ఐపీఎల్ మాజీ కమిషనర్, మనీ ల్యాండరింగ్ సహా పలు కేసుల్లో నిందితుడుగా పరారీలో ఉన్న లలిత్ మోదీ వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేల తరువాత ‘మోదీగేట్’లో తాజాగా తెరపైకి వచ్చిన మరో పేరు దుష్యంత్ సింగ్. వసుంధర రాజే తనయుడైన దుష్యంత్‌కు చెందిన కంపెనీ ‘నియంత్ హెరిటేజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్’లో 2008లో లలిత్ మోదీ రూ. 11.63 కోట్లు పెట్టుబడిగా పెట్టిన విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. వాటిలో రూ. 3.8 కోట్లు రుణం కాగా, మిగతా మొత్తాన్ని 815 షేర్ల కొనుగోలుకు వెచ్చించారు. ఈ లావాదేవీలో రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు అసాధారణ రీతిలో రూ. 96,180ల భారీమొత్తం చెల్లించారు. లలిత్ ఆర్థిక అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) జరుపుతున్న దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. దుష్యంత్ ప్రస్తుతం బీజేపీ ఎంపీ. దీనిపై ప్రశ్నించగా.. ఆ షేర్ల కొనుగోలు కంపెనీ విలువను, భవిష్యత్ వృద్ధి సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న తెలివైన వ్యాపార నిర్ణయమంటూ దుష్యంత్ స్పందించారు.