ప్రజా సమస్యలు తెలుసుకొని, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రజాసంకల్పయాత్ర పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ప్రకాశం జిల్లా పొదిలిలో ఆయన బహిరంగ సభకు జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మోసపూరిత వైఖరిని తూర్పారబట్టారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని, నాయకుడికి వ్యక్తిత్వం, విశ్వసనీయత, కమిట్‌మెంట్, సిన్సియారిటీ ఉండాలని అన్నారు. కానీ చంద్రబాబుకు అవేమీ లేవని వైఎస్ జగన్ విమర్శించారు.
ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్ సీనీ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పోరాటాలు చేసిందని, హోదా ఆంధ్రుల హక్కు...ప్యాకేజీ పేరుతో మోసం చేయొద్దని నినదించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాను సంజీవని అన్నారని, నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా సంజీవనా అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ మాట మార్చారని ధ్వజమెత్తారు. హోదాపై ఆయనవన్నీ మొసలి కన్నీళ్లే అని వైఎస్ జగన్ మండిపడ్డారు.