్రోలింగే టీడీపీ, జనసేన పార్టీలు చివరికి న్యాయ వ్యవస్థను కూడా విడిచిపెట్టకపోవడం పరాకాష్ట. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోనం కేసులో అరెస్టయిన చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తిని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. హైకోర్టు ఆదేశాలతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి లక్ష్యంగా పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్‌ను గతేడాది నవంబర్ 27న పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, సీఐడీ కఠిన చర్యలు సామాన్యులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులపై పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. అసభ్యకర, రెచ్చగొట్టే పోస్టింగులు పెడుతున్నవారిరి ఐపీ అడ్రస్‌లతో గుర్తించి కేసులు నమోదు చేస్తోంది. సైబర్ బుల్లీషీట్లను తెరచి దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో సీఐడీ 2,919 సైబర్ బుల్లీషీట్లను నమోదు చేసింది. సోషల్ మీడియా వేధింపులకు భయపడకుండా ఫిర్యాదు చేయాలని సీఐడీ విభాగం కోరుతోంది. సామాన్యుల గొంతు నొక్కే కుట్ర ప్రతిపక్షాలు అధికార పార్టీని విమర్శించవచ్చు... పథకాల్లో లోపాలను ప్రశ్నించవచ్చు. అందుకు విరుద్ధంగా పథకాలు, కార్యక్రమాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని వారిని వ్యక్తిగతంగా వేధించేందుకు బరితెగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విధానంపై ప్రశంసలు వ్యక్తమవడం ప్రతిపక్ష పార్టీలకు నచ్చలేదు. కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్‌లో అనర్గళంగా ప్రసంగించడంతో ఓర్వలేక వారిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ, జనసేన నేతలు, సోషల్‌మీడియా విభాగాలు వేధింపులకు పాల్పడ్డాయి. అమెరికాలోని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులనూ అదే రీతిలో వేధించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే ఆ రెండు పార్టీల లక్ష్యం. ఇంగ్లీష్ మీడియం చదువుల గురించి మాట్లాడకుండా చేయాలన్నదే కుతంత్రం. వేధిస్తే కఠిన శిక్షలు ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్‌కు పాల్పడేవారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. 67 ఐటీ చట్టం: ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్‌లకు పాల్పడితే ఈ సెక్షన్ కింద గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా ఐపీసీ 354: ఉద్దేశపూర్వకంగా ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని వేధిస్తే ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తారు. మహిళను నేరుగా గానీ ఆన్లైన్, సోషల్ మీడియా వేదికల ద్వారా అదే పనిగా సంప్రదించడం, వెంటపడటం, దూషించడం, అవమానించడం, వేధించడం తీవ్రమైన నేరాలు.. అందుకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా ఐపీసీ 509: ఉద్దేశపూర్వకంగా ఓ మహిళను తమ మాటలు, చేతలు, సైగల ద్వారా అవమానించడం, ఆమె గౌరవానికి భంగం కలిగించడం తీవ్రమైన నేరం. గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా ఐపీసీ 306: ఒకర్ని వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేయడం. బాధ్యులకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా ఐపీసీ 120ఎ: ఇద్దరు గానీ అంతకంటే ఎక్కువ మంది ఉద్దేశపూర్వకంగా ఒకరిని నేరుగా లేదా ఆన్లైన్, సోషల్ మీడియా వేదికల ద్వారా వేధించడం తీవ్రమైన నేరం. ఐపీసీ 504: ఉద్దేశ పూర్వకంగా గౌరవానికి భంగం కలిగించడం తీవ్రమైన నేరం. రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఫిర్యాదు ఇలా...సైబర్ క్రైమ్ పోర్టల్: https:// cybercrime. gov. in/ సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్: 9121211100 సైబర్ బుల్లీయింగ్ 4ఎస్4యు: 9071666667 ఇంగ్లిషులో మాట్లాడితే ఓర్వలేక.. సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి జెడ్పీ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం’ (ఎల్ఐపీ), ‘ లెర్న్ ఏ వర్డ్ ఏ డే’ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడే స్థాయికి వచ్చారు. ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడడం నేర్పించారు. అమెరికాలోని అట్లాంటా, జార్జియా ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, వారి స్నేహితులతో ఆన్లైన్లో విద్యార్ధులతో డిబేట్ నిర్వహించారు. తోలెం మేఘన, తేజస్విని వంటి విద్యార్థినులు మెరికల్లా రాణించారు. అమెరికన్ యాసలో అనర్గళంగా మాట్లాడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇవి టీడీపీ నేతలకు కంటగింపుగా మారాయి. ఆ విద్యార్థినులకు వ్యతిరేకంగా ట్రోల్ చేయించారు. ఆ విద్యార్థినులు టెన్త్‌లో ఫెయిల్ అయ్యారంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు నోరుపారేసుకున్నారు. ఆ విద్యార్థిని టెన్త్‌లో 478 మార్కులతో పాసైంది. ఆ విద్యార్థిని తల్లి తొండంగి పోలీసులకు 2022 జూన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పట్లో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. మేఘనపై అసభ్యకర పదజాలంతో ట్రోలింగ్ చేశారు. ఆమె తల్లి తొండంగి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్ 509, ఐటీ యాక్ట్ 2020 సెక్షన్ 67 కింద ట్రోలర్స్‌పై అప్పటి ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేశారు. -
నేరుగా వచ్చి ఆత్మహత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, గుంటూరు:‘గుంటూరు నుంచి 12.05 గంటల ప్రాంతంలో తెనాలి స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి అప్పటి వరకూ ఫోన్ మాట్లాడుతూ ట్రాక్ పక్కన నిలబడిన యువతి ఒక్కసారిగా ట్రాక్ పైకి వచ్చేసింది. ఆమెను తప్పుకోమని అరుస్తూ ఎమర్జెన్సీ బ్రేక్ వేశా. అయితే అప్పటికే రైలు ఇంజన్ ఆమెకు తగిలింది. స్పృహ తప్పి పడిపోయిన ఆమెను ప్రయాణికుల సహకారంతో ట్రైన్ ఎక్కించుకుని తెనాలి స్టేషన్లో స్టేషన్ మాస్టర్‌కు అప్పగించా’నని జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్ విజయ్‌రామ్ జీఆర్పీ పోలీసులకు అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు. రైల్వే స్టేషన్ మాస్టర్ దగ్గర ఉన్న పుస్తకంలో కూడా ప్రమాదానికి సంబంధించిన వివరాలను నమోదు చేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌లకు గీతాంజలి ఈ నెల ఏడున రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేయడం ఆ తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలుగుదేశం సోషల్ మీడియాలోనూ, అఫిషియల్ మీడియాలో కూడా ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేలా కామెంట్స్ పెడుతున్నారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆమెను రైలు కిందకు తోసేసి పరారు అయ్యారంటూ ఒక వీడియోలో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లుగా చూపిస్తూ మార్ఫింగ్ వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు. దీనిని ఎడిట్ చేసి బయటకు వదిలినట్లుగా పోలీసుల విచారణలో స్పష్టం అయ్యింది. ఈ వీడియోను సర్క్యులేట్ చేసింది ఎవరు? అనేదానిపై కూడా విచారణ జరుపుతున్నారు. చనిపోయిన తర్వాత కూడా వదలకుండా ఆమె వ్యక్తిత్వాన్ని తప్పు పట్టేవిధంగానే తెలుగుదేశం సోషల్‌మీడియాలో బురదజల్లుతోంది. లోకోపైలెట్ ఇచ్చిన స్టేట్మెంట్తో అసలు ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం లేదని, ఆమె ఒక్కతే వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు స్పష్టం అవుతోది. అయినా తెలుగుదేశం చేస్తున్న తప్పుడు ఆరోç³ణల నేపథ్యంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తెనాలి డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసుబృందం బుధవారం సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ చుట్టుపక్కల వారిని విచారించింది. దగ్గరలో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అన్న విషయాన్ని ఆరా తీసింది. సోషల్‌మీడియా ట్రోలింగ్‌ల నేపథ్యంలో మృతి చెందినట్లు ఆమెకుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో ట్రోలింగ్‌కు పాల్పడిన హ్యాండిల్స్‌ను గుర్తించి బాధ్యులను అదుపులోకి తీసుకునే దిశగా పోలీసు బృందాలు తమ విచారణ వేగవంతం చేశాయి. ఒక బీసీ మహిళను వేధించి ఆత్మహత్యకు పురికొల్పడమే కాకుండా చనిపోయిన తర్వాత కూడా ఈ విధంగా ట్రోల్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీలోనే కొందరు తప్పు పడుతున్నారు. నాడు రిషితేశ్వరిని ఇలాగే పొట్టన పెట్టుకున్నారు నాడు రిషితేశ్వరి నుంచి నేటి గీతాంజలి వరకూ పచ్చమూకల వికృత చర్యలకు బలైపోయిన వారే. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా ఎవరిని తీసుకున్నా వారికి ముందు నుంచి మహిళలంటే చిన్నచూపే. 