ఉజ్వల భవితకు పాలిటెక్నిక్‌ | - | Sakshi
Sakshi News home page

ఉజ్వల భవితకు పాలిటెక్నిక్‌

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

● జిల్లాలో కళాశాలలు, కోర్సుల వివరాలు

కడప ఎడ్యుకేషన్‌: పదో తరగతి తర్వాత వేగంగా ఉపాధి పొందే అవకాశాలు కలిగిన కోర్సు పాలిటెక్నిక్‌. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేటు సెక్టార్‌లోను పాలిటెక్నిక్‌ వారికే పెద్దపీట వేస్తున్నారు. తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో ఉద్యోగ, ఉపాధిని సులభంగా పొందే వెసులుబాటు పాలిటెక్నిక్‌ డిప్లామా కోర్సుల ద్వారా ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో యువత పాలిటెక్నిక్‌పై ఆసక్తి చూపిస్తోంది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 28,152 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలను రాశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 9283 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు ఆపరాధ రుసుంతో పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకునే వెసలుబాటు ఉంది. దీంతో దరఖాస్తు సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

గ్రామీణ విద్యార్థులకు ఉపయుక్తం....

గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజనీరింగ్‌ వంటి అత్యున్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. వీరికి తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి పాలిటెక్నిక్‌ కోర్సులు వేదికగా నిలుస్తాయి. పాలిసెట్‌ ద్వారా పాలిటెక్నిక్‌ కోర్సులో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.

అమ్మాయిలకు ప్రత్యేకం...

కడపలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల అమ్మాయిలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌(ఈఈఈ), ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌(ఈసీ), సివిల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, డిప్లమా కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ ఈ కోర్సులు ఉన్నాయి. ఈ కళాశాలలో ఒక బ్రాంచికు 60 సీట్లు చొప్పున 240 సీట్లు ఉన్నాయి. దీంతోపాటు హాస్టల్‌ వసతి కూడా కలదు.

ప్రారంభమైన ఉచిత శిక్షణ...

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో పాలిసెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణతోపాటు మెటీరియల్‌ను అందించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి 1 గంట వరకు శిక్షణ నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఈ నెల 4వ తేదీ నుంచి ఉచిత పాలిసెట్‌ శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణ ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది.

ర్యాంకు సాధిస్తాం...

ఈ నెల 25వ తేదీ నిర్వహించే పాలిసెట్‌ ప్రవేశ పరీక్షలో తప్పకుండా ర్యాంకును సాధిస్తాం. కడప మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో తీసుకున్న కోచింగ్‌ నాకు బాగా ఉపయుక్తంగా ఉంది. బాగా చదువుకున్నాను. తప్పకుండా ర్యాంకు సాధిస్తా. – వినంత్‌ , విద్యార్థి, కడప

చక్కటి ఉపాధి

డిప్లొమా కోర్సులతో చక్కటి ఉపాధి లభిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడటానికి పాలిటెక్నిక్‌ సరైన మార్గం, విద్యార్థులకు ఇదో మంచి అవకాశం. డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందవచ్చు. ఉన్నత చదువు లకు సైతం ఉపయోగపడుతుంది.– సీహెచ్‌ జ్యోతి, పాలిసెట్‌ కన్వీనర్‌,

ప్రభుత్వ మహిళా పాటిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌, కడప.

ఉచిత మెటీరియల్‌తో ఉపయోగం

ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష కోసం ఇచ్చిన మెటీరియల్‌ బాగా ఉంది. దీంతోపాటు కళాశాలలో చెప్పిన ఉచిత కోచింగ్‌తో రెండింటితో తప్పకుండా ర్యాంకు సాధిస్తాం. – మధురిమ, విద్యార్థి,కడప

2పాలిటెక్నిక్‌ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌, మెకానికల్‌, సివిల్‌, ఇన్పిరేషన్‌ టెక్నాలజీ (ఐటి)తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. జిల్లాలోని కడప, పొద్దుటూరు, వేంపల్లి, సింహాద్రిపురం, జమ్మలమడుగు, మైదుకూరు, రాజంపేట, కమలాపురంలలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల పరిధిలో దాదాపు 3800 సీట్లు ఉన్నాయి. అలాగే జిల్లాలొ 12 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 4200 సీట్లు ఉన్నాయి. ఇలా మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిసి 8000 దాకా సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. దీనిలో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు.

పదో తరగతి విద్యార్థులకు చక్కటి అవకాశం

జిల్లాలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రారంభమైన ఉచిత పాలిసెట్‌ శిక్షణ

జిల్లావ్యాప్తంగా

9283 మంది దరఖాస్తు

25న పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష...

Advertisement
 
Advertisement
Advertisement