సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్గా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎస్.శైలజానాథ్కు చేదు అనుభవం ఎదురయింది. అనంతపురంలో సమైక్య ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన శైలజానాథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. శైలజానాథ్ గోబ్యాక్ అంటూ సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా కొనసాగించడం మినహా మరే ప్రతిపాదనను అంగీకరించేది లేదని ఆయన ముందునుంచి చెబుతూ వస్తున్నారు. మరోవైపు సమైక్య ఉద్యమాలు అనంతపురం జిల్లాలో 28వ కోజుకు చేరాయి. అనంతపురంలో ఉద్యోగ సంఘాల 48 గంటల బంద్ కొనసాగుతోంది. మంత్రి శైలజానాథ్ కార్యక్రమాలను బహిష్కరించాలని ఉద్యోగసంఘాల జేఏసీ కన్వీనర్ హేమసాగర్ పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఎస్కేయూలో సీమాంధ్ర విశ్వవిద్యాలయాల జేఏసీ నేతలు సమావేశమయ్యారు.