2015లో గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి ర్యాగింగ్‌కు గురై యూనివర్సిటీ వసతి గృహంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన యూనివర్సిటీ అధికారులు, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మౌనం వహించింది. విద్యార్థిని మృతికి కారణమైన అప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. బాబురావుతోపాటు అప్పుడు యూనివర్సిటీ పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులపై కేసు నమోదు చేయాలని, రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. బలహీన వర్గాల విద్యార్థినికి న్యాయం చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వప్రయత్నించకపోగా న్యాయం కోసం ఉద్యమిస్తున్న వారిని అడ్డుకుంది. రిషితేశ్వరి మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉద్యమం చేస్తున్నాయనే కారణంతో ప్రభుత్వం, యూనివర్సిటీ ఉన్నతాధికారులు యూనివర్సిటీ విద్యార్థి సంఘాలను నిషేధించారు. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాల బోర్డులను సైతం తొలగించారు. ఉద్యమాన్ని అణిచేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. విద్యార్థిని ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను రక్షించేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అప్పట్లో ప్రజాసంఘాలు బహిరంగంగానే ఆరోపణలు చేశాయి. విచారణ కమిటీల పేరుతో కాలయాపన చేసింది. రిషితేశ్వరి ఆత్మహత్యపై కథనాలు రాస్తున్నారనే అక్కసుతో కొందరు మీడియా ప్రతినిథులపై కేసులు నమోదు చేస్తామని కూడా బెదిరించారు. రాష్ట్రంలో బలహీన వర్గాల మహిళల ప్రాణాలకు రక్షణ లేదని రిషితేశ్వరి మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం వీడాలని అప్పట్లో ఎమ్మెల్యే ఆర్కే రోజాతోపాటు పలువురు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఆప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ జి. బాబురావుపై చర్యలు తీసుకుందే తప్ప చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా బుద్ధి మార్చుకోలేదు. -
టీడీపీ– జనసేన సైకోమూకలపై జనం కన్నెర్ర
ఈ నైచ్యానికి అంతులేదు. ఈ మానవ మృగాలకు బుద్ధి రానే రాదు. ప్రభుత్వ పథకాలు తమ కుటుంబానికి మేలు చేశాయన్నందుకు.. బీసీ మహిళ గీతాంజలిని వీధి కుక్కల్లా వెంటాడారు. వేధించారు. థర్డ్‌డిగ్రీకి పదింతల ఆన్లైన్ టార్చర్‌కు గురిచేశారు. తట్టుకోలేక ఆమె రైలు కింద పడి తనువు చాలించినా ఈ దరిద్రులకు సిగ్గురాలేదు. రైల్వేస్టేషన్ దగ్గర ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన సమయంలో ఎవరో తీసిన రెండు నిమిషాల వీడియోలో మాటల్ని ఎడిట్ చేసి మరీ.. చనిపోయాక కూడా ఆమెను చిత్రవధ చేయడం మొదలెట్టారు. ‘ఎవరో ఇద్దరు నెట్టేశారంట’ అనే మాటల్ని వీడియోకు కొత్తగా జోడించి దాన్ని ‘ఎక్స్’లో తెలుగుదేశం పార్టీ అధికారిక హ్యాండిల్‌లోనే పోస్ట్ చేసిందంటే ఏమనుకోవాలి? వీళ్లకసలు సిగ్గూ.. లజ్జా.. ఏమైనా ఉన్నాయా? పైపెచ్చు అవే ఎడిటెడ్ మాటల్ని వైరల్ చేస్తూ.. నెట్టేసిన ఇద్దరూ ఎవరు? ఆమెతో ఎందుకు వెళ్లారు? అంటూ టీడీపీ, జనసేన సోషల్ మీడియా మాఫియా పలు పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హననం చేస్తోందంటే ఏమనుకోవాలి? గీతాంజలి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలియగానే.. ఆమెపై చేసిన దారుణమైన వ్యాఖ్యల్ని తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించి తప్పించుకోవాలని చూస్తున్న ఈ రాక్షసుల్ని ఏం చేయాలి? వీళ్లదసలు మనిషి పుట్టుకేనా? వీళ్లకు కుటుంబాలున్నాయా? సాక్షి, అమరావతి/రేపల్లె రూరల్/తెనాలి రూరల్/ సాక్షి నెట్ వర్క్:‘పురాణాల్లో దుశ్శాసనుడు కూడా ఇంతదారుణంగా వ్యవహరించి ఉండకపోవచ్చు.. ఇప్పుడు ఆయనే ఉంటే మానమృగాలైన టీడీపీ–జనసేన సైకో మూకల తీరు చూసి సిగ్గు పడేవాడు.. ట్రోలింగ్‌తో వెంటపడి, వేటాడి గీతాంజలి మృతికి కారణమైన ఈ సైకోలందరినీ కఠినంగా శిక్షించాల్సిందే’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఆడబిడ్డ అన్యాయంగా చనిపోయిందనే కనికరం కూడా లేని ఆ పార్టీల అధినేతలు.. మహిళా సాధికారత గురించి మాట్లాడుతుండటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. సంక్షేమ పాలనకు ప్రజలు విశేషంగా ఆకర్షితులవుతుంటే తట్టుకోలేని ఈ మానవ మృగాల టార్గెట్‌తో ఒక నిండు ప్రాణం బలైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమ కోల్పోయి దిక్కుతోచని వారయ్యారని, ఇందుకు బాధ్యత వహించాల్సింది చంద్రబాబు, పవన్లేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై జాతీయ మీడియా సైతం స్పందించింది. మితిమీరిన ట్రోలింగ్‌లకు ముకుతాడు వేయాలని వార్తలు ప్రసారం చేసింది. సర్వత్రా ఆగ్రహం ♦ టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోల కారణంగా మృతి చెందిన గీతాంజలికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, నేతలు నివాళులర్పించారు. ఈ ఘటనను ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటేశ్‌గౌడ్, వైఎస్సార్సీపీ నెల్లూరు నాయకురాలు మోయిళ్ల గౌరి, విశాఖపట్నం వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలో పలు చోట్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ♦ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి గుంటూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు చర్చి సెంటర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి, వైఎస్సార్ సీపీ మహిళా నేతలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ శిఖామణి సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ఐడీసీ ఛైర్పర్సన్ బండి నాగేంధ్ర పుణ్యశీల, మహిళా నేతలు ర్యాలీ నిర్వహించారు. ఇది టీడీపీ, జనసేన సైకోల హత్య ‘గీతాంజలిది ఆత్మహత్య కాదు. టీడీపీ, జనసేన సైకోలు చేసిన హత్యగానే పరిగణించాలి. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ మానసికంగా వేధించడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన తల్లి పార్థివదేహం వద్ద ఇద్దరు చిన ఆడబిడ్డలు ఏడుస్తుంటే చూసిన ప్రతీ ఒక్కరూ చలించిపోయారు. తన సొంతింటి కల నెరవేర్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఆమె గుండెల్లో పెట్టుకోవడమే పాపమైపోయిందా? సీఎం జగన్‌ను మళ్లీ గెలిపించుకుంటామని చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా? టీడీపీ, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు మరీ ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా? తల్లిని కోల్పోయిన ఆ ఇద్దరు ఆడబిడ్డల భవిష్యత్తేంటి? మీ సోషల్ మీడియా సైకోలు తల్లి మమకారాన్ని తిరిగి తెస్తాయా? తన భార్య ఎంతో సంతోషంగా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నందునే టీడీపీ, జనసేన సైకోలు సోషల్‌మీడియా ట్రోల్స్‌తో ఆమె తీవ్రంగా మనోవ్యధకు గురైందని.. ఆరోజు రాత్రి, తెల్లవారుజామున కూడా ఆమె ఆ రెండు పార్టీల సోషల్ మీడియా దుర్మార్గులు పెట్టిన కామెంట్లు చదివి బాధ పడిందని గీతాంజలి భర్త చెబుతుంటే బాధేస్తోంది. ఐటీడీపీ నారా లోకేశ్ ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియా సంస్థ. కానీ, దీన్ని ఐటీడీపీ అనేకంటే ఉగ్రవాద సంస్థగా చెప్పాలి. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు మహిళను బలితీసుకునే అధికారం ఎక్కడిది? టీడీపీ, జనసేన స్వార్థ రాజకీయాల కోసం మహిళను బలితీసుకునే అధికారం ఎవరిచ్చారు? ఆ పార్టీల సోషల్ మీడియా రాబంధుల వికృత చేష్టలతో ఒక మహిళ నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నారు. టీడీపీ–జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు మనుషులా? మృగాలా? తన కూతురికి అమ్మ ఒడి వచ్చిందని, అత్తకు చేయూత, తన మామకు పింఛన్‌తో కలిపి మొత్తం ఇంటిలో నాలుగు పథకాలు వచ్చాయని చెప్పడంతో పచ్చ మందకు కళ్లు కుట్టాయి. ఇలాంటి ఘటనలతో పైశాచిక ఆనందాన్ని పొందేందుకేనా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు రూ.కోట్లు వెచ్చించి సోషల్ మీడియాను నడుపుతున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. మహిళల సంక్షేమానికి ఏం చేశారు. ఆయన హయాంలోనే బడుగు బలహీన వర్గాల పిల్లలు అంతర్జాతీయ వేదికల్లో ఇంగ్లిష్‌లో మాట్లాడటాన్ని కూడా తట్టుకోలేక వారిపైనా ట్రోలింగ్‌తో నీచపు రాజకీయం చేశారు. – పోతుల సునీత, ఎమ్మెల్సీ కక్షగట్టి ట్రోలింగ్ గీతాంజలి మృతికి కారణమైన బాధ్యులకు శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగిందని గీతాంజలి గట్టిగా చెప్పడం టీడీపీ, జనసేనకు నచ్చలేదు. అందుకే పనిగట్టుకుని, కక్షతో ట్రోలింగ్‌కు గురిచేశారు. మానసిక చిత్రహింస తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. ఒక సామాన్య మహిళపై అసభ్యకరంగా పోస్ట్‌లు పెట్టేవారిని సభ్యసమాజంలోని ప్రతి వ్యక్తి ఖండించాలి. తాము పొందిన లబ్ధి గురించి తెలియజేస్తున్న ప్రజల స్వేచ్ఛను హరించేలా టీడీపీ–జనసేనల సోషల్ మీడియాల్లో వికృతంగా వ్యవహరించడం దారుణం. – మోపిదేవి వెంకట రమణారావు, ఎంపీ మనిషిని బతికించేలా మాట ఉండాలి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనిషిని బతికించేలా ఉండాలి. టీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్‌కు బలైన గొల్తి గీతాంజలి కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలవడం ప్రశంసనీయం. సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకర పదజాలం వాడేవారిని శిక్షించాలి. – జి.శాంతమూర్తి, వైఎస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు దోషులను వదిలేది లేదు: ఎస్పీ సాక్షి ప్రతినిధి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కేసు విచారణ వేగవంతం చేశామని, దోషులను వదిలేది లేదని గుంటూరు ఎస్పీ తుషార్‌డూడీ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఏడో తేదీ ఉదయం 11 గంటలకు తెనాలికి చెందిన గీతాంజలి(32) తెనాలి ఐదో నంబర్ ఫ్లాట్‌ఫాం సమీపంలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కింద పడే ప్రయత్నం చేసిందని తెలిపారు. ఆమె 11వ తేదీ అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ మరణించిందన్న సమాచారం మేరకు తెనాలి రైల్వే పోలీసులు 174 సెక్షన్ కింద కేసునమోదు చేశారని చెప్పారు. ఈ కేసును రైల్వే పోలీసుల నుంచి తెనాలి వన్‌టౌన్‌కు బదిలీ చేశారని, రైల్వే పోలీసుల విచారణ నివేదిక ఆధారంగా కేసును సెక్షన్ 174 నుంచి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సెక్షన్ 306కి మార్పు చేయడం జరిగిందన్నారు. గీతాంజలి తనకు ఇంటి పట్టా వచ్చిందన్న ఉత్సాహంలో చేసిన వీడియోను పోస్టు చేసినందుకు ఆమెను చనిపోయేలా కించపరిచారన్నారు. ఇప్పటికే ట్రోల్ చేసిన వారి హ్యాండిల్స్‌ను గుర్తించామని, ఇందులో కొంతమంది తమ పేరుతోనే అకౌంట్ నడుపుతుంటే మరికొందరు ఫేక్ అకౌంట్లు నడుపుతున్నారు. వీరందరిని గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలను నియమించామన్నారు. మానవత్వం లేని నాదెండ్ల తెనాలి పట్టణం వహాబ్చౌక్ ఇస్లాంపేటకు వెళ్లే రోడ్డు ప్రారంభంలోనే ఉన్న గీతాంజలి ఇంటి ముందు పెద్ద ఎత్తున జనం గుమిగూడి జరిగిన ఘటన గురించి చర్చించుకుంటున్న తరుణంలో జనసేన నేత నాదెండ్ల తీరు విమర్శలకు దారితీసింది. గీతాంజలి ఇంటికి కూత వేటు దూరంలోనే ఆయన నవ్వుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ‘ఈయనేం లీడర్.. మానవత్వం లేదా?’ అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కుట్రతోనే వేధింపులు
తెనాలి: ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి సంతోషంగా తన అభిప్రాయాన్ని తెలియజేసిన గొల్తి గీతాంజలిపై సోషల్ మీడియాలో వికృతంగా ట్రోల్ చేసి ఆమె బలవన్మరణానికి కారకులైన ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా మృగాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని హెచ్చరించారు. గీతాంజలి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వెనుక ప్రభుత్వం చేసిన మంచిని మరెవరూ చెప్పకుండా అణచివేయాలనే పెద్ద కుట్ర ఉందని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనల వెనక నారా లోకేశ్ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. గీతాంజలి మరణించిన తర్వాత కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వీరికసలు మనసనేది ఉందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలంతా వీరి దుశ్చర్యలను గమనించాలని రానున్న ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఆమె సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలోని గొల్తి గీతాంజలి నివాసానికి మంగళవారం సాయంత్రం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పోతుల సునీత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వినర్ సజ్జల భార్గవరెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ చైర్పర్సన్ పవిత్ర పరామర్శించారు. గీతాంజలి భర్త బాలచంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమార్తెలు రిషిత, రిషికలను పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనతో తామంతా వచ్చామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. సీఎం జగన్ రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించినట్లు పేర్కొన్నారు. వీరితోపాటు గుంటూరు తూర్పు అసెంబ్లీ ఇన్చార్జి నూరి ఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జి మురుగుడు లావణ్య, ఎన్నారై అధికార ప్రతినిధి కడప రత్నాకర్, గాలి అరవింద, పలువురు ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చితిమంటల్లోనూ చలికాచుకుంటున్నారు... ప్రభుత్వం చేసిన మంచిని చెప్పే ఉత్సాహంలో ఒక అంకె తప్పు చెప్పడం బూతులాగా అనిపించిందా? గీతాంజలి చనిపోయి రెండురోజులైనా ఇంకా పోస్టులు పెడుతూ, ఇంకా రాబందుల్లా పీక్కుతింటున్నారు. తాగుబోతులు, సైకోలు వీరంగం వేసినట్టుంది. గీతాంజలి చితిమంటల్లోనూ చలికాచుకుంటున్న మీకు సిగ్గుండాలి.లోకేశ్ భార్య, చంద్రబాబు భార్యపై పోస్టులు పెడితే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు భార్యను ఏమీ అనకుండానే అసెంబ్లీ నుంచి బయటకొచ్చి గొడవ చేశారు. రాజీపడేదే లేదు. అందరికీ శిక్షలు పడతాయి. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. – నందిగం సురేష్, ఎంపీ సోషల్ మీడియా టెర్రరిజం గీతాంజలిపై ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా చేసింది ట్రోలింగ్ కాదు...టెర్రరిజం అంటాను. మా పార్టీలోని మహిళా ప్రజాప్రతినిధులు, మంత్రులు, సీనియర్ లీడర్లు, జర్నలిస్టులు అందరూ ఈ టెర్రరిజం బాధితులే. గీతాంజలి చనిపోయాక కూడా వదలడం లేదు. బాధపడుతున్నట్టు ఒక్కరు కూడా చెప్పటం లేదు. ఒక కుటుంబంలో భార్య, తల్లి, కోడలు, కుమార్తెగా ఉంటున్న మహిళ మరణానికి కారకులయ్యారు. న్యాయం ఏమిటి? నారా లోకేశ్, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ చెప్పాలి. ప్రజాస్వామ్యానికి ఇది నిజంగా బ్లాక్ డే. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఎక్కడా అసభ్యత ఉండదు. – సజ్జల భార్గవ, కన్వినర్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్య గీతాంజలిది ఆత్మహత్య కాదు...టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్య. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి కుటుంబంలోని లబ్దిదారులే స్టార్ క్యాంపెనర్లు అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధిని చెప్పిన గీతాంజలి నోరు నొక్కితే ఇంకెవరూ నోరు విప్పరు అనే కుట్రతో ఆమెను ట్రోల్ చేశారు. సీఎం జగన్ చేసిన మంచిని ఎవరూ చెప్పకూడదనే ఆమె జీవితాన్ని అంతం చేశారు. సోషల్ మీడియాలో మహిళలు ఎవరూ మాట్లాడకూడదనే వారి కుట్ర. – వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ పట్టా ఇచ్చిన చేత్తోనే నివాళి అర్పించడం దురదృష్టం... గీతాంజలికి ఈ నెల 4వ తేదీన రిజిస్ట్రేషన్ పట్టాను ఇచ్చిన చేతులతోనే ఆమె భౌతికకాయంపై పూలమాల వేసి నివాళి అర్పించాల్సి రావడం దురదృష్టం. ఆమె మరణానికి కారకులను ప్రభుత్వం శిక్షిస్తుంది. మానవతా దృక్పథంతో సీఎం జగన్మోహన్రెడ్డి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఆమె ఇద్దరు ఆడపిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. – అన్నాబత్తుని శివకుమార్, తెనాలి ఎమ్మెల్యే గీతాంజలిని దారుణంగా వేధించారు.. ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియావాళ్లు గీతాంజలిని దారుణంగా వేధించారు. ఆమె బలవన్మరణానికి కారకులయ్యారు. ప్రభుత్వం వీరిని కఠినంగా శిక్షిస్తుంది. మళ్లీ మరో మహిళకు ఇలా జరగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయం. – ఎస్ఎం పవిత్ర, చైర్పర్సన్, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ -
బిడ్డ మరణం తట్టుకోలేక ఆగిన తల్లి గుండె
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): కళ్ల ముందే కన్న కూతురు మరణించడంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఆగిపోయింది. అప్పటి వరకు తనతో కలిసి ఉన్న కుమార్తె, భార్య నిముషాల వ్యవధిలో ప్రాణాలు విడవడంతో వారి మృతదేహాల వద్ద కన్నీటిపర్యంతమైన భర్తను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఈ హృదయ విదారక ఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం ద్వారకానగర్‌కు చెందిన నిమ్మకాయల శ్రీనివాసరావు మూడేళ్ల కిందట దేవరాపల్లికి బతుకు తెరువు కోసం వచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సమీపంలోని అపార్టుమెంట్లో భార్య ఉషారాణి (51), మానసిక దివ్యాంగురాలైన కుమార్తె సాయి మేఘన (18)తో నివాసం ఉంటున్నారు. సాయి మేఘన తరచూ ఫిట్స్‌తో బాధపడుతుండేది. ఎప్పటి మాదిరిగానే మంగళవారం ఉదయం సాయి మేఘనకు ఫిట్స్ రావడంతో ఇంటిలో పడిపోయింది. తల్లిదండ్రులు ఆమెను ఎంత లేపినా లేవకపోవడంతో అనుమానం వచ్చి అదే అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న వైద్యుడిని పిలిచారు. ఆయన వచ్చిచూసి సాయి మేఘన మృతి చెందినట్లు చెప్పారు. అప్పటి వరకు బాగానే ఉన్న తన కుమార్తె చనిపోయిందన్న విషయం తెలిసి ఆ మాతృమూర్తి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కూతురు మరణవార్తను బంధువులకు ఫోన్లో చెబుతూనే ఉషారాణి గుండెపోటుకు గురై పక్కనే ఉన్న సోఫాలో కుప్పకూలిపోయింది. ఈ హటాత్ఫరిణామాన్ని చూసిన వారంతా ఆమె స్పృహ తప్పి పడిపోయిందని భావించి ముఖంపై నీళ్లు చల్లి పైకి లేపేందుకు ప్రయత్నించారు. ఆమె ఎంతకీ లేవకపోవడంతో అనుమానం వచ్చి మరలా వైద్యుడ్ని పిలిచారు. ఆయన వచ్చి చూసి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్య, కుమార్తె తనను ఒంటరి చేసి వెళ్లిపోయారని, తాను ఎవరి కోసం బతకాలని నిమ్మకాయల శ్రీనివాసరావు వారి మృతదేహాల వద్ద గుండెలవిసేలా రోదించిన తీరు పలువురి హృదయాలను కలిచివేసింది. నిముషాల వ్యవధిలోనే తల్లీ కుమార్తె మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం సాయ ంత్రం తల్లీ కూతుళ్లకు అంత్యక్రియలు నిర్వహించారు. -
చనిపోయినా 'చిత్రవధ'..
