రాజధానిలో రాబందులు

sand mafia in amaravathi - Sakshi

రాజధానిలో అర్ధరాత్రి వేళ రాబందులు తిరుగుతున్నాయి. ఇసుక, మట్టిని అక్రమంగా తవ్వుకుని తరలించుకుపోతున్నాయి. అడ్డుకట్ట వేయాల్సిన అధికారుల కళ్లను మామూళ్లు కమ్మేశాయి. రయ్యిమంటూ దూసుకుపోతున్న లారీలు, ట్రాక్టర్ల దెబ్బకు స్థానికుల గుండెలు అదురుతున్నాయి. కాంట్రాక్టర్లే ఇసుక మాఫియాతో కుమ్మక్కవడంతో ఈ అవినీతి కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. బయటకు తరలుతున్న ఇసుక లారీలు ఒక్కొక్కటి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పలుకుతున్నాయి. మొత్తంగా రాజధాని ప్రాంతంలో ఇసుక, మట్టి దోపిడీ వ్యవహారాలు చిమ్మచీకట్లో కలిసిపోతున్నాయి.  

తాడేపల్లిరూరల్‌: రాజధాని ప్రాంతంలో అర్థరాత్రి ఇసుక రాబందులు తిరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను, మట్టిని బయటకు పంపించి, ప్రతిరోజూ లక్షల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం కాంట్రాక్టర్లే మాఫియాతో చేతులు కలిపి ఇలాంటి దోపిడీకి పాల్పడుతున్నారని రాజధానిలో నివాసం ఉండే పలువురు ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. కృష్ణాయపాలెంలో కొండవీటివాగు పూడికతీత పనులు నిర్వహిస్తున్నారు. ఈ మట్టిని వాస్తవంగా వాగుకు ఇరువైపులా కట్ట ఏర్పాటుచేసి, దానిని పటిష్ఠ పరచాల్సి ఉంది. అలా చేయకుండా ఇష్టారాజ్యంగా రాత్రి సమయాల్లో వేలాది ట్రాక్టర్ల మట్టిని అమ్ముకుంటూ జేబులు నింపుకొంటున్నారు.

వివిధ ప్రాంతాల్లో నిర్మాణం చేపట్టిన పనుల నిమిత్తం గతంలోనే ఇసుక తోలుకుని డంపింగ్‌ చేసుకున్నారు. సదరు కాంట్రాక్టర్లు, మాఫియా కుమ్మక్కై ఒక్కొక్క లారీ ఇసుక రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు అమ్ముతూ రాజధాని ప్రాంతంలో రాత్రిపూట రయ్‌... రయ్‌...మని లారీలు నడుపుతూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. మందడం, కృష్ణాయపాలెం మధ్య కేఎంఆర్‌ ప్రాజెక్ట్‌ వారు కాలువ తవ్వకాలను నిర్వహిస్తున్నారు. ఏకంగా వీరు కాలువ తవ్వాల్సిన దానికన్నా ఎక్కువ తవ్వి, మట్టి కింద భాగంలో ఉండే ఇసుకను తోడుతూ పర్యావరణానికి సైతం హాని కలిగిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా నియంత్రించే అధికారే ఇక్కడ లేకపోవడం గమనార్హం.

సోమవారం తెల్లవారుజామున ఇదే ప్రాంతంలో ఓ లారీ ఇసుక లోడు చేసుకుంటుండగా స్థానికులు అక్కడి నిర్వాహకుల్ని ప్రశ్నించారు. వారు తాము కేఎంఆర్‌ ప్రాజెక్ట్‌ స్టాక్‌యార్డ్‌కు ఇసుక తరలిస్తున్నామని చెప్పారు. స్టాక్‌యార్డ్‌ ఎక్కడ ఉందని ప్రశ్నించగా, మందడంలో ఉందని సమాధానమిచ్చారు. కానీ అక్కడ లోడ్‌ అవుతున్న లారీతో పాటు అప్పటికే లోడై ఉన్న మరో లారీ రెండూ కలిసి మంగళగిరి వైపు వెళ్లాయి. మంగళగిరి మండలం యర్రబాలెం వద్ద స్థానికులు ఆపి ప్రశ్నించగా కాజ దగ్గర కేఎంఆర్‌ ప్రాజెక్ట్‌ డంపింగ్‌యార్డ్‌ ఉందని, అక్కడకు వెళ్తున్నామని చెప్పారు. దీనిపై మంగళగిరి రూరల్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి రెండు లారీలను సీజ్‌ చేశారు.

రాజధానిలో కనిపించని నిఘా...
రాజధానిలో వివిధ పనులను నిర్వహించేందుకు వందలాది కంపెనీలు టెండర్ల ద్వారా పనులు దక్కించుకొని కాంట్రాక్ట్‌ వర్క్స్‌ను నిర్వహిస్తున్నారు. పనులు నిర్వహించే దగ్గర ఎటువంటి సెక్యూరిటీని నియమించలేదు. దాంతో సూపర్‌వైజర్‌గా వ్యవహరించేవారు అక్రమాలకు పాల్పడుతూ రాజధానిలోని సంపదను దోపిడీ చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఉదాహరణకు కొండవీటి వాగు మట్టి తవ్వకాల్లో వచ్చిన మట్టిని రాజధాని ప్రయోజనాల కోసం వినియోగించకుండా వివిధ ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా, లారీల ద్వారా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సీఆర్‌డీఏ వారు కానీ, రెవెన్యూ శాఖ కానీ, గ్రామంలో ఉన్న మిగతా సిబ్బంది కానీ పట్టించుకోకుండా వారిచ్చిన పావలా, బేడా జేబులో వేసుకుంటూ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

నిబంధనలకు నీళ్లు 
రాజధాని ప్రాంతంలో నిర్వహించే పనుల్లో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లొదిలి, తమ లాభార్జన కోసం పనిచేస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. దీనికి నిదర్శనం మందడం నుంచి కృష్ణాయపాలెం మీదుగా కృష్ణానదిలో కలిసే వాగు పూడికతీత పనులే. నిబంధనలకు విరుద్ధంగా తవ్వాల్సిన దానికన్నా ఎక్కువ తవ్వి భూమిలోపల ఉన్న ఇసుకను బయటకు తీసి అమ్ముకుంటూ జేబులు నింపుకొంటున్నారు. ఇలాంటి పనులు నిర్వహించేటప్పుడు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పర్యావరణానికి సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా కాలువలు తవ్వడం వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Read latest Amaravati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top