‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి ఎలాగైనా బయటపడేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ‘అన్ని’ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అడుగడుగునా అడ్డదారులు తొక్కుతున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఏపీ పోలీస్ అధికారులను అడ్డంగా వాడేసుకుంటున్నారు. ఏసీబీ విచారణకూ అడ్డుపడే యత్నం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను డుమ్మా కొట్టించడం, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, నిఘా విభాగం ఐజీ శివధర్‌రెడ్డిల కాల్‌డేటా కోసం మొబైల్ ఆపరేటర్లపై ఒత్తిడి తేవడం, ఫోరెన్సిక్ నిపుణుడు కేపీసీ గాంధీని ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడం వంటివన్నీ అందులో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యలను చూసి ప్రజలు, ఏపీ పోలీస్ అధికారులే విస్తుపోతుండడం గమనార్హం.