మధ్య తరగతి కుటుంబం.. ఎంతో విలువలతో కూడిన జీవితం. అత్తమామల మెప్పు పొందింది. పిల్లల అభిమానాన్ని... భర్త అనురాగాన్ని చూరగొంది. ప్రభుత్వం చేసిన సాయానికి పొంగిపోయింది. ఓ సాధారణ మహిళగా తన ఆనందాన్ని అందరితోనూ పంచుకుంది. అదే ఆమె పాలిట శాపమైంది. పచ్చ రాబందుల దుష్ట పన్నాగానికి బలైపోయింది. సోషల్ మీడియా వేదికగా చేసిన నీచాతినీచమైన వ్యాఖ్యలకు తల్లడిల్లిపోయింది. ఆమె ఆనందం ఎంతోసేపు నిలవనివ్వని సోషల్ మాఫియా వేధింపులకు మానసికంగా కలత చెందింది. నలుగురికి తన బాధను చెప్పుకోలేక రైలుకింద పడి ప్రాణం తీసుకుంది. ఇదీ తెనాలికి చెందిన బీసీ(విశ్వబ్రాహ్మణ) మహిళ గొల్తి గీతాంజలిది. ఇప్పుడు ఆమె చావుపైనా ఆ ‘పచ్చ’మూక తప్పుడు ప్రచారానికి పాల్పడుతోంది. ఆ సంఘటనకు తమకేమాత్రం బాధ్యతలేదని తప్పించుకోజూస్తోంది. కానీ పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి వాస్తవాలు వెలికి తీస్తోంది. ఆ నీచుల భరతం పట్టేందుకు సమాయత్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు తెనాలికి చెందిన గొల్తి గీతాంజలి కుటుంబానికి చాలావరకూ వర్తించాయి. ఇటీవలే తనకు ఇంటి స్థలం ఇచ్చారని.. తనకు ఎంతో సంతోషంగా ఉందని, అమ్మఒడి, పింఛన్, వైఎస్సార్ చేయూత వంటి మరెన్నో పథకాలు వచ్చాయని ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాతో ఎంతో అమాయకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పింది. సహజంగానే పచ్చనేతలకు ఆమె చెప్పిన విషయాలు రుచించలేదు. ఆమెపై టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సోషల్ మీడియా ప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయటం ప్రారంభించారు. ఆ ట్రోలింగ్లు చూసి గీతాంజలి తట్టుకోలేకపోయింది. ఆమె భర్తను దుర్భాషలాడుతూ, అమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పెట్టిన పోస్టింగులు చూసి విలవిలలాడి పోయింది. అవమానంతో కుంగిపోయింది. కనీసం ఇంట్లో వారితో కూడా తన బాధను పంచుకోలేక రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది కచ్చితంగా ఆత్మహత్యకాదు... సోషల్ మీడియా చేసిన హత్యేనని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని గీతాంజలి భర్త బాలచంద్ర తెలిపారు. అన్యాయంగా తన భార్యను బలి తీసుకున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. రెచ్చిపోతున్న పచ్చ సోషల్ మూక సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకరమైన పోస్టింగ్‌లపై కేవలం సెక్షన్ 41 నోటీసులు ఇచ్చి వదిలిపెట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఐటీడీపీ, జనసేన సోషల్‌మీడియా రెచ్చిపోతోంది. వారి దాష్టీకంవల్లే ఆ నిండుప్రాణం బలైపోయింది. ఈ దుర్ఘటన యావత్ రాష్ట్రాన్ని కదిలించింది. పచ్చబ్యాచ్ దుర్మార్గాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. ఆమె కుటుంబానికి పలువురు అండగా నిలిచారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టబోమని ప్రకటించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మంగళవారం డీజీపీ రవీంద్రనాథ్‌రెడ్డిని కలిసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గీతాంజలి కుటుంబ సభ్యులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ, ఎమ్మెల్సీ పోతుల సునీత, పార్టీ నేతలు వరుదు కళ్యాణి, వాసిరెడ్డి పద్మ, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మహిళా కమిషన్ సభ్యురాలు వెంకటలక్ష్మి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది సోషల్‌మీడియా టెర్రరిజమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ ముమ్మరం గీతాంజలి ఆత్మహత్యకు పురిగొల్పినవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సోషల్‌మీడియాలో ఆమెపై అసభ్యంగా ట్రోలింగ్ చేసిన 26 మందిని గుర్తించారు. ప్రైవేటు వ్యక్తులే కాకుండా పార్టీల అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి కూడా ఘోరంగా ట్రోల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కనీసం విచారం వ్యక్తం చేయని తెలుగుదేశం నేతలు... మరింత బరితెగించి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది ఏడోతేదీ కాగా, ట్రోలింగ్ ఎనిమిది నుంచి మొదలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆమె వీడియో వైరల్ అయిన ఆరో తేదీనే అజయ్‌చౌదరి సజ్జా, స్వాతీరెడ్డి మరికొందరు నీచాతినీచంగా ట్రోల్ చేశారు. ఒక్కరోజులోనే వందల సంఖ్యలో ట్రోల్స్ వచ్చాయి. ఆమె చనిపోయిందని తెలిసిన వెంటనే ఆ పోస్టులన్నీ డిలీట్ చేశారు. అయితే అప్పటికే పోలీసులు ఈ పోస్టులను సేకరించారు. రూ.20 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ గీతాంజలి ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలి పెట్టదని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు నేతలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ వేర్వేరు ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడారు. సెన్సేషనల్ అంటూ ఫేక్ వీడియో టీడీపీ, జనసైనికుల సోషల్‌మీడియా ట్రోలింగ్‌లకు బలైన గీతాంజలి విషయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి తప్పుడు ప్రచారానికి సిద్ధం అయ్యింది. సెన్సేషనల్ అంటూ ఒక వీడియోను విడుదల చేసింది. అందులో గీతాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సమయంలో లోకో పైలెట్ ఆమెను రైలులోనే రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చిన దృశ్యాన్ని చూపిస్తూ ఆమెను ఎవరో ఇద్దరు తోసేశారంటగా మావా.. అంటూ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు వాయిస్ ఓవర్‌తో ఒక వీడియో విడుదల చేశారు. ఇంటి పట్టా వచ్చినందుకు ఆనందంగా మీడియాతో మాట్లాడినందుకే ట్రోల్ చేసిన తెలుగుదేశం సోషల్‌మీడియా ఇప్పుడు ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుండటంతో దాని నుంచి బయటపడేందుకు గీతాంజలి క్యారెక్టర్‌ను తప్పుగా చూపించేలా ప్రచారం మొదలుపెట్టింది. ఆమె ఎవరో ఇద్దరితో రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు, వారు ఆమెను రైలు కిందకి తోసేసి పారిపోయారన్నట్లుగా వాయిస్ ఓవర్‌తో ప్రచారం చేస్తోంది. ఆ వీడియో గమనించిన ఎవరికైనా అది ఎడిటింగ్ వీడియో అని స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ వ్యవహారం తమ దృష్టికి కూడా వచ్చిందని, ఈ వీడియోపై కూడా విచారణ జరుపుతామని పోలీసులు స్పష్టం చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు గీతాంజలిని ట్రోల్ చేసి ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే బాధ్యులను గుర్తించాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఓవర్‌యాక్షన్ చేసి కొంత మందిని ఇబ్బంది పెట్టిన వారిపై 6,970 సోషల్‌మీడియా బుల్లీయింగ్ షీట్లు నమోదు చేశాం. సుమారు 7వేల మందిని అరెస్ట్ చేశాం. సైబర్ క్రైమ్‌కు సంబంధించి 2023 సంవత్సరంలో ఆయా అకౌంట్‌దారులపై 327 కేసులు నమోదు చేశాం. హైకోర్టు జడ్జిని దూషించిన కేసులో 53 మందిపై కేసులు నమోదు చేశాం. దిశ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా సైబర్, సోషల్ మీడియా అంశాలకు సంబంధించి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసేలా పొందుపరిచి బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. – పాలరాజ్, ఐజీ, గుంటూరు రేంజ్ -
AP Police: ‘దిగులొద్దు.. భయపడొద్దు.. భరతం పడతాం’
టీడీపీ, జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాల వేధింపులు కొన్నాళ్లుగా వెర్రి తలలు వేస్తున్నాయి. సొంత వ్యక్తిత్వం, తమవైన అభిప్రాయాలు కలిగి ఉండటం మహానేరం అన్నట్లు కిరాయి మూకలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో.. పచ్చ మూకల కిరాతకానికి తెనాలి మహిళ గీతాంజలి దారుణంగా బలైపోయింది. అయితే ‘సోషల్ మాఫియా’ దాడులపై బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని.. తాము అండగా నిలబడతామని ఏపీ పోలీసులు భరోసా ఇస్తున్నారు. టీడీపీ-జనసేన సోషల్ మీడియా బ్యాచ్ గత కొంతకాలంగా మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా అసభ్యకర పదజాలంతో దూషిస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. బెండపూడి స్టూడెంట్ మేఘన, కుమారీ ఆంటీ.. వీళ్లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టలు చేశాయి. తాజాగా తెనాలి గృహిణి గీతాంజలి లక్ష్యంగా చేసుకుని తప్పుడు కామెంట్లు చేశాయి. దీంతో ఆమె ప్రాణం తీసుకుంది. అయితే.. ఆన్లైన్లో ఇలాంటి వేధింపులను ఉపేక్షించొద్దని ఏపీ పోలీసులు అంటున్నారు. వీటికి జంకితే మరింత దారుణంగా తెగబడటం ఖాయమని చెబుతున్నారు. బాధితులకు తక్షణమే రక్షణ కల్పించడం, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చేసిన చట్టాల్ని ప్రస్తావిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే చాలు వెంటనే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని.. బాధితులు నేరుగానే కాకుండా తమ సన్నిహితులు, స్నేహితుల ద్వారా కూడా బాధితులు ఫిర్యాదు చేసే వీలుందని చెబుతున్నారు. ఫిర్యాదు చేయడం ఇలా... ► ట్రోలింగ్‌కు గురయ్యేవారు, బాధితులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. గ్రామ, వార్డు సచివాలయంలోని మహిళా పోలీసు ద్వారా కూడా పోలీసులను ఆశ్రయించవచ్చు. ► సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేధింపులపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాల్సిన వేదికలు.. సైబర్ క్రైమ్ పోర్టల్: https://cybercrime.gov.in/ సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్: 9121211100 సైబర్ బుల్లీయింగ్ 4ఎస్4యు: 9071666667 గీతాంజలి కేసులో నిందితుల గుర్తింపు వైఎస్సార్సీపీ సంక్షేమంతో తనకు చేకూరిన లబ్ధి గురించి సంతోషంగా చెప్పి.. ఆనక టీడీపీ-జనసేనల చేతిలో దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది గీతాంజలి. అతి జుగుప్సాకరమైన పోస్టులు చేశారు ఆమె మీద. అయితే సున్నిత మనస్కురాలైన గీతాంజలి.. ఆ పోస్టులను భరించలేకపోయింది. తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ సోమవారం వేకువఝామున కన్నుమూసింది. ఏపీలో సంచలనంగా మారిన ఈ ఆన్లైన్ వేధింపుల కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. భర్త ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐటీడీపీ, పలువురు జనసేన నేతల అకౌంట్లను పరిశీలించారు. ఇప్పటికే నిందితుల్ని గుర్తించామని.. పోస్టులు చేసిన కొందరు పరారీలో ఉన్నారని.. వాళ్లందరినీ పట్టుకుని తీరతామని పోలీసులు చెబుతున్నారు. -
మోజు తీర్చుకుని మొహం చాటేసిన టీడీపీ నేత..
