తమిళనాడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి పీఠంకోసం వారం రోజులుగా ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన ఆపద్ధర్మ ముఖ్యమంతి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేశాక పన్నీర్ సోమవారం తొలిసారి సచివాలయానికి వెళ్లి సమీక్షలు నిర్వహించగా... శశికళ ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించి సామాన్యులతో మమేకమయ్యారు. వెయ్యిమంది పన్నీర్‌సెల్వంలను చూశానంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు పన్నీర్ పలు ప్రయత్నాలు చేసినప్పటికీ... ఇప్పటికీ 119 మంది ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నారని ప్రభుత్వమే మద్రాసు హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించే అవకాశం ఉండడంతో రాష్ట్రమంతటా ఉత్కంఠ నెలకొంది.