ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ఆదివారం మావోయిస్టుల ఎర్రజెండాలు, బ్యానర్లతో ఎరుపెక్కింది. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను దళసభ్యులు విజయవంతంగా నిర్వహించారు. సరిహద్దుల్లోని మారుమూల అటవీ ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ బహిరంగ సభలో విప్లవ గీతాలను ఆలపించారు. మన్యంలో బాక్సైట్, కాఫీ, సాయుధ పోరాటంలో జీవితాలు త్యాగం చేసిన కామ్రెడ్ నరేందర్, మహేందర్,శరత్, లాలు, బీగాల్, సొన్నుల పేరులో భారీ స్థూపం నిర్మించి, శ్రద్ధాంజలి ఘటించి విప్లవాభి వందనాలు తెలిపారు. కామ్రేడ్ చలసాని ప్రసాద్‌కు విప్లవ జోహార్లు అర్పించారు. సీపీఐ మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ మంగ్లన్న పేరిట ఈమేరకు ఆదివారం ఓ ప్రకటన వెలువడింది. సభలో మంగ్లన్న మాట్లాడుతూ మన్యంలోని విలువైన బాక్సైట్‌ను దోచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర పన్నుతున్నాయన్నారు. ఇందులో భాగంగానే మారుమూల గ్రామాల్లో రోడ్లు నిర్మిస్తున్నారని, దీనిని అడ్డుకుంటామని ప్రకటించారు. మన్యంలో పోలీసు ఔట్‌పోస్టులు, రహదారులు, సెల్‌టవర్లు నిర్మాణంపై ఎక్కువ శ్రద్ధకనబరుస్తున్నారని, ఇతర మౌలిక సదుపాయాలను పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాల్లో జనమైత్రిలు నిర్వహించి చిల్లర సామగ్రి అందించి పోలీసులు ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. మన్యంలో అక్రమ అరెస్టులు నిలిపివేయాలని, సాయుధ విప్లవాన్ని ఎవ్వరూ ఆపలేరని అన్నారు. ప్రభుత్వ కుట్రను ప్రజలే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులంటూ పోలీసులు ప్రచారం చేసి అధికారులు మారుమూల గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. సంస్మరణ సభకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారని, ఆదివాసీ విప్లవ రైతుకూలీ సంఘం, మహిళా సంఘం నాయకులు ప్రసంగించారని,స్థూపాల వద్ద లొంగుబాట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని తెలిపారు. పోలీసు బలగాలు దింపినా, శిబిరాలు పెట్టినా, ప్రజల విప్లవ భావాలను, చైతన్యాన్ని అడ్డుకోలేరన్నారు.
Aug 3 2015 7:05 AM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
Advertisement