తాడిపత్రి/రూరల్: యువతిని ప్రేమ పేరుతో లోబరుచుకుని మోజు తీర్చుకున్నాక మొహం చాటేశాడో టీడీపీ కౌన్సిలర్. పెళ్లి చేసుకోమని నిలదీస్తే బాధితురాలిపైనే దాడి చేశాడు. దీంతో ఆమె సోమవారం అనంతపురం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఎస్పీ సూచన మేరకు తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. తాడిపత్రి 30వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు. పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ కొన్ని నెలల క్రితం వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. యువతిని ఆమె ఇంటి నుంచి తీసుకొచ్చి తనకు తెలిసిన వారి ఇంట్లో ఉంచాడు. అనంతరం ఆమెతో సహజీవనం చేశాడు. యువతి రెండు సార్లు గర్భం దాల్చగా, ఇప్పుడే పిల్లలు ఎందుకు అంటూ అబార్షన్లు కూడా చేయించాడు. ఇటీవల యువతికి అనుమానమొచ్చి మల్లికార్జున సెల్‌ఫోన్ పరిశీలించగా, వాట్సాప్‌లో మరో మహిళతో చాటింగ్ చేసిన విషయం బయటపడింది. దీనిపై మల్లికార్జున ప్రశ్నిస్తే కొట్టి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే మల్లికార్జునతో సంబంధం పెట్టుకున్న మహిళ కూడా రంగంలోకి దిగింది. తను మల్లికార్జునతో తీయించుకున్న ఫొటోలను బాధిత యువతి సెల్‌ఫోన్‌కు పంపింది. వారం క్రితం మళ్లీ యువతి ఇంటికి వచ్చిన మల్లికార్జున మాయమాటలు చెప్పి రెండు రోజులు గడిపాడు. వివాహం చేసుకోమని ప్రశ్నిస్తే తీవ్రంగా కొట్టాడు. విషయం బయటకు చెబితే భూమిపైనే లేకుండా చేస్తానంటూ బెదిరించాడు. తాను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తనతోనే జీవితం అంటూ చెప్పాడు. దీంతో ఆమె మల్లికార్జున ఇంటికి వెళ్లింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఆయన కుటుంబసభ్యులకు వివరించింది. సర్దిచెప్పాల్సిన వారు కూడా దౌర్జన్యం చేశారు. యువతిని కొట్టి పంపించారు. దీంతో యువతి కుమిలికుమిలి ఏడ్చింది. తెలిసిన వారి సూచన మేరకు సోమవారం అనంతపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గోడు వెళ్లబోసుకుంది. ఆయన సూచన మేరకు తాడిపత్రి పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో తనలాంటి వారి జీవితాలతో ఆటలాడుతున్న మల్లికార్జునపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది. -
పెళ్లి పేరుతో సీరియల్ నటి మోసం
సీతంపేట : అత్తారింటికి దారేది, పలుకే బంగారమాయే సీరియల్ ఫేం అడ్డాల ఐశ్వర్య పెళ్లి పేరుతో తనను మోసం చేసిందని ఆమె భర్త శ్యామ్‌కుమార్ ఆరోపించాడు. పెళ్లికి ముందే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుందన్నారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో సోమవారం శ్యామ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ మ్యాట్రిమోనియల్ ద్వారా పెద్దలు సంబంధం కుదర్చడంతో 2023 సెప్టెంబర్ 6న విశాఖలో ఐశ్వర్యతో తనకు పెళ్లి జరిగిందని తెలిపారు. అక్టోబర్ 7న హైదరాబాద్‌లో ఐశ్వర్య ఇంటికి వెళ్లామని, అయితే ఆ ఇంట్లో ఆమె స్నేహితుడు డ్రింక్ చేస్తూ కనిపించాడన్నారు. దీంతో తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పాడు. మరుసటి రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారి కరణం రమేతో ఐశ్వర్య ఉండటం చూశానని, నిజం ఎక్కడ బయట పడిపోతుందోనని ఐశ్వర్య తల్లిదండ్రులు తనను బలవంతంగా విశాఖ పంపేశారని వెల్లడించాడు. ఆ తర్వాత కరణం రమేష్ తనకు ఫోన్ చేసి ఐశ్వర్యకు విడాకులు ఇవ్వాలని, లేదంటే గొడవలు జరుగుతాయని హెచ్చరించాడన్నారు. విషయాన్ని ఐశ్వర్య తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళితే.. కట్నం కోసం తన కుటుంబం వేధిస్తున్నట్టు పెందుర్తి పోలీసుస్టేషన్లో తప్పుడు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, తిరిగి తన కుటుంబంపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని శ్యామ్‌కుమార్ కోరాడు. తనను పెళ్లి చేసుకుని మోసం చేసి, తన కుటుంబాన్ని రోడ్డుపైకి లాగారని ఆరోపించాడు. పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి ఖర్చులకు తామే డబ్బులు ఇచ్చామని తెలిపాడు. మీడియా సమావేశంలో శ్యామ్‌కుమార్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తెనాలి, అమరావతి: ఆమె చేసిన తప్పల్లా... తన సంతోషాన్ని దాచుకోలేకపోవటమే. జగనన్న తన పేరిటే ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి కూడా వస్తోందని పట్టలేని సంతోషంతో చెప్పిందామె. కళ్లలో మెరుపులతో, పట్టలేని ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సోషల్ మీడియా మూకలు దీన్ని జీర్ణించుకోలేకపోయాయి. వీధికుక్కల్లా వెంటాడాయి. మారుపేర్లతో సంచరించే నీతీజాతీ లేని ఈ ఆన్లైన్ మారీచులు.... తాము మనుషులమన్న సంగతే మరిచిపోయి ప్రతి వేదికమీదా ఆమెను నానా దుర్భాషలాడారు. అక్కచెల్లెళ్లుంటారని, తమ ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారని గ్రహింపే లేని రీతిలో ఆ బీసీ మహిళ గీతాంజలిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆమె వేషభాషలను ఎగతాళి చేస్తూ, అసభ్యంగా దూషించారు. సమాజం సిగ్గుపడే కామెంట్లతో రంపపు కోత కోశారు. భరించలేని ఆ ఆడబిడ్డ మరణమే శరణ్యమనుకుంది. రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. లోతుగా చూస్తే ఇది ఆత్మహత్య కాదు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకలు వెంటాడి వెంటాడి చేసిన దారుణమైన హత్య. గొల్తి గీతాంజలి (30) భర్త చంద్రశేఖర్ తెనాలిలోని వహాబ్ పార్క్ ప్రాంతంలో బంగారం పని చేస్తుంటారు. వాళ్లకిద్దరు పిల్లలు. గీతాంజలి కొద్దిరోజుల కిందట ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. తనకు ఇంటిపట్టా ఇచ్చారని, పిల్లలకు అమ్మ ఒడి వస్తోందని, అత్తమామలకు చేయూత, పింఛన్ కానుక అందుతున్నాయని చెబుతూ సీఎం వైఎస్ జగన్‌కు, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు ధన్యవాదాలు తెలియజేసింది. జగనన్నకు తప్ప ఇంకెవరికి ఓటు వేస్తామంటూ.. ఆమె ఎదురు ప్రశి్నంచిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే ఆమెకు శాపమైంది. ఐటీడీపీ, జనసేన కిరాయి మూకలు సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా వేధించాయి. ఆమెను కించపరుస్తూ విపరీతంగా ట్రోల్స్ చేశాయి. వాస్తవానికి గీతాంజలికి గతంలోనే ఇంటి స్థలం మంజూరైంది. ఇటీవల ప్రభుత్వం ఆమెకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందచేసింది. ఈ నెల 4న కొత్తపేటలోని తాలూకా కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరైనప్పుడు ఈ ఇంటర్వ్యూ వ్యవహారం చోటుచేసుకుంది. ఉదయమే సభా ప్రాంగణానికి వచ్చిన గీతాంజలి అందరితోపాటు ఎమ్మెల్యే శివకుమార్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఎంతో ఉత్సాహంగా కనిపించింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పట్టాను అందుకున్నాక తన సంతోషాన్ని ఓ యూట్యూబ్ చానల్‌తో పంచుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న తమకు ఇంటి స్థలం పొందడం ద్వారా కల నెరవేరిందంటూ ఉద్వేగంగా మాట్లాడింది. జగనన్నను గెలిపించుకోవటం తమ బాధ్యతని పేర్కొంది. ఫీజులు కట్టలేని తమకు అమ్మఒడి ఆసరాగా నిలిచిందని, తన పిల్లలిద్దరూ ఈ కార్యక్రమానికి వస్తే జై జగన్.. అని నినదించేవారని ఉత్సాహంగా చెప్పింది. ఈ క్రమంలో కొంత భావోద్వేగానికి గురి కావడం, మీడియా ఎదుట మాట్లాడే అలవాటు లేకపోవడంతో తడబాటుకు గురైంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న టీడీపీ, జనసేన ‘సోషల్ మాఫియా’ బాధితురాలిని దారుణంగా ట్రోల్ చేసింది. ఉచ్చం నీచం లేకుండా అసభ్యంగా దూషిస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని తప్పు పడుతూ, రాయలేని భాషలో దుర్భాషలాడుతూ కొందరు కామెంట్లు పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన గీతాంజలి శనివారం తెనాలి రైల్వే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు హుటాహుటిన ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తెనాలి జీఆర్పీ పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుని కుటుంబ సభ్యులను విచారించగా సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాల కారణంగా ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల తాను, తన కుటుంబం లబ్ధి పొందినట్లు గతంలో కూడా ఆమె కొన్ని వీడియోల్లో పేర్కొన్నారు. గీతాంజలిని ఆత్మహత్యకు పురిగొల్పేలా దారుణ వ్యాఖ్యలతో వికృతంగా వ్యవహరించిన సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. గీతాంజలిని బూతులు తిడుతూ టీడీపీ, జనసేన అభిమానులు పెట్టిన పోస్టులు, కామెంట్లు.. గీతాంజలి మృతదేహం వద్ద రోదిస్తున్న ఇద్దరు కుమార్తెలు పచ్చ మీడియాపై బాధిత కుటుంబం ఆగ్రహం ఇద్దరు చిన్నారులతో ఎంతో చలాకీగా అందరితో కలిసి మెలసి ఉండే గీతాంజలిని సోషల్ మాఫియా పొట్టన పెట్టుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్ మార్చురీ వద్ద కన్నీరు మున్నీరయ్యారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు ఆడపిల్లల గతి ఏం కావాలంటూ విలపించారు. సోషల్ మీడియా ఆమెను పొట్టనపెట్టుకుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చ సోషల్ మీడియా కళ్లు ఎప్పుడు పచ్చగానే ఉంటాయని, పేదింటి మహిళకు ఇంత సంతోషం దక్కడం వారికి ఇష్టం లేదంటూ మండిపడ్డారు. గీతాంజలికి తల్లితండ్రి దూరంగా ఉండటంతో అమ్మమ్మ, తాతయ్య, మేనమామ కలిసి వివాహం చేశారని, గీతాంజలి సంతోషం పచ్చ సోషల్ మీడియాకు కంటగింపుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చూసి తల్లడిల్లిన చిన్నారులు ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి అంతిమ సంస్కారాలు సోమవారం రాత్రి జరిగాయి. గుంటూరు జీజీహెచ్‌లో శవపరీక్ష అనంతరం చినరావూరుతోటలోని హిందూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను భర్త బాలచంద్ర నిర్వహించారు. తల్లి భౌతికకాయాన్ని చూసి చిన్నపిల్లలైన కుమార్తెలు రిషిత, రిషిక హృదయ విదారకంగా విలపించడం అందరినీ కలచివేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అక్కడకు చేరుకుని గీతాంజలి భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం ఆదేశానుసారం మంగళవారం వారి ఇంటికి వచ్చి బిడ్డల భవిష్యత్ కోసం ఏం చేయాలనే అంశంపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన అరాచకత్వానికి బీసీ మహిళ బలి: పద్మ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన బీసీ మహిళ గీతాంజలి సంతోషాన్ని చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన పార్టీలు ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నాయని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విచక్షణ మరచిన పచ్చ మూకలు అరాచకంగా ట్రోల్ చేయడంతో తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఆప్యాయంగా పలకరించేది.. మా ఇంటికి ఎదురుగా నివసించే గీతాంజలి ఎప్పుడూ సంతోషంగా, చలాకీగా ఉంటుంది. ఎక్కడ కనిపించినా మామ్మగారూ... అంటూ చాలా ఆప్యాయంగా పలకరించేది. రెండు రోజులుగా కనిపించకపోతే శివరాత్రి కావడంతో ఎటైనా వెళ్లిందేమో అనుకున్నా. ఇలా జరుగుతుందని అనుకోలేదు. చాలా బాధనిపిస్తోంది. – అవ్వారు పద్మావతి, ఇస్లాంపేట, తెనాలి జీవితంలో మర్చిపోలేనంటూ.. మేం ఇస్లాంపేటలో సోడాలు విక్రయిస్తాం. గీతాంజలితో కొద్ది రోజుల పరిచయమే అయినా చాలా కలివిడిగా మాట్లాడేది. ఇటీవలే చిన్నపిల్లల్లా ఆడుకున్నాం. