‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ని మళ్లీ చూద్దామా!

న్యూఢిల్లీ: షేన్‌ వార్న్‌.. ఆస్ట్రేలియా క్రికెట్‌ స్పిన్‌కు వన్నె తెచ్చిన దిగ్గజం. స్పిన్‌ మాంత్రికుడు అనే పేరుకు సరిగ్గా సరిపోతాడు వార్న్‌. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో వార్న్‌(708 వికెట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడంటే అతని ప్రతిభ ఏపాటిదో మనకు అర్థమైపోతుంది. మైదానంలో గింగిరాలు తిరిగే బంతులతో బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించడమే కాకుండా ప్రత్యర్థి జట్లకు సవాల్‌గా నిలిచేవాడు‌.  కాగా, సరిగ్గా 27 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో భాగంగా వార్న్‌ వేసిన ఒక బంతి ఇప్పటికీ ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’గానే పిలవబడుతోంది.1993లో ఇంగ్లండ్‌తో వారి దేశంలో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో వార్న్‌ ఒక అద్భుతమైన బంతిని సంధించాడు. 

ఆ టెస్టు మ్యాచ్‌ జూన్‌ 3వ తేదీన ఆరంభం కాగా, రెండో రోజు ఆట(జూన్‌ 4వ తేదీన)లో ఇంగ్లండ్‌ దిగ్గజ ఆటగాడు మైక్‌ గాటింగ్‌ను బోల్తా కొట్టించిన తీరు వార్న్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. లెగ్‌ స్పిన్‌లో ఒక విలక్షమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న వార్న్‌.. బంతిని నేరుగా గాటింగ్‌ కాళ్లకు ముందు అవుట్‌సైడ్‌ లెగ్‌స్టంప్‌పై వేసి ఆఫ్‌ వికెట్‌ను ఎగరుగొట్టిన తీరు ఇప్పటికీ చిరస్మరణీయమే. అసలు బంతి ఎక్కడ పడుతుందా అని గాటింగ్‌ అంచనా వేసే లోపే ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. ఆ బంతికి గాటింగ్‌ షాక్‌ కాగా, ఫీల్డ్‌లో ఉన్న అంపైర్‌కు కూడా కాసేపు ఏమీ అర్థం కాలేదంటే అది ఎంతలా స్పిన్‌ అయ్యి ఉంటుందో( ఎంతలా స్పిన్‌ చేశాడో) ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించడంలో వార్న్‌దే కీలక పాత్ర. ప్రతీ ఇన్నింగ్స్‌లోనూ నాలుగేసి వికెట్లు సాధించి ఒక్కసారిగా లైమ్‌ లైట్‌లోకి వచ్చాడు. వార్న్‌ కెరీర్‌కు పునాది పడిన సందర్భం కచ్చితంగా అదే టెస్టు మ్యాచ్‌. 1992లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన వార్న్‌.. ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ దిగ్గజాల సరసన నిలిచిపోయాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top