breaking news
avidences
-
షీనా కేసులో కీలక ఆధారాలు మాయం!
సంచలనం రేపుతున్న షీనా బోరా హత్య కేసులో గంట గంటకూ కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. కేసులో కీలక ఆధారాలుగా భావిస్తున్న మూడు వస్తువులు మాయం అయినట్లు తాజా సమాచారం. షీనా బోరాను హత్యచేసి కాల్చి, పూడ్చిపెట్టిన ప్రదేశం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న గులాబి రంగు వస్త్రం, ఒక దంతం, కుడి చేతి ఎముక ఏమైపోయాయో, ఎక్కడున్నాయో ఎంతకీ అంతుచిక్కడంలేదు . ఆ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పోలీస్ రికార్డుల్లో ఉన్నప్పటికీ.. ల్యాబ్ అధికారులు మాత్రం అలాంటిదేమీలేదని కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసులో నిందితురాలిగా భావిస్తున్న ఇంద్రాణియే తన పలుకుబడిని ఉపయోగించి ఆధారాలను మాయం చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుర్వాసన వస్తోందని.. రాయ్‌గఢ్ జిల్లా పేన్ తాలూకా గగోబె బుద్రుక్ గ్రామస్తులు.. 2012, మే 23న పేన్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. గ్రామం సమీపంలోని అటవీప్రాంతం నుంచి దుర్వాసన వస్తున్నదని, ఓ సారి వచ్చి చూడాల్సిందిగా కోరారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు అక్కడే పడిఉన్న ఒక వస్త్రం, దంతం, ఎముకలను స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం కలీనాలోని ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపారు. సీన్ కట్ చేస్తే.. డ్రైవర్ వాగ్మూలంతో బట్టబయలైన షీనా బోరా హత్యోదంతాన్ని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసుల.. పేన్ పోలీసులు స్వాధీనం చెసుకున్న వస్తువుల గురించి తెలిసింది. దీంతో ముంబై పోలీసులు వెంటనే పేన్కు వెళ్లి రికార్డులను పరిశీలించారు. అటుపై కలీనాలోని ఎఫ్ఎస్ఎల్కు వెళ్లారు. కానీ అక్కడ ఆ ఆధారాలు కనిపించలేదు. పైగా పేన్ పోలీసుల రికార్డుల్లో ఉన్నట్లు ఒక మహిళకు సంబంధించిన మూడు వస్తువులేవీ తమ వద్దకు రాలేదని తేల్చిచెప్పారు. దీంతో కంగుతిన్న ముంబై పోలీసులు.. 2012లో ల్యాబ్ ఇన్చార్జిలుగా పనిచేసిన వారందరినీ ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. పొరపాటునగానీ ఈ ఆధారాలు మరో ల్యాబ్ కు చేరి ఉంటాయా? అనే అనుమానంతో ముంబైలోని జేజే హాస్పిటల్ ల్యాబరేటరీ రికార్డులను కూడా పరిశీలించారు. అయితే అక్కడ కూడా నిరాశే ఎదురైంది. -
ట్యాపింగ్‌కు ఆధారాల్లేవట
-
ట్యాపింగ్‌కు ఆధారాల్లేవట
- అనుమానాలున్నాయని మాత్రమే కేంద్రానికి ఫిర్యాదు - మీడియాలో వచ్చిన వార్తలే ఆధారాలుగా సమర్పణ - ఫోన్ ట్యాపింగ్‌పై టీడీపీ సర్కారు తీరిది... సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందంటూ ఢిల్లీకి వెళ్లి అందరినీ కలసి ఫిర్యాదు చేసిన టీడీపీ ప్రభుత్వం.. ట్యాపింగ్‌పై ఆధారాలేవీ కేంద్రానికి సమర్పించలేదు. తామిచ్చిన ఫిర్యాదులో కూడా ట్యాపింగ్ జరిగిందన్న అనుమానాలున్నాయనే చెప్పి సరిపెట్టేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బులిస్తూ రేవంత్‌రెడ్డి దొరికిపోయిన కేసులో బాబు ప్రమేయం ఉంద న్న ఆడియో టేపులు వెల్లడైన నేపథ్యంలో ఆ వ్యవహారాన్ని ఫోన్ ట్యాపింగ్ వైపు మళ్లించిన విషయం తెలిసిందే. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ చంద్రబాబు ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో ఫిర్యాదు చేశారు. