సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులపై ఆదివారం దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడిని ఎమ్మెల్యే సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దాడికి సంబంధించిన కారణాలను విలేకరులకు ఎలా చెప్పాలో ఆదివాసీలు, గిరిజనులకు ఆయన హితబోధ చేశారు. తప్పంతా అధికారులదే అన్నట్లుగా ఉండాలని ఎమ్మెల్యే కోనప్ప ఆ వీడియోలో చెప్పడం గమనార‍్హం. ఆ వీడియోలో ‘ ఇప్పుడు నేను విలేకరులను పిలిపిస్తున్నా. వాళ్ల ముంగిట చెప్పండి. భూములు దగ్గరకు వెళ్లొద్దని రోజు వచ్చి బెదిరిస్తున్నారు. భూముల్లో తవ్వకాలు జరిపారు. మా భూములు లోపల ఉన్నాయి. అక్కడకు వెళ్లకుండా మమ‍్మల్ని బెదిరిస్తున్నారు. 15 రోజుల క్రితం వచ్చి కొట్టారు. ఇప్పుడు మళ్లీ కొట్టారు. కొట్టాక అందరం దున్నొద్దని ట్రాక్టర్ల దగ్గరకు వెళ్లాం. అప్పుడే గొడవ అయింది. ఇదంతా చెప్పాలి. విలేకరులను పిలిపిస్తా. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి.’ అంటూ ఎమ్మెల్యే పేర్కొనడం విశేషం.