ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధనబలం ఉంటే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి జనబలం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంల మీద సాకులు చెప్పడానికి టీడీపీ ఇప్పుడే ప్రచారాన్ని ప్రారంభించిందని విమర్శించారు. నంద్యాల ఉపఎన్నికలో 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన టీడీపీ.. ఇప్పుడు కత్తిరింపు సర్వేతో దగా చేయడానికి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో తెలుగు యువత పేరుతో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించే కార్యక్రమానికి తెరతీశారని మండిపడ్డారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 10 వేలు, 20 వేల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ట్యాబ్స్‌లో ఓటర్ల లిస్ట్ పెట్టుకుని సర్వేలు చేయడమేమిటని.. అసలు ట్యాబ్‌లకు, ఆర్టీజీఎస్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. వీటిని టీడీపీ కార్యాలయానికి లింక్ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని, చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి తమ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఫిర్యాదు చేశారని తెలిపారు.