వర్షం కురిసి వెలిసిన ఆహ్లాదకర వాతావరణం.. వెలుగులు విరజిమ్మే అందమైన నిలువెత్తు పూల గోపురం.. దాని చుట్టూ వేలాది మంది మహిళలు.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ పాటలతో ఆటలు. ఒకవైపు ఆనందోత్సాహాలు, మరోవైపు ఉత్కంఠ భరిత క్షణాలు.. తెలంగాణ సాంస్కృతిక వైభవమైన బతుకమ్మ మహా ప్రదర్శన దృశ్యమిది. వేలాది మంది మహిళలు పాల్గొన్న ఈ బతుకమ్మ సాంస్కృతిక ఉత్సవం గిన్నిస్‌బుక్‌లో సగర్వంగా చోటు దక్కించుకుంది. శనివారం లాల్‌బహదూర్ స్టేడియంలో వేలాదిమంది మహిళలు బతుకమ్మ ఆడుతుండగానే.. ఈ ప్రదర్శన గిన్నిస్‌బుక్ రికార్డ్స్‌కు అర్హత సాధించినట్లు పరిశీలకులు కుమరన్, జయసింహా ప్రకటించారు.