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రం తీసుకున్నానని ఎంతో సంతోషంగా చెప్పింది. నా పేరు మీద ఇచ్చారు... జీవితంలో మర్చిపోలేనని చెప్పి మురిసిపోయింది. ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తోందని చెబుతుండేది. ఆమె చనిపోయిందని తెలిసి ఎంతో బాధపడుతున్నా. – షేక్ రేష్మా, ఇస్లాంపేట, తెనాలి -
జనసేన మహిళా నేతపై దాడి
ఒంగోలు టౌన్ : జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మీద అదే పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు రియాజ్ వర్గం దాడికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం దాసరివారిపాలెం కనపర్తిల వద్ద జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. బాధితురాలు అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన రాయపాటి అరుణ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం నాగులుప్పలపాడు మండలంలోని ఎన్జీపాడు, వినోదరాయునిపాలెం, అమ్మనబ్రోలు, దాసరిపాలెం, కనపర్తి గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో దాసరివారిపాలెం గ్రామ శివారు వద్దకు రాగానే జనసేన జిల్లా అధ్యక్షుడైన షేక్ రియాజ్ అనుచరులు ఒంగోలుకు చెందిన చెనపతి రాంబాబు, ఆరిగ శివ, షాలు, చిట్టెం ప్రసాద్, పల్లి రాజేష్, ముత్యాల కళ్యాణ్ రియాజ్ ప్రోత్సాహంతో కారును అడ్డగించారు. కారులో ఉన్న అరుణ అనుచరుడైన చరణ్‌ను బయటకు లాగి కొట్టారు. ఈ దాడి నుంచి చరణ్ తప్పించుకుని తిరిగి కారులో బయలు దేరినా విడిచిపెట్టకుండా రియాజ్ అనుచరులు కారును వెంబడించారు. కనపర్తి గ్రామం వద్ద అటకాయించారు. మహిళ అని కూడా చూడకుండా ఛాతిపై చెయ్యివేసి గుండెల మీద బలంగా పిడి గుద్దులు గుద్దారు. అదే కారులో ఉన్న ఉప్పుగుండూరుకు చెందిన జనసేన నాయకుడు బాలిశెట్టి నాగేశ్వరరావు అడ్డుపడగా చిట్టెం ప్రసాద్ ఆయనపై కర్రలతో దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో అతడి తల పగిలి రక్త స్రావం కావడంతో స్థానికుల సాయంతో బయట పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న అరుణ నేరుగా ఒంగోలు జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడి విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినా పొత్తులతో బిజీగా ఉన్నామని, ఎన్నికలయ్యాక చూద్దాంలే అని తేలిగ్గా తీసుకున్నట్టు సమాచారం. -
సోషల్ మాఫియా c/o టీడీపీ - జనసేన
మేలు చేసిన సీఎం, ఎమ్మెల్యేలను మెచ్ఛుకోవడమే ఆమె చేసిన పాపం. చాన్నాళ్ళ కు ఓ గూడు దొరికిందన్న సంతోషాన్ని మిగల్చకుండా సోషల్ మీడియా ముసుగులో టీడీపీ- జనసేన రాబందులు వాలిపోయాయి. ట్రోల్స్ తో పీక్కు తిన్నాయి. అవమానాలు తట్టుకోలేక ఆ మహిళ ఆఖరుకు ఉసురు తీసుకోవడమే మేలు అనుకుంది. రైలు చక్రాల కింద నలిగి పోయింది. సాక్షి, గుంటూరు: టీడీపీ, జనసేన వేధింపులు ఓ మహిళ ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జగనన్న కాలనీలో ఇంటి స్థలం గురించి మాట్లాడిన మహిళను మానసికంగా హింసించి ఆమె చావుకు యమపాశంగా మారాయి. ఇళ్ల పట్టా వచ్చిందన్న ఆనందంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లను మెచ్చుకుంటూ ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడటమే ఆ మహిళ పాలిట శాపమైంది. జగనన్న ఇల్లు ఇచ్చాడని సంతోషంగా చెప్పిన తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ టీడీపీ, జనసేన మితిమీరిన ట్రోలింగ్ కారణంగా అవమాన భారం తట్టుకోలేక రైలు కింపడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గుల్టి గీతాంజలి దేవి(29) గృహిణి, ఆమె భర్త బాలచంద్ర బంగారం పని చేస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రిషిత నాలుగో తరగతి, చిన్న కుమార్తె రిషిక ఒకటో తరగతి చదువుతున్నారు. తెనాలిలోని ఇస్లాంపేటలో నివసిస్తున్నారు. పెద్ద కుమార్తెకు నాలుగు సార్లు ‘అమ్మ ఒడి’ వచ్చింది. ఈమెకు ఇటీవల జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది. ఈనెల 4వ తేదీన కొత్తపేటలోని తాలూకా కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన శాశ్వత రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాను అందుకుంది. ఆ తర్వాత తన సంతోషాన్ని ఓ యూట్యూబ్ ఛానల్‌తో పంచుకుంది. తాను తన కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నానని, స్వంత ఇళ్లు అనేది అందరి కల అని, ఇళ్ల స్థలం పొందడం ద్వారా తన కల నెరవేరిందంటూ ఎంతో ఉద్వేగంగా మాట్లాడింది. తన పిల్లలకు అమ్మ ఒడి కూడా వస్తోందని, ఇన్ని మంచి పనులు చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను మళ్లీ గెలిపించుకోవడం తమ బాధ్యత అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాటలను కొందరు టీడీపీ, జనసేన కార్యకర్తలు వివరీతంగా ట్రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టారు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన గీతాంజలి రెండు రోజుల క్రితం తెనాలి రైల్వేస్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తీవ్రంగా గాయపడటంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం తుదిశ్వాస విడిచింది. అయితే ఒక బీసీ మహిళ.. కేవలం ఇళ్ల పట్టా వచ్చిందన్న తన ఆనందాన్ని పంచుకోవడమే ఆమె చేసిన తప్పా అంటూ పలువురు ప్రశ్నిస్తుండగా టిడిపి సోషల్ మీడియానే దారుణమైన ట్రోల్స్ చేసి ఆమెను బలితీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మాఫీయా కేరాఫ్ ‘టీడీపీ - జనసేన’ ‘వాలంటీర్లు మాకు బీడీ కట్ట తెచ్చి పెడతారా, ఓయి వాలంటీర్ నాకు కండోమ్ తెచ్చిపెడతావా అంటూ తెలుగుదేశం సోషల్ మీడియా చేసిన విషప్రచారంతో చేస్తున్న సేవలో కూడా హేళన ఎదుర్కొని మనస్తాపంతో మొన్న వాలంటీర్ నవీన చనిపోతే.. నిన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమెరికన్ ఇంగ్లీష్ స్లాంగ్ నేర్చుకున్న నిరుపేద మేఘన అనే బాలిక తెలుగుదేశం, జనసేన చేసిన ట్రోల్స్‌తో మానసిక వేదనకు గురైంది. నేడు ప్రభుత్వం నుంచి లబ్ది పొందాను అంటూ ధైర్యంగా చెప్పిన పాపానికి తెలుగుదేశం, జనసేన ట్రోల్ పేజీల మాఫీయా వేదింపులకి గీతాంజలి ప్రాణాలు తీసుకుంది. తమ రాజకీయ స్వలాభం కోసం, అసత్యాలను ప్రచారం చేస్తూ, అది తప్పు అని చెప్పిన సామాన్యులపై దుషణలకు దిగే సోషల్ మాఫీయాలను కోట్లు వెచ్చింది పెంచి పోషిస్తున్న తెలుగుదేశం జనసేన మాఫీయాని ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది.’ అంటూ నిప్పులు చెరుగుతున్నారు. -
అనంతపురం: మాజీ ప్రిన్సిపాల్ దారుణహత్య.. అంతలోనే మరో విషాదం
అనంతపురం: వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేసిన ఘటన అనంతపురం పట్టణాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మేనల్లుడి చేతిలో హతమైన మూర్తిరావు (58) గురించి తెలిసేలోపే భర్త వియోగాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మరణించడంతో స్థానిక జేఎన్టీయూ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఈయనకు ఓ కుమారుడు, కుమార్తె. కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు. భార్య కళ్లెదుటే దారుణం.. మూర్తిరావుకు షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు సొంతిల్లు ఉంది. వీటిని అద్దెకు ఇచ్చేసి ఆయన నగరంలోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబసభ్యులతో ఉంటున్నారు. ఇంట్లో అద్దెకున్న మణికంఠ అనే వ్యక్తి ఆదివారం ఇల్లు ఖాళీ చేసి మూర్తిరావుకు ఫోన్ చేశారు. ఖాళీ చేసిన ఇంటిని చూసుకుని తాళాలు తీసుకు వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో తన భార్య శోభతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు. అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా... నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు. హతుడి పక్కనే కూర్చొని.. మూర్తిరావును హతమార్చిన అనంతరం ఆదిత్య ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్కు వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, మృతదేహం పక్కనే కూర్చుండి పోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్‌లర్‌లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌లైన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. వివాదరహితుడు మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్టీయూఏలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి పీహెచ్డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్‌లో బ్యాంక్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. -
కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని...కోపంతో తండ్రి...
