రాబోయే వంద రోజుల్లో కాస్త అటూ ఇటూగా ఎన్నికల షెడ్యూల్ వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. మాసబ్ట్యాంక్ వద్ద కాజా ఫంక్షన్ హాల్లో ఈ రోజు జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మనుకున్న వంద రోజుల సమయంలో ఏఏ పనులు చేశాం, మనం ఇంకా చేయాల్సిన పనులేంటీ? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. దిక్కుమాలిన రాజకీయాలు, నిజాయితీలేని వ్యవస్థను చూస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయల్లో నాన్నను చూసినప్పుడు ఆయనలాగా ఉండాలని అనుకునేవాడినని చెప్పారు. ఫలానా వాడు తమ నాయకుడని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా ఉండాలని కలలు కనేవాడినని తెలిపారు. కానీ, నాన్న చనిపోయిన తరువాత ఈ వ్యవస్థను చూస్తే బాధ కలుగుతుందన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుల వైఖరులను ప్రజా క్షేత్రంలో నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు.