చక్రాయపేట: వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం రాయచోటి – వేంపల్లె 440 జాతీయ రహదారిపై గాలివీడు క్రాస్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు చక్రాయపేట మండలం చిలేకాంపల్లె గ్రామం నారపురెడ్డిగారిపల్లెకు చెందిన మారం నాగిరెడ్డి (32), మరొకరు అన్నమయ్య జిల్లా రాయచోటి తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వేంపల్లె వాసి కుందా శేఖర్(56)లుగా పోలీసులు గుర్తించారు. ప్రత్యక్ష సాక్షులు, మృతుల బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మారం నాగిరెడ్డి మరో వ్యక్తితో కలిసి చిలేకాంపల్లె క్రాస్ నుంచి నాగులగట్టుపల్లి వరకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. ఈ క్రమంలో గాలివీడు క్రాస్ దాటగానే ముందు వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వేంపల్లెకు వస్తున్న శేఖర్ బైక్‌ను ఢీకొన్నారు. దీంతో నాగిరెడ్డితోపాటు శేఖర్‌లు కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనను చూసి పొలాల నుంచి తాము పరిగెత్తుకుంటూ వచ్చేలోపే నాగిరెడ్డితో పాటు ఉన్న మరో వ్యక్తి పారిపోయినట్లు తెలిపారు. కుందా శేఖర్ రీసర్వేలో భాగంగా వేంపల్లె వద్ద ఉన్న తన పొలాలకు చూడటానికి రెవెన్యూ అధికారులు వస్తున్న విషయం తెలుసుకుని కార్యాలయంలో సెలవు చీటీ ఇచ్చి ఇంటికి వస్తూ ప్రమాదానికి గురై మృతి చెందాడని కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. శేఖర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడని, కుమారుడు చదువుకుంటున్నట్లు బంధువులు తెలిపారు. అలాగే నాగిరెడ్డికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారని బంధువులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చంద్రశేఖర్ సిబ్బందితో వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.
మారం నాగిరెడ్డి (ఫైల్) కుందా శేఖర్ (ఫైల్)