కన్నకూతురు తమకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో వధువు కుటుంబసభ్యులు వరుడి ఇంటిపై కత్తులు,కర్రలతో దాడి చేసి కూతురిని లాక్కెళ్లిన ఘటన ఏలూరు జిల్లా: ఈ ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారామపురం అనే గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆగిరిపల్లి మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన కందుల వంశీ, అదే గ్రామానికి చెందిన అత్తి శ్రావణి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా వారి పెళ్లికి శ్రావణి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో... వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రావణి తల్లిదండ్రులు ఆగ్రహంతో వంశీ ఇంటిపై కత్తులు,కర్రలతో దాడి చేసి శ్రావణిని ఎత్తుకెళ్లారు. -
టీడీపీ, జనసేన రౌడీమూకల విధ్వంసకాండ
చెరుకుపల్లి: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పుట్టావారిపాలెంలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన రౌడీలు విధ్వంసం సృష్టించారు. మద్యం తాగి గొడ్డళ్లు, ఇనుపరాడ్లు చేతపట్టుకుని అర్ధరాత్రి వేళ వైఎస్సార్సీపీకి చెందినవారి బైక్‌లను ధ్వంసం చేశారు. పుట్టావారిపాలెంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలు వైఎస్సార్సీపీకి మద్దతు పలుకుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కొందరు రౌడీలు మద్యం తాగి శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గొడ్డళ్లు, ఇనుప రాడ్లు పట్టుకుని వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపుతున్నవారి ఇళ్ల వద్దకు వెళ్లి హల్చల్ చేశారు. ఇళ్ల ముందు నిలిపిన 20 బైకులను ధ్వంసం చేశారు. గ్రామస్తులు కేకలు వేయడంతో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన రౌడీలు తమ బైక్‌లను వదిలి పారిపోయారు. గ్రామస్తులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి 11 బైక్‌లు, ఇనుపరాడ్డును స్వా«దీనం చేసుకున్నారు. వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ దురాగతానికి పాల్పడిన రౌడీమూకలను కఠినంగా శిక్షించాలని ఎంపీపీ మత్తి దివాకర రత్నప్రసాద్, వైఎస్సార్సీపీ మండల కన్వినర్ పైనం ఏడుకొండలరెడ్డి, స్థానిక సర్పంచ్ మొగలిపువ్వు కోటేశ్వరరావు పోలీసులను కోరారు. -
విశాఖలో నకిలీ ఎస్ఐల ఘరానా మోసం
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): పోలీసు ఎస్సైల వేషమేసి, పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖలో నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు, ఘరానా మోసగాడైన హనుమంతు రమేష్, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ మరికొంత మందితో కలిసి నిరుద్యోగుల నుంచి దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. బాధితుల కథనం ప్రకారం.. మోసాలతోనే బతికే హనుమంతు రమేష్ (47) అడవివరంలోని ఆర్ఆర్ టవర్స్‌లో ఉంటున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు (అక్కచెల్లెళ్లు) ఉండగా ఇటీవల మరో ప్రియరాలితో ఉంటున్నాడు. గత కొంతకాలంగా ప్రియురాలు, మరికొందరితో కలిసి రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులకు ఆశ చూపించారు. వీరికి పలువురు మధ్యవర్తులు సహకరించారు. హనుమంతు, ప్రియురాలు, మిగతా వారు పోలీసు ఎస్సైల గెటప్‌లో రావడంతో వారంతా నమ్మేశారు. దాదాపు 30 మంది నుంచి రూ.3 కోట్ల వరకు దండుకొని మాయమయ్యారు. హైదరాబాద్‌లో అదుపులోకి.. బాధితుల ఫిర్యాదు మేరకు ఇటీవల నగర పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. పోలీసు కమిషనర్ సూచనలతో టాస్‌్కఫోర్స్ బృందాలు హైదరాబాద్ వెళ్లి హనుమంతు రమేష్ ను, అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిద్దరినీ గురువారం సాయంత్రం టాస్‌్కఫోర్స్ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం నగర పోలీసు కమిషనర్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. -
టీడీపీ నేత బరితెగింపు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడులో టీడీపీ నేత కబ్జాచేసిన పెన్నా పొరంబోకు భూములను బుధవారం అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. 30 ఎకరాలు ఆక్రమించి దాదాపు 1,400 ప్లాట్లు వేసిన ఆ నేత ఇప్పటికే కొన్ని అమ్మి రూ.15 కోట్లు సొమ్ముచేసుకున్నారు. మిగిలిన ప్లాట్లను పేదలకు పంచుతున్నానంటూ చీటీలు పంపిణీ చేశారు. స్థానికుల ఫిర్యాదుతో వచ్చిన రెవెన్యూ, జలవనరులశాఖల అధికారులు.. పోలీసుల సహకారంతో ఆ భూమిని స్వా«దీనం చేసుకుని జేసీబీతో హద్దురాళ్లను తొలగించారు. కోడూరుపాడుకు చెందిన టీడీపీ నేత కోడూరు కమలాకర్‌రెడ్డి గుడిపల్లిపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 550, 411, 435, 538, 39, 40లోని 30 ఎకరాల పెన్నా పొరంబోకు స్థలంపై కన్నేశారు. దీన్లో కొంత భూమిని గతంలో దళితులకు డి–ఫారం పట్టాగా పంపిణీ చేశారు. వారు ఆ భూముల్ని సాగుచేసుకుంటున్నారు. ఇక్కడ ఎకరా ధర రూ.రెండుకోట్ల వరకు ఉంది. ఈ మొత్తం భూమిని ఆక్రమించిన కమలాకర్‌రెడ్డి పేదలకు పట్టాలు పంపిణీ చేస్తానని గత ఏడాది అందరినీ నమ్మించారు. రోడ్లు ఏర్పాటుచేసి దాదాపు 1,400 ప్లాట్లతో లే అవుట్ వేశారు. కొన్ని ప్లాట్లను రూ.రెండులక్షల నుంచి రూ.నాలుగు లక్షలకు విక్రయించి దాదాపు రూ.15 కోట్లు సొమ్ము చేసుకున్నారు. తాజాగా మిగిలిన ప్లాట్లను పేదలకు పంపిణీ చేస్తానంటూ చీటీలు అందజేశారు. చీటీలు అందుకున్నవారిలో ఆయన అనుచరులు, వారి సంబందీకులే 300 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. కొనుగోలుదారుల ఆందోళన పెన్నా పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి లేఅవుట్ వేశారన్న సమాచారం అందుకున్న రెవెన్యూ, జలవనరులశాఖల అధికారులు బుధవారం అక్కడికి చేరుకున్నారు. పోలీసుల సహకారంతో ప్రభుత్వస్థలాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ఆక్రమణదారులపై చర్యలకు ఉపక్రమించారు. టీడీపీ నేత వద్ద రూ.నాలుగు లక్షలకు ప్లాట్లను కొనుగోలు చేశామని, తమ పరిస్థితి ఏమిటంటూ అక్కడ పదిమంది ఆందోళన చేశారు. ఏదైనా ఉంటే ఫిర్యాదు చేయాలని, ప్రభుత్వ స్థలాలను కొనుగోలు చేసే హక్కు ఎవరికీలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో వారు వెనుదిరిగారు. -
భర్త చెంపపై కొట్టడంతో భార్య మృతి
కొవ్వూరు: డ్వాకా రుణ వాయిదా చెల్లింపు విషయంపై తగదా పడి భార్యను భర్త చెంపపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సండ్ర వీరబాబు, భార్య లావణ్య సాయి దీపిక(30)తో డ్వాక్రాలో తీసుకున్న రుణం చెల్లింపు విషయంపై వారం నుంచి తగదా పడుతున్నాడు. మంగళవారం ఉదయం వాయిదా డబ్బులు ఇవ్వాలని భార్య మరోసారి అడగడంతో కోపోద్రిక్తుడైన వీరబాబు ఆమెను చెంపపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే పడి మృతి చెందినట్లు స్ధానికులు చెబుతున్నారు. ఈ విషయం వీరబాబు అత్తమామలకు ఫోన్ చేసి జరిగిన ఘటనకు గురించి తెలిపాడు. వీరబాబుకి, లావణ్యకి 13 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు వీరబాబే లావణ్యను హత్య చేశాడని ఆరోపించారు. పెళ్లి అయినప్పటి నుంచి వీరబాబు తన కుమార్తెను సక్రమంగా చూసుకోలేదని, ఎన్నో బాధలు పెట్టారని తల్లి బడేటి వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా అన్యాయంగా చంపేశారని ఆరోపించారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై కె.సుధాకర్ తెలిపారు. డీఎస్పీ కె.సీహెచ్ రామరావు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
నంద్యాల: ఘోర రోడ్డు ప్రమాదం.. నవ దంపతులు మృతి
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇక, మృతిచెందిన వారిని హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు. వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. కాగా, వీరంతా హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన వారు అని తెలుస్తోంది. ఇక, మృతుల్లో నవ దంపతులు ఉండటం కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేస్తోంది. అల్వాల్‌కు చెందిన బాలకిరణ్, కావ్యకు ఇటీవలే ఫిబ్రవరి 29 తేదీన వివాహం జరిగింది. మార్చి మూడో తేదీన షామీర్‌పేటలో రిసెప్షన్ జరిగింది. కాగా, వీరింతా తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో మృతిచెందారు. -
వారు ప్రేమికులే
అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలోని కటికి రహదారి కరకవలస గ్రామ సమీపంలోని ఆదివారం సాయంత్రం చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన యువతీ యువకులు ప్రేమికుల జంట అని, ఇద్దరూ మైనర్లని పోలీసులు గుర్తించారు. వారిద్దరూ తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట గ్రామానికి చెందినవారు. మృతుల వద్ద దొరికిన వివరాలు, వారి స్వస్థలంలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా వారి ఆచూకీని సేకరించారు. మృతులను చైతన్య (17), జ్యోతి (14)లుగా గుర్తించారు. యువతి 9వ తరగతి చదువుతోంది. వీరిద్దరూ గత మంగళవారం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. వారం రోజులపాటు వివిధ ప్రాంతాల్లో తిరిగి, ఆదివారం అనంతగిరి మండలం కటికి జలపాతాన్ని సందర్శించి, సాయంత్రం ఓ చెట్టు వద్ద ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలకు సోమవారం అరకు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఈనాడు ఒత్తిళ్లతో మహిళా ఉద్యోగి ఆత్మహత్య
