ముద్దనూరు : మండలంలోని పెద్దదుద్యాల గ్రామ సమీపంలో ఆదివారం ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదవశాత్తు అదే ట్రాక్టర్ క్రింద పడి డ్రైవరు శ్రీనివాసులు(44) దుర్మరణం చెందాడు.ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి సమాచారం మేరకు ముద్దనూరులోని యానాది కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు తన కుటుంబంతో కలిసి సుంకేసుల, పెద్దదుద్యాల గ్రామాల్లో తాడిపత్రికి చెందిన వ్యక్తి పొలాల్లో పనిచేస్తున్నాడు.ఆదివారం సాయంత్రం సుంకేసుల నుంచి పెద్దదుద్యాలలోని పొలంలోకి ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తున్నాడు.ప్రధాన రహదారి నుంచి పక్కకు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి పడిపోయింది.ఈ ప్రమాదంలో శ్రీనివాసులు ట్రాక్టర్ క్రింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కార్డన్ సెర్చ్ ఆపరేషన్
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చిన్నచౌకు పీఎస్ పరిధిలోని వైఎస్‌ఆర్ కాలనీలో చిన్నచౌకు సీఐ ఓబులేసు ఆధ్వర్యంలో కడప టూ టౌన్ సీఐ జి.ప్రసాద రావు, ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బందితో శ్రీఆపరేషన్ వజ్రప్రహార్‌శ్రీలో భాగంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులు, అనుమానితుల ఇళ్లలో, అనుమానిత ప్రాంతాల్లో అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాల రికార్డులను పరిశీలించారు. సరైన రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తులు ఎవరూ ఎలాంటి గొడవలకు పాల్పడకుండా మీరు మీ పనులు చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి లేదా అనుమానితుల సమాచారాన్ని డయల్ 112 ద్వారా పోలీస్ శాఖకు సమాచారమివ్వాలని సూచించారు. ఎవరూ రికార్డులు లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు.
12న జిల్లా నూర్‌బాష్
సంఘ సమావేశం
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా నూర్‌బాష్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే కార్యక్రమం ఈనెల 12వ తేది కడప నగరం ఎర్రముక్కపల్లెలోని సంఘ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వి.ఖాదరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సంఘ కార్యవర్గ కాలపరిమితి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపధ్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. కనుక జిల్లాలోని అసోసియేషన్ ప్రతినిధులు హాజరు కావాలని కోరారు.


