ఒబామా చూపిన చొరవ అపూర్వం: మోదీ | indo-us-ties-a-natural-global-partnership-says-narendra-modi | Sakshi
Sakshi News home page

Jan 25 2015 5:15 PM | Updated on Mar 22 2024 11:20 AM

ద్వైపాక్షిక చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... ''అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, అమెరికా ప్రథమ మహిళను భారతదేశానికి ఆహ్వానించడం గర్వకారణం. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు అంగీకరించినందుకు కృతజ్ఞతలు. మీరు ఎంత బిజీగా ఉంటారో మాకు తెలుసు. కానీ, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య సంబంధాలు ఎలా మారుతాయో దీనివల్ల తెలుస్తుంది. ఈ భాగస్వామ్యంపై మీ కమిట్మెంట్ను ఇది సూచిస్తుంది. రెండు దేశాల సంబంధాల విషయంలో ఎప్పుడూ ఎలాంటి అనుమానం లేదు. ప్రస్తుత డిజిటల్ తరంలో ఇది మరింత దృఢంగా మారింది. ఈ భాగస్వామ్యం విజయవంతం కావడం ప్రపంచ శాంతికి చాలా కీలకం. ప్రారంభం బాగానే ఉంది గానీ.. దీన్ని విజయవంతమైన లక్ష్యం దిశగా తీసుకెళ్లాలి. గడిచిన కొన్ని నెలల్లో ఈ బంధంలో కొత్త విశ్వాసం కనిపిస్తోంది. పౌర అణు ఒప్పందం మన రెండు దేశాల మధ్య సంబంధాల్లో అత్యంత కీలకం. దీనివల్ల సరికొత్త ఆర్థిక అవకాశాలు, స్వచ్ఛమైన ఇంధనం లాంటివి సాధ్యమవుతాయి. ఒప్పందం మీద సంతకాలు అయిన ఆరేళ్ల తర్వాత దీనిపై వాణిజ్యపరమైన సహకారం మొదలవుతోంది. అంతర్జాతీయ న్యాయపరమైన అడ్డంకులు లేకుండా ఉండటానికి మీరు చూపిన చొరవ అపూర్వం. అణు ఎగుమతి దేశాలలో భారతదేశం కూడా చేరేందుకు తనవంతు సాయం తప్పక చేస్తానని ఒబామా చెప్పారు. ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాల కారణంగా మన స్వదేశీ రక్షణ పరిశ్రమ విస్తరిస్తుంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడాలి. మన రెండు దేశాల్లో ఆర్థికవృద్ధి మరింత బలపడుతోంది. అనుకున్న సమయం కంటే దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా సంయుక్త విలేకరుల సమావేశం ప్రారంభమైంది. అంతకుముందు ఇరు పక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చోపచర్చలు సాగాయి. సంయుక్త ప్రకటనను ఇరుదేశాల ఉన్నతాధికారులు సిద్ధం చేయగా, దానికి ఇటు ప్రధాని నరేంద్రమోదీ, అటు బరాక్ ఒబామా ఇద్దరూ కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఒబామా ఎప్పుడొస్తారా అని చాలాసేపు బయట ఇరు దేశాల మంత్రులు, జాతీయ.. అంతర్జాతీయ మీడియా ఆసక్తిగా ఎదురు చూడటం కనిపించింది. ఈలోపు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు అమెరికా బృందంతో మాటా మంతీ సాగించారు.

Advertisement
 
Advertisement
Advertisement