మైదుకూరు జాతీయ రహదారిపై కారు బీభత్సం | - | Sakshi
Sakshi News home page

మైదుకూరు జాతీయ రహదారిపై కారు బీభత్సం

Apr 17 2026 10:38 AM | Updated on Apr 17 2026 10:38 AM

మైదుకూరు/చాపాడు: కర్నూలు – చిత్తూరు, బళ్లారి – నెల్లూరు జాతీయ రహదారులపై ఓ యువకుడు గురువారం ఉదయం కారుతో బీభత్సం సృష్టించాడు. సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి కారులో వస్తూ ఓ యువకుడు కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై వైఎస్సార్‌ కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడరు వద్ద నుంచి మైదుకూరు వరకు, నెల్లూరు – బళ్లారి జాతీయ రహదారిపై మైదుకూరు నుంచి చాపాడు మండలం పల్లవోలు వరకు సుమారు 42 కిలోమీటర్ల మేర ఇష్టారాజ్యాంగా కారు నడుపుతూ ముందు వైపు ఉన్న వాహనాలను కారుతో ఢీకొట్టాడు. సంఘటనలో మైదుకూరుకు చెందిన ఎల్లాల భైరవ కొండయ్య (45)అనే వ్యక్తి బైక్‌పై ప్రొద్దుటూరుకు వెళుతుండగా చాపాడు మండలం పల్లవోలు వద్ద ఆ కారు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంతకుముందు మైదుకూరు పట్టణ శివారులోని శ్రీనగరం వద్ద ఉదయం 7.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ నుంచి తన స్నేహితునితో కలిసి రాజంపేటకు చెందిన కార్తీక్‌ అనే యువకుడు ప్రయాణిస్తున్న కారును వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. వెంటనే ఎడమవైపునకు కారును నడిపి దువ్వూరు మండలం గొల్లపల్లెకు చెందిన మోహన్‌రెడ్డి, శంకర్‌రెడ్డి అనే వారు గ్రామం నుంచి బైక్‌పై మైదుకూరు వస్తుండగా అదే కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ముందుగా మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. వారిలో శంకర్‌ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటనలో రాజంపేటకు చెందిన కార్తీక్‌, అతని స్నేహితుడు ఎలాంటి గాయాలకు గురికాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తన కారును వెనుక వైపు నుంచి ఢీకొట్టడంపై కార్తీక్‌ మైదుకూరు అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీభత్సం సృష్టించిన అదే కారు తొలుత దువ్వూరు మండలం కానగూడురు వద్ద ఓ పూల వ్యాపారిని ఢీకొన్నట్టు తెలుస్తోంది. పల్లవోలు వద్ద మోటార్‌ బైక్‌ను ఢీకొట్టిన అనంతరం చాపాడు పోలీసులు కారు నడుపుతున్న యువకున్ని అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. కారుతో బీభత్సం సృష్టించి ప్రమాదాలకు కారణమైన ఆ యువకుడు కడపకు చెందిన కొట్టే ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. సంఘటనపై యువకుడిని విచారించారు. ఈ సందర్భంగా చాపాడు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య మాట్లాడుతూ పల్లవోలు వద్ద జరిగిన సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని తెలిపారు. భైరవ కొండయ్య మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఒకరు మృతి:

ఇద్దరికి తీవ్ర గాయాలు

Advertisement
 
Advertisement
Advertisement