తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందంటూ ఢిల్లీకి వెళ్లి అందరినీ కలసి ఫిర్యాదు చేసిన టీడీపీ ప్రభుత్వం.. ట్యాపింగ్‌పై ఆధారాలేవీ కేంద్రానికి సమర్పించలేదు. తామిచ్చిన ఫిర్యాదులో కూడా ట్యాపింగ్ జరిగిందన్న అనుమానాలున్నాయనే చెప్పి సరిపెట్టేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులిస్తూ రేవంత్‌రెడ్డి దొరికిపోయిన కేసులో బాబు ప్రమేయం ఉంద న్న ఆడియో టేపులు వెల్లడైన నేపథ్యంలో ఆ వ్యవహారాన్ని ఫోన్ ట్యాపింగ్ వైపు మళ్లించిన విషయం తెలిసిందే. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ చంద్రబాబు ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో ఫిర్యాదు చేశారు. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆరోపణలతోపాటు బలం లేనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీ చేసిన వైనాన్ని పేర్కొన్నారు. ఒక టీడీపీ ఎమ్మెల్యేను బలవంతంగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారని, పలు పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొని కేసీఆర్ చట్టవ్యతిరేకచర్యలకు పాల్పడుతున్నారని వివరించారు.