''నటరాజు కొత్త బాధ్యతలను అందించారు. ఇది మామూలుగా జరిగిందా అంటే.. ఎలా జరిగిందని మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. గత 15-20 రోజుల నుంచి ఏం జరిగిందో అంతా మీడియాలో వస్తూనే ఉంది. రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగువారంతా ఈ ఎన్నికల గురించి ఏమైందోనని ఆసక్తిగా ఎదురుచూశారు. ఇది కేవలం సేవా కార్యక్రమం. కళాకారులకు సేవ చేయడానికి వచ్చాం. ఇక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లడానికి రాలేదు. నాకు కనీసం టీ కూడా ఇవ్వద్దు. ఎందుకంటే.. ఇక్కడకు ఒక కమిట్మెంట్తో నేను, కాదంబరి కిరణ్, శివాజీరాజా, ఏడిద శ్రీరాం గుడిలో ఒట్టేసి మరీ వచ్చాం. మమ్మల్ని భయపెట్టారు, ప్రలోభపెట్టారు, కుళ్లు, కుత్సిత రాజకీయాలు చేశారు. నేను వాటికి పనికిరాను, అవేంటో నాకు తెలీదు. ఎన్ని పరీక్షలు దాటుకుని ఇక్కడకు వచ్చామో మీకే తెలుసు. మేం ఒంటరిగా పోరాటం చేశాం.. ఇది ధర్మయుద్ధం. పిరికివాడుంటే రాజు ముందుకు వెళ్లలేడంటూ నా వెనకున్న ఏకైక వ్యక్తి.. నాగబాబు. రాజా.. ముందుకెళ్లు అన్నారు. నామీద మీకున్న ప్రేమతో పాటు.. నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేనన్న ప్రతి మాటను నెరవేరుస్తా. ఏమాటా మర్చిపోయే అవకాశమే లేదు. విజయచందర్ లాంటి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా నాకు అండదండగా ఉన్నారు. మీరు గెలిచి తీరాలని ఆశించారు. ఈ విజయం నాది కాదు.. ఓట్లేసిన వాళ్లదే. అందరికీ సాష్టాంగ నమస్కారం. నాకు నాయకత్వం ఆపాదించొద్దు. ఆ మత్తు తలకెక్కితే కష్టం. నిమ్మకూరులో నందమూరి తారకరామారావు ఇంట్లో పుట్టిన నేను.. ఆయన స్ఫూర్తితోనే ముందుకు వచ్చాను. ఇంత మెజారిటీతో గెలవడం మా చరిత్రలో ఎప్పుడూ లేదు. అంటే ఎక్కువ మంది నన్ను పనిచేయమని కోరుకుంటున్నారు.''
Apr 17 2015 1:47 PM | Updated on Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
Advertisement
