తుది దశలో చైనా–అమెరికా వాణిజ్య చర్చలు

US And China Business Discussions - Sakshi

వాషింగ్టన్‌: వాణిజ్య వివాదాల పరిష్కారానికి సంబంధించి అమెరికా – చైనా మధ్య చర్చలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఒప్పందం అమలు తీరుతెన్నులే అన్నింటికన్నా పెద్ద సమస్యగా తయారైందని, ఇది దాదాపు పరిష్కారమైనట్లేనని అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్‌ మినుచిన్‌ తెలిపారు. ఇరు దేశాల మధ్య దాదాపు నలభై ఏళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక బంధంలో ఇది పెద్ద మార్పు తేగలదని ఆయన పేర్కొన్నారు. ‘వివాదాల పరిష్కార సాధనలో తుది దశకు మరింతగా చేరువవుతున్నామని భావిస్తున్నాం‘ అని అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్‌ సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా స్టీవెన్‌ తెలిపారు. ఒప్పంద ఉల్లంఘన జరిగిన పక్షంలో తగు చర్యలు తీసుకునేలా ఇరు పక్షాలకు అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

అయితే, చైనా గానీ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పక్షంలో ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు వడ్డించే విషయంపై ఆ దేశాన్ని ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అలాగే, అమెరికా గనుక నిర్దిష్ట ఉత్పత్తులపై మళ్లీ టారిఫ్‌లు విధించినా ప్రతీకార చర్యలు తీసుకోకుండా చైనాపై ఒత్తిడి కూడా తెస్తోంది. కానీ, ఏకపక్షంగా ఉన్న ఒప్పంద అమలు విధివిధానాలను చైనా ఇష్టపడటం లేదు. ఇవి తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థపై అమెరికాకు ఆధిపత్యాన్ని కట్టబెట్టేవిగా ఉన్నాయనే చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచ దేశాలను కలవరపర్చిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top