తెగబడ్డ దొంగలు, పరిగెత్తిన మహిళ

దేశ రాజధానిలో దొంగలు తెగ బడుతున్నారు. పట్టపగలు నడిరోడ్డుపై చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఉత్తర ఢిల్లీలోని పాండవ నగర్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న స్నాచింగ్‌ తాజాగా కలకలం రేపింది. మంగళవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ దగ్గర నుంచి స్మార్ట్‌ఫోన్‌ను దుండగులు లాక్కుపోయారు. హెల్మెట్లు పెట్టుకుని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. స్నాచింగ్‌ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. దుండగులను ప్రతిఘటించిన బాధితురాలు వారిని పట్టుకునేందుకు కొంచెం దూరం బైక్‌ వెంట పరిగెత్తిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియోను ట్విటర్‌ యూజర్‌ ఒకరు షేర్‌ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా దీనిపై స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు దొంగలను పట్టుకోవడంలో పోలీసులకు సహాయపడగలవని ఆయన అన్నారు. దుండగులు తప్పించుకోలేరని అంటూ ఘటన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. పాండవ నగర్‌, పాత్‌పర్‌గంజ్‌ ప్రాంతాల్లో ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల 50పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అయితే బాధితురాలు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఉత్తర ఢిల్లీలో స్నాచింగ్‌ ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత నెలలో లక్ష్మీనగర్‌లో ఇంటి బయట వేచివున్న వృద్ధురాలిని స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు దోపిడీ చేశారు. ఈ దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డైయ్యాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top