అబ్దుల్లాపూర్‌మెట్: ఈనాడు దినపత్రిక యాజమాన్యం ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ మహిళా ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడింది. సంస్థలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను, అనుభవిస్తున్న మానసిక క్షోభను భర్తతో పంచుకున్నప్పటికీ.. అవి మరింత తీవ్రతరం కావడంతో తనకిక చావే శరణ్యం అనుకుంది. తాను పనిచేస్తున్న ఈనాడు కార్యాలయ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు, మృతురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పరిధిలోని కుంట్లూర్ రెవెన్యూ గజ్జి స్వామియాదవ్ కాలనీలో నివాసముండే ఎర్రగొల్ల శ్రీనివాస్, సాయికుమారి (34)కి పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. శ్రీనివాస్ పదిహేనేళ్లుగా, సాయికుమారి తొమ్మిదేళ్లుగా రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఈనాడు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈనాడు కాల్ సెంటర్లో పనిచేసే సాయికుమారికి కొంతకాలంగా సంస్థలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. దీంతో తరచూ ఇబ్బంది పడుతుండేది. భర్తకు చెప్పుకుని బాధ పడేది. ఆదివారం సరదాగా గడిపి.. ఈ క్రమంలోనే భార్యకు మానసిక ధైర్యాన్నిచ్చేందుకు శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి తిప్పాడు. ఇద్దరూ సరదాగా గడిపారు. సోమవారం విధుల్లో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీకి బయలుదేరిన సాయికుమారిని ఉదయం 6 గంటలకు తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి జాతీయ రహదారి వద్ద దిగబెట్టి ఇంటికి వచ్చాడు. అయితే 9 గంటల సమయంలో ఈనాడు హెచ్ఆర్ విభాగం నుంచి శ్రీనివాస్‌కు ఫోన్ వచ్చింది. సాయికుమారి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయిందని చెప్పడంతో హుటాహుటిన ఫిల్మ్‌సిటీకి వెళ్లాడు. అప్పటికే తలకు తీవ్ర గాయమైన సాయికుమారి మృతి చెందింది. శ్రీనివాస్ ఇచ్చింన ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించారు. ఈనాడు సిబ్బంది అత్యుత్సాహం ఈనాడు సంస్థ ఒత్తిళ్ల కారణంగా తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చింన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పీఎస్‌లో ఉన్న శ్రీనివాస్ నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే అతని చుట్టూ కంచెలా ఉన్న ఈనాడు సిబ్బంది అడ్డుకున్నారు. తన భార్య మృతికి దారితీసిన పరిస్థితులను మీడియాకు వివరించేందుకు సిద్ధమవుతున్న శ్రీనివాస్‌ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. -
నారాయణ ‘నల్ల’ పుట్ట!
సాక్షి, అమరావతి: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..! ఇటు పన్నుల ఎగవేత అటు నల్లధనం చేరవేత! ఇవన్నీ నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అవినీతి పొంగులు! అవినీతికి తెగబడి పోగేసిన నల్లధనాన్ని తరలించేందుకు ఆయన ఏకంగా ‘ఎన్‌స్పై’ అనే కంపెనీనే ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్ కొత్తప్ప డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న ‘ఎన్‌స్పై’ ద్వారా టీడీపీ హయాంలో నారాయణ భూ దోపిడీకి పాల్పడ్డారు. మరోవైపు ఎన్‌స్పైరా ద్వారా కొనుగోలు చేసిన స్కూలు బస్సులను నారాయణ విద్యా సంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు లెక్కలు చూపించి పన్ను రాయితీలు పొందారు. నారాయణ విద్యా సంస్థల ద్వారా నల్లధనం తరలింపు, అక్రమ రాయితీలకు ఎన్‌స్పైరను వాడుకున్నట్లు సోమవారం నెల్లూరులో ఏపీ డైరెక్ట్రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్ డీఆర్ఐ) నిర్వహించిన సోదాల్లో వెల్లడైంది. ఎన్‌స్పై నిర్వాకాలు ఇవిగో.. నిధులు మళ్లించేందుకే.. నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగులకు జీతాల చెల్లింపు పేరుతో ‘ఎన్‌స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ కంపెనీ ఏర్పాటైంది. అయితే ఆ ముసుగులో తమ అక్రమ ఆదాయాన్ని తరలించేందుకు నారాయణ దీన్ని వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్‌స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తూ ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. వివిధ సేవల పేరుతో నిధులు మళ్లించి అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారు. అమరావతి భూ దందా.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో చంద్రబాబు, నారాయణ ద్వయం అమరావతిలో సాగించిన భూ దోపిడీకి ఎన్‌స్పైరను ప్రధాన సాధనంగా వాడుకున్నారు. అందుకోసం ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపారు. ఒలంపస్ క్యాపిటల్ ఏసియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చూపడం గమనార్హం. 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏసియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ.613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు రికార్డుల్లో చూపారు. రెండు విడతల్లో ఎన్‌స్పైరలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. అనంతరం నల్లధనాన్ని ఎన్‌స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నారాయణ సమీప బంధువు కేవీపీ అంజనికుమార్ ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం. నారాయణ సిబ్బంది, మరి కొందరిని తమ బినామీలుగా మార్చుకుని రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. అనంతరం వారి ద్వారా ఆ నగదు డ్రా చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను టీడీపీ సర్కారు తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను భయపెట్టారు. ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా వందల ఎకరాల అసైన్డ్ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత నారాయణ బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్లు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ.3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. అక్రమంగా బస్సుల కొనుగోలు రాయితీ నెల్లూరు కేంద్రంగా నెలకొల్పిన ఎన్‌స్పైర కార్యకలాపాలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఎన్‌స్పైర రూ.20.80 కోట్లతో హైదరాబాద్‌లో 92 బస్సులను కొనుగోలు చేసి నారాయణ విద్యా సంస్థలకు లీజుకు ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించారు. నారాయణ విద్యా సంస్థలు అందుకు ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. రవాణా శాఖకు సమర్పించిన రికార్డుల్లో మాత్రం ఆ 92 బస్సులను నారాయణ విద్యా సంస్థలే కొనుగోలు చేసినట్టు చూపడం గమనార్హం. తద్వారా విద్యా సంస్థల కోటాలో భారీగా పన్ను రాయితీ పొందారు. ఓ వ్యాపార సంస్థ ఎన్‌స్పైర కొనుగోలు చేసిన బస్సులను విద్యా సంస్థ కోసం కొనుగోలు చేసినట్టు తప్పుడు వివరాలు సమర్పించి అడ్డదారిలో పన్ను రాయితీలు పొందారు. ఎన్‌స్పైరకు ప్రతి నెల 92 బస్సులకు సంబంధించి అద్దె చెల్లిస్తున్నట్టు చూపిస్తూ కంపెనీలోకి నల్లధనాన్ని తరలిస్తున్నారు. అంతేకాకుండా నారాయణ విద్యా సంస్థలకు వివిధ సేవలు అందిస్తున్నట్టు పేర్కొంటూ ఎన్‌స్పైర బ్యాంకు ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లిస్తున్నారు. నారాయణ నల్లధనాన్ని తరలించేందుకు ఎన్‌స్పైరను వాడుకుంటున్నారు. సోమవారం నెల్లూరులో ఎన్స్పైరతో సంబంధం ఉన్నవారి నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో అధికారులు రూ.1.81 కోట్లు నగదు స్వాదీనం చేసుకున్నారు. ఆ కంపెనీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే భారీగా నల్లధనం వెలుగులోకి రావడం ఖాయమని డీఆర్ఐ వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.10 కోట్ల పన్నుల ఎగవేత లెక్క చూపని రూ.1.81 కోట్లు, కీలక పత్రాలు స్వాదీనం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విద్యా సంస్థల వాహనాలకు పన్ను రాయితీ ఉంటుంది. దీంతో వాహనాలు ఎన్‌స్పై ద్వారా కొనుగోలు చేసినప్పటికీ నారాయణ విద్యాసంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద రూ.4.48 కోట్లు జీఎస్టీ రిటర్న్‌ల రూపంలో పొందారు. ఈ మోసాన్ని గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం రవాణా శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. రూ.10.23 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉండగా రూ.22.35 లక్షలు మాత్రమే చెల్లించినట్లు గుర్తించారు. దీనిపై నెల్లూరు బాలాజీనగర్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సోమవారం నారాయణ విద్యా సంస్థలతో పాటు అనుబంధ సంస్థల్లో విస్తృత తనిఖీలు చేపట్టి పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. లెక్కల్లో చూపని రూ.1.81 కోట్ల నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగించనున్నట్లు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంపై నారాయణ డైరెక్టర్ పునీత్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.