బాబు కనుసన్నల్లో కూటమి టికెట్లు | Sakshi
Sakshi News home page

బాబు కనుసన్నల్లో కూటమి టికెట్లు

Published Tue, Apr 2 2024 8:05 AM

Janasena Activists Fire On Pawan Kalyan

జనసేనలో చేరిన మండలి బుద్ధ ప్రసాద్‌

ఆయనకే టిక్కెట్టు ఇచ్చేందుకు రంగం సిద్ధం

విజయవాడ వెస్ట్‌ సీటు బీజేపీకి కేటాయింపు వెనుక చక్రం తిప్పిన బాబు

అక్కడ జనసేనకు చెందిన బీసీ అభ్యర్థికి మొండిచేయి

సుజనా చౌదరి బాబు సన్నిహితుడే

పవన్‌కల్యాణ్‌ తీరుపై సైనికుల ఆగ్రహం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన కార్యకర్తలు తమ అధినేత పవన్‌కళ్యాణ్‌ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. పొత్తులో భాగంగా జిల్లాలో అవనిగడ్డ, విజయవాడ వెస్ట్‌, మచిలీపట్నం పార్లమెంట్‌ సీట్లు జనసేనకు దక్కాయి. ఈ సీట్లు పార్టీ కోసం ఆది నుంచి కష్టపడిన వారికి దక్కుతాయని జనసేన నాయకులు, కార్యకర్తలు అశించారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ వీరి ఆశలపై నీళ్లు చల్లారు. బాబు తెరవెనుక మంత్రాంగం నడిపి, డబ్బు మూటలతో వచ్చే ఇతర పార్టీ నాయకులకే ప్రాధాన్యత ఇచ్చి వారికే సీట్లు కేటాయించేలా చేశారు. తన సన్నిహితులు, టీడీపీలోని వారికే టిక్కెట్లు దక్కేలా చూసుకున్నారు.

ఇదంతా పవన్‌కళ్యాణ్‌తో కలిసి బాబు అడుతున్న నాటకంగా జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. కాపుల ఓట్లను దండుకొనేందుకు పవన్‌ కళ్యాణ్‌కు ప్యాకేజి ఇచ్చి పావుగా వాడుకొంటున్నారనే భావన ఇప్పుడు వ్యక్తం అవుతోంది. జనసేనకు రాజ్యాధికారం వస్తుందనే ఆశతో పవన్‌ వెంట నడిస్తే, ఆయన మాత్రం బాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ జెండా భుజాన వేసుకుంటున్నాడని జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.

అవనిగడ్డ సీటుపై బాబు కపట నాటకం..
పైకి అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చి, లోపల మాత్రం టీడీపీకే టిక్కెట్లు కేటాయించేలా పవన్‌ బాబుతో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా అక్కడ టిక్కెట్‌ కేటాయింపుపై డ్రామాకు తెరలేపారు. జనసేనకు టిక్కెట్టు కేటాయిస్తే సహకరించేది లేదని, అవనిగడ్డ సీటు తెలుగుదేశానికే కేటాయించాలని బాబు డైరెక్షన్‌లో ఆందోళనలు చేయించారు. మండలి బుద్ధ ప్రసాద్‌కు టిక్కెట్టు కేటాయించపోతే పార్టీ పదవులకు రాజీనామా చేయిస్తున్నట్లు హెచ్చరించారు. జనసేన అధినేత కంటితుడుపుగా పలువురి పేర్లతో ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేయించారు.

చంద్రబాబు, పవన్‌ ఒప్పందం ప్రకారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్‌ను పార్టీలో చేర్చుకొని, టిక్కెట్టు కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డలో జనసేన కార్యకర్తలు సమావేశమై మండలి బుద్ధ ప్రసాద్‌కు టిక్కెట్టు ఇస్తే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించడం పార్టీలో కలకలం రేపుతోంది.

అవనిగడ్డలో జనసేన అభ్యర్థిని నిలబెట్టేలా..
అవనిగడ్డలో జనసేన అభ్యర్థినే నిలబెట్టేందుకు పోరాడుతున్నా మని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పేర్కొన్నారు. మాబిడ్డకు వేరొకరు తండ్రి అవుతారంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. పార్టీ కోసం కష్టపడిన ఒకరిని అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. పక్క పార్టీ నాయకులను తీసుకొస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. మమ్మల్ని కాదని వేరొకరికి టిక్కెట్‌ ఇస్తే ప్రాణ త్యాగం చేస్తామన్నారు.

వెస్ట్‌లో సుజనా బాబు సన్నిహితుడే...
పదేళ్లు జనసేన జెండా మోసి, పార్టీ కోసం కష్టపడిన బీసీ నేత పోతిన మహేష్‌కు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ముందస్తు ఒప్పందంలో భాగంగా వెన్నుపోటు పొడి చారు. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్‌ సీటు జనసేనకు దక్కుతుందని ప్రచారం సైతం చేసుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ పోతిన మహేష్‌కు సూచించారు. దీంతో ఆయన నియోజక వర్గంలో ఇంటింటి ప్రచారం చేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కడ జనసేన కార్యకర్తలు పోతిన మహేష్‌కే టిక్కెట్టు ఇవ్వాలని రోడ్డెక్కి అందోళనలు చేశారు.

అవేమీ పట్టించుకోకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఆయన హెచ్చరించారు. బీజేపీ తరపున అభ్యర్థిగా రోజుకొక పేరు తెరపైకి తెచ్చారు. చివరకు పక్కా ప్రణాళికతో బాబు సన్నిహితుడు సుజనా చౌదరికి టిక్కెట్టు కేటాయించేలా చక్రం తిప్పారు. ఈ రెండు సీట్లు బాబు కనుసన్నల్లో టీడీపీ నేతలకే దక్కాయి. ఈ సీట్ల కేటాయింపునకు పవన్‌కళ్యాణ్‌ డబ్బునే ప్రాతిపదికగా తీసుకొన్నట్లు జనసేన నాయకులు, కార్యకర్తలు బహిరంగానే పేర్కొంటున్నారు. మచిలీపట్నం పార్లమెంటు సీటు సైతం వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరికి కేటాయించారు.