లిబియాలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించాలని కోరుతూ విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి లేఖ రాశారు. లిబియాలో చిక్కుకుపోయిన తెలుగువారిపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బతుకుతెరువు కరవైనవారు లిబియాకు వెళ్ళారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు వెయ్యి మంది తెలుగు ప్రజలు లిబియాలో చిక్కుకుపోయినట్లు సమాచారం ఉన్నట్లు తెలిపారు. వారందరినీ సురక్షితంగా స్వస్థలాలకు రప్పించాలని ఆ లేఖలో జగన్ కోరారు. లిబియాలో అంతర్యుద్ధం కారణంగా ఉపాధి కోసం అక్కడకు వెళ్లిన భారతీయులు నానా కష్టాలు పడుతున్నారు. అక్కడ ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యతిరేక దళాలకు మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భోజనం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. హింస చెలరేగిన నేపథ్యంలో లిబియా నుంచి వెళ్లిపోవాలని భారతీయులకు అక్కడి ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. లిబియా నుంచి వెళ్లిపోవడానికి అన్ని మార్గాలను వినియోగించుకోవాలని, ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని కోరింది.