‘స్కిమ్మింగ్‌’తో దోపిడీ!

Debit Cards Skimming Gang in Hyderabad - Sakshi

సైబర్‌ నేరగాళ్ల నయా పంథా  

డెబిట్‌ కార్డుల ‘స్కిమ్మింగ్‌’తో ఖాతా ఖాళీ  

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో వరుస సంఘటనలు  

అప్రమత్తంగా ఉండాలంటున్న సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ రోహిణీ ప్రియదర్శిని  

సాక్షి, సిటీబ్యూరో: డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంలకు వెళ్తున్నారా? అయితే మీరు జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీ బ్యాంక్‌ ఖాతాలోని డబ్బులు మాయం కావచ్చని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు ఏ మార్గమైనా డబ్బులే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ రోహిణీ ప్రియదర్శిని పేర్కొన్నారు. బ్యాంక్‌ ప్రతినిధులమంటూ ఫోన్‌కాల్స్‌ చేసి డెబిట్, క్రెడిట్‌ కార్డు వివరాలు తెలుసుకొని నగదు మాయం చేసే నేరగాళ్లు... ఇప్పుడు రూటు మార్చి ‘స్కిమ్మింగ్‌’ చేసి డబ్బులు డ్రా చేస్తున్నారని వెల్లడించారు. గత కొంతకాలంగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని కొన్ని బ్యాంక్‌ ఏటీఎంలలో స్కిమ్మింగ్‌ తరహా జరిగిన మోసాలను గుర్తు చేస్తూ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇలా చేస్తే మంచిది...
ఏటీఎంలో కార్డు రీడర్‌పై స్కిమ్మర్లను అమరుస్తారు. దీంతో పాటు ఏటీఎం పిన్‌ తెలుసుకోడానికి కీప్యాడ్‌కు వ్యతిరేకంగా పైభాగంలో చిన్న కెమెరాతో కూడిన స్కానర్‌ను కూడా ఉంచుతారు. ఏటీఎంలోకి వెళ్లినప్పుడు ఈ పరికరాలు ఉన్నాయా? అనేది పరిశీలించాలి.
శివార్లలో ఉండే, జన సంచారం ఎక్కువగా లేని, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలకు వెళ్లకపోవడమే మంచిది.
పిన్‌ టైప్‌ చేసేటప్పుడు చెయ్యి అడ్డుపెట్టుకోవడం సురక్షితం.
నగదు విత్‌డ్రా చేయగానే మొబైల్‌కు మెసేజ్‌లు వచ్చేలా ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లు పెట్టుకోవాలి.  
చాలామంది కస్టమర్లు ఫోన్‌ నంబర్లను మార్చినా బ్యాంకు అధికారులకు తెలపడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఫోన్‌ నంబర్‌ మార్చితే తక్షణమే బ్యాంకు ఖాతాకు కొత్త ఫోన్‌ నంబరును అనుసంధానం చేసుకోవాలి.
బ్యాంక్‌ ఖాతా నుంచి మన ప్రమేయం లేకుండానే నగదు ఉపసంహరణ జరిగితే వెంటనే కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి మన ఏటీఎం సేవలను స్తంభింపజేసుకోవాలి. వెంటనే సంబంధిత సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.  

స్కిమ్మింగ్‌ ఇలా...
ప్రత్యేక పరికరాలను అమర్చి క్రెడిట్, డెబిట్‌ కార్డుల సమాచారాన్ని తస్కరించడాన్ని ‘స్కిమ్మింగ్‌’ అంటారు. ఇలా కార్డుల సమాచారాన్ని చౌర్యం చేయడానికి ఉపయోగించే పరికరాలను స్కిమ్మర్‌ పరికరాలు అంటారు. ఎంపిక చేసుకున్న ఏటీఎంలలో మోసగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా వీటిని అమరుస్తారు. కస్టమర్లు ఏటీఎం ద్వారా నగదు తీసుకునేందుకు కార్డును స్వైప్‌ చేసినప్పుడు, కార్డు మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌లోని సమాచారం, పిన్‌ నంబర్‌ను స్కిమ్మర్‌ సంగ్రహిస్తుంది. సేకరించిన సమాచారంతో మోసగాళ్లు ఆ తర్వాత నగదు తీసుకుంటున్నారు. దీని కోసం కూడా పలుదారులు ఎంచుకుంటున్నారు. ప్రధానంగా నకిలీ కార్డులను తయారు చేసి సుదూర ప్రాంతాల్లోని ఏటీఎంల ద్వారా నగదు తస్కరిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top