ఇప్పుడే కదా కోలుకుంది.. మళ్లీ ఇదేంటి..!

చెన్నై: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో సామాజిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే.. మనతో పాటు మన చుట్టూ ఉన్నవారి ఆరోగ్యాన్ని కాపాడినవారం అవుతామంటూ ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా కొందరు మాత్రం వీటిని అస్సలు పట్టించుకోవడం లేదు. అత్యుత్సాహం ప్రదర్శించి.. వారితో పాటు ఇతరులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సామాన్య జనం అనుకుంటే నాయకులు కూడా ఇలానే ఉన్నారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా మధురైలో చోటు చేసుకుంది. కరోనా నుంచి కోలుకుని వస్తోన్న తమ నాయకుడి కోసం కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. సామాజిక దూరాన్ని పాటించకుండా గుంపులుగా చేరి.. బాణాసంచా పేల్చుతూ.. హడావుడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. 

అసలే తమిళనాడులో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇలాంటి సమయంలో ఈ తలతిక్క పనులు ఏంటని నెటిజనులు కార్యకర్తలతో పాటు సదరు నాయకుడి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. తమిళనాడు మినిస్టర్‌ సెల్లూరు రాజుకు కొంతకాలం క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆయన చెన్నైలోని ఎంఐఓటీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వైరస్‌ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఏఐఏడీఎంకే కార్యకర్తలు తమ నాయకుడికి స్వాగతం చెప్పడానికి భారీ సంఖ్యలో గుమి కూడారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి.. హడావుడి చేశారు. సామాజిక దూరం పాటించలేదు. కొందరు సెల్ఫీ దిగేందుకు కూడా ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్‌ఐ ట్విట్‌ చేసింది. దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులే ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top