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆరోపణలతోపాటు బలం లేనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసిన వైనాన్ని పేర్కొన్నారు. ఒక టీడీపీ ఎమ్మెల్యేను బలవంతంగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారని, పలు పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొని కేసీఆర్ చట్టవ్యతిరేకచర్యలకు పాల్పడుతున్నారని వివరించారు. విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం గవర్నర్ విధుల నిర్వహణతో పాటు ఫోన్ల ట్యాపింగ్‌పైనా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపై ఆధారాలే వీ సమర్పించలేదని ఒక సీనియర్ మంత్రి చెప్పారు. తమ మంత్రులు, ఇతరులకు సంబంధించి 120 ఫోన్లు ట్యాపింగ్ జరిగాయనడానికి తమ వద్ద ఆధారాలేవీ లేవని తెలిపారు. స్టీఫెన్‌సన్‌తో బాబు జరిపిన బేరసారాల టేపులు తమ వద్ద ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని చేసిన వార్తలనే ఆధారాలుగా చూపి స్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు ఆ మంత్రి శుక్రవారం సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. ఫోన్లు ట్యాప్ చేసే పరిజ్ఞానాన్ని చట్ట విరుద్ధంగా సమకూర్చుకున్న ప్రైవేటు సంస్థలకు ఔట్సోర్సింగ్ ఇచ్చి టీ సర్కార్ ట్యాపింగ్ చేసిందని బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మేరకే మే 24 నుంచి 31 వరకు నామినేటెడ్ ఎమ్మెల్యే ఫోన్‌కు అంతరాయం కలిగించారని తెలిపారు. -
మరిన్ని ఆధారాలు లభ్యం!
- ఓటుకు నోటు కేసులో ఏసీబీకి కీలక సమాచారం - 'బాస్’, మరో 15 మందిని నిందితులుగా చేర్చే అవకాశం - ఏపీకి చెందిన ఓ కార్పొరేట్ సంస్థ ద్వారానే రూ. 50 లక్షలు - ఇద్దరు రాజ్యసభ సభ్యుల నేతృత్వంలో రేవంత్ డీల్ - నిందితులకు ముగిసిన ఏసీబీ కస్టడీ - చివరిరోజు అనూహ్యంగా రేవంత్, మిగతా ఇద్దరి ఇళ్లలో సోదాలు - పలు పత్రాలు, ఖాతాలు, లాకర్ల వివరాలు, సీసీ ఫుటేజీలు స్వాధీనం - నిందితులకు 15 వరకు రిమాండ్ పొడిగింపు, చర్లపల్లి జైలుకు తరలింపు - నేడు విచారణకు రేవంత్ బెయిల్ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముడుపుల కేసులో ఏసీబీ కీలక ఆధారాలు రాబట్టింది. ఈ కేసులో నిందితులైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహలను నాలుగు రోజులు విచారించిన దర్యాప్తు అధికారులు సంతృప్తికరమైన ఆధారాలను సమకూర్చుకున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కొనుగోలుకు తెరవెనక నుంచి వ్యవహారం నడిపించిన ‘బాస్’ బృందం వివరాలు, పెద్దమొత్తంలో నగదు సమకూర్చిన టీడీపీ అనుబంధ కార్పొరేట్ సంస్థ వివరాలను సేకరించారు. స్టీఫెన్‌సన్‌తో ‘బాస్’ మాట్లాడడానికి ముందు, ఆ తర్వాత జరిగిన సంఘటనలకు, తమ దగ్గరున్న ఆధారాలతో నిందితులిచ్చిన సమాచారాన్ని సరిపోల్చుకోగలిగారు. ఈ కేసులో ‘బాస్’తోపాటు మరో 15 మందిని నిందితులుగా చేర్చేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను ఏసీబీ అధికారులు సంపాదించారు. నిందితుల పూర్వాపరాలతో పాటు కొంతకాలంగా వారు వినియోగించిన ఫోన్లలోని కాల్‌లిస్టులు, వారి ఇళ్ల వద్దకు వచ్చిన వ్యక్తులు, బ్యాంకుల ద్వారా సాగిన లావాదేవీల వివరాలను సేకరించారు. స్టీఫెన్‌కు రేవంత్ అడ్వాన్స్‌గా ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపైనే విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ అధికారులు బయటకు చెబుతున్నప్పటికీ పలు బృందాలుగా ఏర్పాటై ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ మొత్తాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు కాల్ రికార్డులు బయటకొచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. కాగా, రేవంత్, ఇతర నిందితుల కస్టడీ గడువు ముగియడంతో మంగళవారం మధ్యాహ్నమే ఏసీబీ అధికారులు వారిని ఉస్మానియా ఆసుపత్రిలో పరీక్షలు జరిపించి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కోర్టు వారికి 15వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించింది. అనంతరం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఇళ్లలో సోదాలు.. కస్టడీలో నాలుగోరోజైన మంగళవారం అనూహ్యంగా ముగ్గురు నిందితుల ఇళ్లలో అధికారులు సోదాలు జరిపారు. ఉదయం 4.30 గంటల నుంచే చేపట్టిన ఈ తనిఖీల్లో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని రేవంత్ కొత్త, పాత ఇళ్లు రెండింటిలోనూ ఏసీబీ బృందం రెండు విడతలుగా సోదాలు నిర్వహించింది. అక్కడి కంప్యూటర్లలోని సమాచారం, హార్డ్ డిస్క్‌లు, సీసీ పుటేజీల రికార్డులను, సర్వర్లను స్వాధీనం చేసుకుంది. అలాగే ఎర్రగడ్డలోని సెబాస్టియిన్ ఇల్లు, నాగోల్‌లోని ఉదయ్ సింహ ఇంట్లో కూడా ఒకేసారి సోదాలు నిర్వహించిన అధికారులు బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాలు, భూ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్ల సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. బ్యాంకు లాకర్లలో పెద్దఎత్తున ఆస్తులున్నట్లు గుర్తించారు. ముగ్గురు నిందితుల కుటుంబసభ్యులను ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టారు. ఏసీబీ వద్ద ఉన్న ఆడియో, వీడియో రికార్డుల సంభాషణలకు బలం చేకూర్చే ఆధారాలను ఏసీబీ సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, ఉదయ్‌సింహ ఇంట్లో 8 విదేశీ మద్యం సీసాలు లభించడంతో వాటిని ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. మరోవైపు ఈ కేసును పక్కదోవ పట్టించేందుకు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చంద్రబాబు తెరపైకి తేవడంతో ఏసీబీ డీజీ ఎ.కె.ఖాన్, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మంగళవారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. నిందితుల నుంచి రాబట్టిన సమాచారం, ఇళ్లల్లో సోదాలు, ఫోన్ కాల్‌లిస్టులు, బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు తమ విచారణలో తేలిన అంశాలను సీఎంకు వివరించినట్లు సమాచారం. బాస్ ఆశీస్సులతో.. ఎంపీల నేతృత్వంలో.. తెలంగాణలో ఎమ్మెల్సీని గెలవడం ద్వారా టీడీపీని బలమైన శక్తిగా చాటడంతోపాటు అధికార టీఆర్ఎస్ను నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో తెలుగుదేశం నేతలు వ్యూహం రచించినట్లు నిందితుల విచారణలో స్పష్టమైంది. ‘బాస్’ కోసమే రేవంత్, పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న పారిశ్రామికవేత్తలు... ఏపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఓ మంత్రి, తెలంగాణకు చెందిన ఓ ఎంపీ, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు డీల్ నడిపించినట్లు అధికారులు గుర్తించారని తెలిసింది. ‘బాస్’ ఎవరనే విషయంలో అధికారులను తప్పుదోవ పట్టించేలా ఓ టీటీడీపీ నేత పేరును రేవంత్ చెప్పినప్పటికీ.. మిగతా ఇద్దరు నిందితులు మాత్రం అసలు బాస్ ఎవరో తేల్చినట్లు సమాచారం. చంద్రబాబు వద్దకు డీల్ అంశాన్ని తీసుకెళ్లిన సెబాస్టియిన్ విచారణలో తనకు తెలిసిన విషయాలన్నింటినీ పూసగుచ్చినట్లు వివరించారని తెలిసింది.