పెద్ద దస్తగిరి హత్య కేసులో 11 మంది నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పెద్ద దస్తగిరి హత్య కేసులో 11 మంది నిందితుల అరెస్ట్‌

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

కడప అర్బన్‌ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) ఆవరణలో ఈనెల 6వ తేదీ తెల్లవారుజామున కలమల్ల పెద్ద దస్తగిరి (53) అనే వ్యక్తిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన 11 మంది నిందితులను ఈనెల 18న జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం సమీపంలో ఇన్‌చార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో రిమ్స్‌ పీఎస్‌ సీఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రెండు కార్లు, మూడు ద్విచక్రవాహనాలు, సెల్‌ఫోన్లు , కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీరిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచగా రిమాండ్‌కు పంపించారు. అరెస్టయిన వారిలో చెన్నూరు టౌన్‌కు చెందిన ప్రైవేట్‌ ఫైనాన్స్‌ చేస్తున్న అన్నదమ్ముల్లో తమ్ముడు పేరం రవి, అన్న పేరం రాజు అలియాస్‌ రాజాను, కడప నగరం అలంఖాన్‌ పల్లెకు చెందిన అవ్వారి వెంకటేష్‌, తిరుపతి సురేంద్ర అలియాస్‌ సురేంద్ర అలియాస్‌ జాకీ, అలంఖాన్‌ పల్లె, రాణితోటకు చెందిన వనపర్తి వెంకట మనోహర్‌ అలియాస్‌ మనోహర్‌, వల్లూరు మండలం చిన్నలేబాక గ్రామానికి చెందిన లేవాకు ఉపేంద్ర రెడ్డి అలియాస్‌ ఉపేంద్ర, అలంఖాన్‌ పల్లెకు చెందిన గంధం విజయకుమార్‌, హరిగోపుల శివప్రసాద్‌, ఆదిమూలపు వెంకట నరేంద్ర అలియాస్‌ నరేంద్ర, కడప నగరం పక్కీరుపల్లెకు చెందిన గొడుగునూరు రామగోపాల్‌ వర్మ అలియాస్‌ వర్మ, సిద్దవటం మండలం వంతాటిపల్లెకు చెందిన పెయ్యల శివ ఉన్నారు. వీరు ఈనెల 6న తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) ఐపీ, ఓపీ భవనాల మధ్య ఉన్న తారురోడ్డులో కలమల్ల పెద్ద దస్తగిరి(53)ని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అలాగే అతని సోదరుడు చిన్న దస్తగిరిని కత్తిపోట్లకు గురి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనపై మృతుని కుమారుడు కలమల్ల వెంకట దస్తగిరి ఫిర్యాదు మేరకు రిమ్స్‌ పీఎస్‌ పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదుదారుడు వెంకట దస్తగిరి ఫిర్యాదులో తన తండ్రి రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా పనిచేస్తుండగా, తల్లి రమణమ్మ ఇంటి పనులు చూసుకునేది. అతని తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు, బీటెక్‌ చదువుతున్న అతని ఇద్దరు సోదరీమణులు నాగపద్మిని, రాగిణి. వెంకటదస్తగిరికి చదువులో అంతగా పట్టు లేకపోవడంతో, ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్మీడియట్‌ చదివి, రెండోసంవత్సరం పరీక్షలు రాసి, ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. ఈనెల 4వ తేదీన గ్రామంలో మారెమ్మ జాతర జరుగుతుండగా, వెంకట దస్తగిరి రాత్రి ఊరేగింపులో పాల్గొని, ఇతరులతో కలిసి డ్యాన్స్‌ చేస్తుండగా, ప్రమాదవశాత్తు వారి గ్రామానికి చెందిన హత్య కేసులో నిందితుడైన అవ్వారి వెంకటేష్‌ అలియాస్‌ వెంకీపై పడ్డాడు. దీంతో వెంకీ అతనిపై దాడి చేశాడు. వెంకట దస్తగిరి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పాడు. అతని తండ్రి, హతుడు పెద్ద దస్తగిరి, అతని మేనమామ చిన్న దస్తగిరి, ఇతర కుటుంబ సభ్యులు వెళ్లి అవ్వారు వెంకటేష్‌ అలియాస్‌ వెంకీని మందలించారు. దీంతో వెంకీ, అతని స్నేహితులు ఇంటికి తిరిగి వచ్చి జిల్లాపరిషత్‌ ఉన్న పాఠశాల సమీపానికి చేరుకున్నారు. వెంకీ స్నేహితులైన వనపర్తి వెంకట మనోహర్‌ అలియాస్‌ మనోహర్‌ వారిపై పగ పెంచుకున్నారు. ఈనెల 5వ తేదీ రాత్రి సుమారు 10 గంటలకు, వెంకటేష్‌, మనోహర్‌లు వెంకట దస్తగిరితో గొడవపడి దాడి చేశారు. అతను వెళ్లి తన తండ్రికి, తనకు కావాల్సిన వారికి చెప్పవచ్చని బెదిరించారు. అతను ఫోన్‌న్‌లో తన తండ్రికి ఈ విషయం తెలియజేశాడు. ఈ క్రమంలోనే మనోహర్‌తో పాటు, వెంకీ పెద్ద దస్తగిరి ఇంటికి వెళ్లి ఇంటిలోని వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వారంతా వైద్య సేవల కోసం కడప రిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లారు. వారికి సహాయం చేసేందుకు పెద్ద దస్తగిరి, చిన్న దస్తగిరితో పాటు, కుటుంబసభ్యులు వెళ్లారు. ఈనెల 5వ తేదీన అర్ధరాత్రి ఈ హత్య కేసులో అరెస్టయిన వారంతా కత్తులతో నేరుగా రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాల్లో రిమ్స్‌కు చేరుకున్నారు. 5వ తేదీ అర్థరాత్రి నుంచి కాపుకాసి, 6వ తేదీన తెల్లవారు జామున (3 గంటల ప్రాంతంలో రిమ్స్‌ ఐపీ, ఓపీ భవనాల మధ్యన పెద్ద దస్తగిరిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అలాగే అతని సోదరుడు చిన్న దస్తగిరిపై కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. తరువాత తాము వచ్చిన వాహనాల్లో పరారయ్యారు. మారెమ్మ తిరునాలలో జరిగిన చిన్న ఘర్షణ ఒక వ్యక్తి హత్యకు, మరొకరు ప్రాణాపాయస్థితికి చేరుకునేలా చేసిందని పోలీసులు ప్రాథమిక విచారణ ద్వారా నివేదికలో పేర్కొన్నారు. ఎట్టకేలకు కడపలోని పోలీసు శిక్షణా కేంద్రం (డీపీటీసి) సమీపంలో నిందితులను అరెస్ట్‌ చేసి, ఆదివారం మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. రిమాండ్‌ కోసం కడప కేంద్రకారాగారానికి పంపించామని రిమ్స్‌ పీఎస్‌ సీఐ రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఇంకా ఈ హత్య కేసును సమగ్రంగా దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

పథకం ప్రకారమే హత్య చేశారని విచారణలో వెల్లడి

Advertisement
 
Advertisement
Advertisement